బుద్ధునిపై ఇన్ని అబద్ధాలా..!?
ABN, First Publish Date - 2023-08-30T04:34:12+05:30
‘ప్రపంచం బుద్ధుణ్ణి సరిగ్గానే అర్థం చేసుకుంది. ఒక్క మన దేశంలోనే... అర్థం చేసుకోలేదు. బుద్ధుడు వక్రీకరించబడ్డాడు’ అనే సత్య వాక్కుతో ప్రారంభమయ్యింది, ఆగస్టు 13న ‘బుద్ధుడు వైదిక మత వ్యతిరేకా?...
‘ప్రపంచం బుద్ధుణ్ణి సరిగ్గానే అర్థం చేసుకుంది. ఒక్క మన దేశంలోనే... అర్థం చేసుకోలేదు. బుద్ధుడు వక్రీకరించబడ్డాడు’ అనే సత్య వాక్కుతో ప్రారంభమయ్యింది, ఆగస్టు 13న ‘బుద్ధుడు వైదిక మత వ్యతిరేకా?’ అనే శీర్షికతో వచ్చిన వ్యాసం. దీనికి ఒకింత సంతోషం. కానీ.... ఆ తర్వాత వ్యాస రచయిత రోచిష్మాన్ ఈ సత్య వాక్కుని తీసి గట్టున పెట్టేశారు. బుద్ధుణ్ణి లాక్కొచ్చి అమానవీయ భావజాల పంకిలంలోకి పడేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. శతాబ్దాలుగా బౌద్ధాన్ని, బుద్ధుణ్ణి తిరిగి తమవాడిగా ప్రకటించుకోవడంలో వైదిక మతాలు వెనుకాడడంలేదు. వైదిక మత విరోధి అయిన బుద్ధుడు క్రీ.శ. 7వ శతాబ్దం తరువాత మెల్లగా దశావతారాల్లో చేరిపోయాడు. క్రీ.శ. 8వ శతాబ్దంలో శంకరాచార్యులవారు తన ‘‘దశావతార స్తోత్రం’’లో బుద్ధుణ్ణి యజ్ఞవిరోధిగానే చెప్పారు. విష్ణుసహస్రనామాల్లోని మూడు శ్లోకాల్లో (782వ పేరు నుండి 806వ పేరు వరకు) పాతిక పేర్లు బుద్ధునికి సంబంధించినవే. వీటిలో కూడా బుద్ధుణ్ణి అహింసావాదిగా, యజ్ఞవిరోధిగానే చెప్పారు. శ్రీనాథుడు తన శృంగారనైషధంలో, పోతన కుమారుడైన మల్లన తన రుక్మాంగద చరిత్రలో, ముద్దుపళని తన రాధికాసాంత్వనంలో, జయదేవుడు తన అష్టపదుల్లో బుద్ధుణ్ణి యజ్ఞవిరోధిగానే చెప్పారు. పశుహత్యని నిరసించిన జీవ కారుణ్యమూర్తిగానే కీర్తించారు. కానీ, ఈ వ్యాసకర్త మాత్రం తన వ్యాసంలో ‘ఒక్క దమ్మపదం సరిగ్గా చదివినా బుద్ధుడు వైదికవాది అని తెలిసిపోతుంది’ అని తీర్మానించారు.
వైదికులు అంటే వేద ప్రామాణికతను అంగీకరించేవారు. దాని ప్రకారం నడచుకునేవారు. వేదాన్ని పఠిస్తూ, మంత్రోచ్ఛారణలతో వైదిక క్రతువులూ, కర్మకాండలు జరిపించేది బ్రాహ్మణులే కానీ, బ్రాహ్మణులంతా వైదికులు కాదు. వేదకాలం వారు యజ్ఞయాగాలే మోక్ష మార్గంగా భావించారు. జంతుబలి ద్వారా స్వర్గమార్గం దక్కుతుందని నమ్మారు. ‘అగ్నిమీళే పురోహితం’ అంటూ గొంతెత్తి పలికారు. యజ్ఞయాగాల్లో పశుహత్యను నిందించినవాడూ, వ్యతిరేకించినవాడూ, అలాంటి యజ్ఞాలు జరక్కుండా ఆపి ‘యజ్ఞ విరోధిగా’ పేరు తెచ్చుకున్న బుద్ధుడు ఎలా వైదికవాది అయ్యాడో ఈ వ్యాసకర్తకే తెలియాలి. అలాగే... బ్రహ్మ, బ్రాహ్మణ, దేవత... అనే ఇలాంటి పదాల్ని పట్టుకుని ఇవ్వన్నీ వైదిక పదాలే కాబట్టి బుద్ధుడు కూడా వైదికుడే అని తెగేసిచెప్పారు వ్యాసకర్త. తాత్త్విక, ధార్మిక, ఆధ్యాత్మిక గ్రంథాల్లోని పదాల్ని వ్యావహారిక పదాలుగా మార్చి, భావించి వాటిమీద వ్యాఖ్యానం చేయకూడదు. షడ్దర్శనాల్లో ఒకటైన అర్థధర్మమీమాంస గ్రంథంలోని ‘ధర్మం’, రసాయన శాస్త్రంలో చెప్పే మూలకాల ‘ధర్మం’, ‘ధర్మం చెయ్‌బాబూ’ అంటూ మిస్సమ్మలో రేలంగి పాడే పాటలోని ‘ధర్మం’, బౌద్ధంలోని ధమ్మపదంలోని ధమ్మం (ధర్మం).... ఈ పదాలన్నింటిదీ ఒకే నిర్వచనం కాదు. దేని నిర్వచనం దానిదే! బౌద్ధంలో... కోర్కెల్ని జయించి, జ్ఞానోదయం పొందిన దివ్వుల్నే దేవతలు అంటారు. అలాగే ‘బ్రాహ్మణ’ అనే పదం కూడా. బౌద్ధం ప్రకారం శీలసంపద కలవాడే బ్రాహ్మణుడు కానీ బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు కాదు.
ఈ వ్యాసకర్త ధమ్మపదంలోని 26వ అధ్యాయంలో 10వ శ్లోకం ‘యంహా ధమ్మం...’ని ఉటంకిస్తూ – (బౌద్ధ పద్యాల్ని గాథలు అంటారు. శ్లోకాలు అనరు) ‘యజ్ఞంలోని అగ్నిని జ్ఞానిగా చూపాడు బుద్ధుడు, అలాగే... యజ్ఞంలోని అగ్నిని ఉత్కృష్టమైంది అని కూడా బుద్ధుడు చెప్పాడు’ అన్నారు. అయితే... ఆయన ఉటంకించిన గాథ అర్థం ఇది: ‘బ్రాహ్మణుడు యజ్ఞానికి ప్రణమిల్లినట్లు, జ్ఞాని అయిన బుద్ధునికి నమస్కరించాలి’ అని. ఇక్కడ బుద్ధుడు ‘యజ్ఞం, బ్రాహ్మణుడు’ అనే మాటల్ని ఉపమానంగా తీసుకోవడం ఈ వ్యాసకర్తకి ‘ఎలక’ దొరికినట్టయ్యింది. దానితో కొండను తవ్విన శ్రమను కూడా మర్చిపోయారు. ప్రతివారూ ఎవరి వృత్తి పరికరాలకి వారు నమస్కరించుకుంటారు. అలాగే యజ్ఞం మీద ఆధారపడి బతికే బ్రాహ్మణుడు అగ్నిహోత్రాన్నే నమస్కరించుకుంటాడు. మరి, ధర్మాన్ని (బౌద్ధ ధమ్మాన్ని) ఫలంగా పొందాలనుకునేవాడు సంబుద్ధునికే నమస్కరిస్తాడు గదా! ఆ దృష్టితో ఉపమానంగా ధమ్మపదం చెప్పింది. అయితే అంతటితోనే ఆగలేదు... ఈ గాథ తరువాత, వెంటనే మరో గాథలో ‘అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు?’ అని నిర్వచించింది ధమ్మపదం ‘న జటాహి... న గోత్తేన...’ అంటూ. అంటే జటలవల్ల (రకరకాల జటలు, పిలకలు), గోత్రం వల్ల, జన్మవల్ల ఎవ్వరూ బ్రాహ్మణుడు కాడు. సత్యం పలికేవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, మనోవాక్కాయ కర్మలయందు శుచీశుభ్రత కలవాడు మాత్రమే బ్రాహ్మణుడు అని ఈ గాథ అర్థం. ఇలా ధర్మపదంలోని 26వ వర్గాన్ని మొత్తం చూడాలి. చూసి వ్యాఖ్యానించాలి.
ఇక, ఈ రచయిత ధమ్మపదంలో 7వ అధ్యాయంలోని 5వ గాథలోని ఇంద్రియ నిగ్రహాల విషయం చెప్తూ... మనుస్మృతిలోని (2–60) శ్లోకాన్ని ప్రామాణికంగా సూచించారు. పైగా బుద్ధుడు ఇదే శ్లోకాన్ని ధమ్మపదంలో తీసుకున్నాడు అని చెప్పారు. అసలు స్మృతులు ఎప్పటివి? మనుస్మృతి కంటే ముందున్న స్మృతులేవి? అనే విషయాన్ని ఆలోచిస్తే ఇలా రాయరు. ఈ శ్లోకంలో వచ్చే విషయాలు ఇవి: ఇంద్రియ నిగ్రహం, రాగద్వేషాలు విడనాడడం, అహింస. మనుశాస్త్రంలోని పురుషాధిపత్యాన్నీ, కులవ్యత్యాసాన్నీ, అంటరానితనాన్ని, శూద్ర కులాల బానిసత్వాన్నీ బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విషయాన్ని మాత్రం రచయిత కప్పివేశారు. గోబెల్స్ ప్రచారం అంటే ఇదే!
ఇక, ఇంకో హాస్యాస్పదమైన విషయం ఇంద్రియాల్ని గుర్రాలతో బుద్ధుడు పోల్చాడు, ఇదే పోలిక కఠోపనిషత్తులో ఉంది అంటే ఉపనిషత్తుల విషయాన్నే బుద్ధుడూ చెప్పాడనేది. బౌద్ధ తాత్త్వికత, ఉపనిషత్తుల దార్శనికత, షట్ దర్శనాల సారం తెలిస్తే ఇలాంటి చచ్చుపుచ్చు విషయాలు ప్రస్తావించరు. ఇంద్రియాల్ని గుర్రాలతో పోలుస్తూ భారతీయ తత్త్వంలో అనేక చోట్ల ఉంది. అప్పటికి వేగవంతమైన వాహనం రథం, జంతువులు గుర్రాలే. కాబట్టి వాటితోనే పోలుస్తారు. ఇక, రోచిష్మాన్ వ్యాసంలో అతి ముఖ్యమైన విషయం ‘బుద్ధుడు ప్రతి అంగుళంలో హిందువే’ అనేది. అసలు చిక్కు ‘హిందూ’ అనే పదం వైదిక మతానికి ఎప్పటి నుండి వచ్చింది అనేది. సనాతనులు చెప్పిన శైవం, వైదికం, శాక్తేయం, గణాపత్యం, సౌరం, కాపాలికం అనే షణ్మతాల్లో హిందూ పదం లేదు. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కనీసం పురాణాల్లో కూడా హిందూ అనేపదం కనిపించదు. ‘హిందు’ అనే పదానికి అర్థం ‘కాఫిర్’ అని కొందరు పీఠాధిపతుల ఉవాచ. అయితే... సింధూనది పేరుని బట్టి హిందూ అనే పదం వచ్చింది. దీనికి క్రీ.పూ. వేల సంవత్సరాల నాటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ సింధూ పదం మధ్య ఆసియా (పర్షియా) భాషలో హిందు అయ్యింది. ఈ హిందు పదం ఐరోపా భాషల్లో ‘ఇండూ’ అయ్యింది. అదే ‘ఇండియా’గా మారింది. చారిత్రకంగా చూస్తే ఆర్యులు తప్ప మూల భారతీయులందరూ హిందువులే. సింధూ నాగరికత వికాస ఫలాలే. బుద్ధుడు కూడా మూల భారతీయ గణాలకి చెందినవాడే. విదేశీ ఆర్యుడు కాదు.
బుద్ధుడు తన చివరి క్షణాల్లో ‘అప్పో దీపోభవ’ అన్నాడనీ దాని అర్థం ‘నీరుగానూ, దీపంగానూ ఉండు’ అని రోచిష్మాన్ తన పాండిత్యాన్ని వలకబోశారు. ‘బ్రహ్మసూత్రాల్లో బ్రహ్మం అంటే నీరు, అలాగే జ్యోతి అంటే వెలుగు ...ఈ భావన కూడా వైదిక గ్రంథాల నుండి బుద్ధుడు తీసుకుందే! వేదవాణినే బుద్ధుడు వినిపించాడు’ అని వ్యాసాన్ని ముగించారు. విషయం ఏమిటంటే ...బుద్ధుడు మహాపరినిర్వాణం పొందే ముందు ‘భగవాన్! మీ తరువాత మమ్మల్ని నడిపించే నాయకుడు ఎవరు?’ అని భిక్షువులు అడిగినప్పుడు, బుద్ధుడు ‘అత్త దీపో...! అత్త సరణో...! ... అనణ్ణ సరణో...’ అన్నాడు. అంటే మీకు మీరే దీపం కండి. మీకు మీరే శరణుకండి! ఇతరులెవరూ మీకు శరణు కాదు! దీపం కాదు అని. ఇలా బుద్ధుడు తప్ప ప్రపంచంలో ‘మీకు మీరే దీపంకండి... మిమ్మల్ని మీరే నడిపించుకోండి’ అని చెప్పిన తాత్త్వికుడుగానీ, జ్ఞానిగానీ, మత ప్రబోధకుడుగానీ... ఎవ్వరూ... ఎక్కడా... ఎప్పుడూ లేరు! అందుకే... ప్రపంచంలో ఈ రోజున అన్ని దేశాల్లో అంతో ఇంతో బౌద్ధం ఉంది. బౌద్ధ సంఘంలేని దేశం దాదాపుగా లేదు!
‘ధమ్మ’ అనే పాళీ పదానికి అర్థం ధరించేది, వహించేది అని. ఏ పలుకుల్ని మనసు ధరించి దుఃఖపడదో, ఏ పలుకు వినడం వల్ల మనస్సు మలినరహితం అవుతుంతో అదే ధమ్మపదం. ధమ్మపదం, ధర్మపథం అనే పదాలు తప్పు. ధమ్మపదం త్రిపిటకాల్లో ఖుద్ధకనికాయంలో భాగం. ఇవి బుద్ధుడు ప్రత్యక్షంగా చెప్పిన గాథలు కావు. బుద్ధుని బోధనల సారం. అయితే, ధమ్మపదాన్ని ‘ధర్మపథం’ అనే సంస్కృత పదంగా భావించి ఈ వ్యాసకర్త ధర్మం అంటే పుణ్యం, న్యాయం, యజ్ఞం, ఉపనిషత్, వేదాంతం... అనే అర్ధాలు ఉన్నాయని చెప్పారు. తన పాళీ ప్రవచనాలకి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు వస్తాయని బుద్ధుడు ఆనాడే గ్రహించాడు. యమేలుడు, తేలకుడు అనే ఇద్దరు భిక్షువులు ‘భగవాన్! మీ సందేశాల్ని సంస్కృతంలోకి మారుస్తాం’’ అని అడిగారు. బుద్ధుడు ‘వద్దు’ అని వారించి, ‘ఇకపై నా సందేశాల్ని ఎప్పుడూ సంస్కృతంలోకి మార్చవద్దు’ అని ప్రకటించాడు. ఎందుకంటే... ఇదిగో... ఇలాంటి పెడర్ధాలు తీసేవారు ఉంటారనే! తన ధర్మాన్ని అపఖ్యాతి పాలుచేస్తారనే!!
వేద భాష వేరు, ఆ పదాలు వేరు, వాటి ఉత్పత్తులు, అర్థాలు వేరు. అలాగే ఉపనిషత్తుల, దర్శనాల భాష వేరు. వాటి పదాలూ, అర్థాలు వేరు. అదే విధంగా బౌద్ధం కూడా! మాయాబజారు సినిమాలో ఘటోత్కచుడు సైతం తమ రాక్షస గురువుతో ‘చినమయా! చరిత్ర జ్ఞానం నేర్పు’ అంటాడు లంబూ, జంబులకి. చారిత్రక దృక్పథంతో జ్ఞానాన్ని జ్ఞానంగానే దర్శించాలి! అది రోచిష్మాన్ వ్యాసంలో పరిపూర్ణంగా కొరవడింది!
బొర్రా గోవర్ధన్
Updated Date - 2023-08-30T04:34:12+05:30 IST