నేరుగా జనహృదయాల్లోకి...!
ABN, First Publish Date - 2023-08-31T04:04:26+05:30
అరాచక పాలనపై నారా లోకేష్ పూరించిన సమరశంఖం యువగళం పాదయాత్ర. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టి, ప్రజాస్వామ్యాన్ని...
అరాచక పాలనపై నారా లోకేష్ పూరించిన సమరశంఖం యువగళం పాదయాత్ర. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టి, ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు యువనేత వినమ్రంగా ప్రజల ముందుకొచ్చారు. ప్రజాశ్రేయస్సే పరమావధిగా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తన గళంగా వినిపిస్తూ మొక్కవోని దీక్షతో, ఉరిమే ఉత్సాహంతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. తనపై వైసీపీ విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ, అసత్య ఆరోపణలను పటాపంచలు చేస్తూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ తన స్టామినా ఏంటో ప్రత్యర్థులకు తెలియజేస్తున్నారు. పాదయాత్ర లోకేష్‌కి తిరుగులేని మాస్ లీడర్ ఇమేజ్ తెచ్చిపెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మనకు పాదయాత్రలు కొత్తేం కాదు. గతంలో ఎందరో లీడర్లు పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. అయితే వీక్లీ ఆఫ్ పాదయాత్రను చూసిన ప్రజలకు నేడు విరామం లేని లోకేష్ పాదయాత్ర ఖచ్చితంగా ప్రత్యేకమే. అందుకే కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రజలు లోకేష్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల పట్ల ఆయన నిబద్ధతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాదయాత్ర చేసేప్పుడు కాళ్లకు బొబ్బలు వచ్చినా, చేతులకు గాయాలవుతున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా కష్టాల్లో ఉన్న ప్రజల చెంతకు చేరేందుకు యువనేత ముందడుగేస్తున్నారు. పార్టీ క్యాడరులో భరోసా నింపుతూ, ప్రజలతో మమేకమవుతూ తానున్నానంటూ కొండంత ధైర్యాన్నిస్తున్నారు.
ఓ వైపు వివిధ సామాజిక వర్గాలు, సంఘాలతో వరుస సమావేశాలు, ముఖాముఖీలు, బహిరంగసభలు, నాయకులతో సమీక్షలు జరుపుతూ మరోవైపు పోలీసుల అడ్డంకులు–వైసీపీ నేతల కవ్వింపులను ఎదురొడ్డుతూ ఒంటిచేత్తో యాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక పట్టుదల, క్రమశిక్షణ, సహనంలో తండ్రి చంద్రన్నను తనయుడు లోకేష్ మించిపోయాడని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇప్పుడు లోకేష్ రూపంలో టీడీపీకి మూడో తరం నాయకుడు వచ్చేశాడని పార్టీ నేతలు, కేడర్, తెలుగు ప్రజలు ఫిక్స్ అయిపోయారు.
ఇప్పటి వరకూ పాదయాత్ర జరిగిన ప్రతి జిల్లాలోనూ భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా యువత లోకేష్‌తో కలిసి నడుస్తున్నారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాక, ఉన్న పరిశ్రమలను తరిమేయడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తాము పడిన, పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. పాదయాత్ర సమయంలో లోకేష్ కొన్ని విషయాలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. కియా కార్ల పరిశ్రమతో సహా తమ హయాంలో వచ్చిన పెట్టుబడులను నారా లోకేష్ వివరిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల మీదుగా నడిచినప్పుడు ప్రత్యేకంగా వాటి దగ్గర నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. వాటిని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు వైసీపీకి ఛాలెంజ్ కూడా విసురుతున్నారు. ‘మేం కియాను తీసుకువచ్చాం, మీరు ఏం తెచ్చారో చెప్ప’మని నారా లోకేష్ వేస్తున్న పంచ్‌లు మాస్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. యువత నారా లోకేష్‌తో సెల్ఫీ దిగేందుకు క్యూ కడుతున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ లోకేష్ ఏకంగా గంట సేపు సమయం కేటాయిస్తున్నారు. మరోవైపు తన దగ్గరకు వచ్చే వారి సమస్యలను వింటున్నారు. తాము అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామని వారికి ధైర్యం చెబుతున్నారు. కొన్ని కొన్నిచోట్ల వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అభ్యర్థులపై స్పష్టత కూడా ఇస్తున్నారు.
తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒక రకమైన విభిన్న వాతావరణం ఉండేది. ప్రభుత్వ చర్యలు, వైసీపీ సోషల్ మీడియా వికృత చర్యలతో అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. లోకేష్‌ను పలుచన చేసే కవ్వింపు చర్యలు ఎదురయ్యాయి. బంగారుపాలెంలో పాదయాత్ర సమయంలో పోలీసుల నిర్బంధాలు, ఆంక్షలను లోకేష్ పటాపంచలు చేశారు. ఆయన ప్రసంగించే స్టూల్ లాగేసినా, వాహనాలు ధ్వంసం చేసినా, అక్రమ కేసులు బనాయించినా వెనకడుగు వేయలేదు. ఏకంగా బిల్డింగ్ పైకెక్కి సభ నిర్వహించడం ద్వారా ప్రజల కోసం తగ్గేదిలే అని సంకేతాలిచ్చారు. రాను రాను పాదయాత్రకు పెరుగుతున్న ప్రజాదరణ, లోకేష్ నిర్దిష్ట హామీలు, వాటి అమలుపై అవగాహన, ప్రణాళికాబద్ధమైన వ్యూహాలు చూసి ప్రత్యర్థులు తోక ముడిచారు.
రాయలసీమ ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక ప్రకటించి సీమ ప్రజల్లో లోకేష్ ఆలోచన రేకెత్తించారు. గతంలో వైసీపీని ఆదరిస్తే చేసిందేమీ లేదని, ఆదరించిన వాళ్లను భక్షించారని, కానీ అదే స్థాయి మద్దతు టీడీపీకి ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తామని అన్నారు. వెనుకబడిన రాయలసీమలో తమ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచారు. ఎక్కడికక్కడ వైసీపీ స్థానిక నేతల అవినీతి బాగోతాలను బయటపెడుతూ, దమ్ముంటే చర్చకు రావాలని సవాళ్లు విసిరారు. తిరుపతిలో నిర్వహించిన ‘హలో లోకేష్’ కార్యక్రమం యువతలో నూతనోత్సాహాన్ని నింపింది. మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖా పుంగనూరులోనే అతని అవినీతిని లోకేష్ ఎండగట్టారు. యువనేత ఇచ్చిన ధైర్యం టీడీపీ జిల్లా క్యాడర్ నూతనోత్సాహాన్ని నింపింది.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో యాత్ర సజావుగా జరగనిస్తారా అనే అనుమానాలను లోకేష్ పటాపంచలు చేశారు. కడప జిల్లా వాసులు లోకేష్ యాత్రకు బ్రహ్మరథం పట్టారు. కడప నడిబొడ్డులో రెడ్డి సామాజిక వర్గంతో సమావేశం ఏర్పాటు చేసి ఆ నలుగురు రెడ్లు తప్పా రాష్ట్రంలో మిగిలిన రెడ్లంతా బాధితులే అని లోకేష్ ప్రపంచానికి చెప్పారు. రాయలసీమ యాత్ర పూర్తయిన సందర్భంగా సీమ డిక్లరేషన్ ప్రకటించారు. యాత్ర నెల్లూరులోకి ప్రవేశించే క్రమంలో సీమ నేలకు ముద్దు పెట్టి మీ బిడ్డను అక్కున చేర్చుకున్నందుకు రుణపడి ఉంటాను, సీమ నేలతల్లి రుణం తీర్చుంటానని అని లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు.
వైసీపీ కంచుకోట నెల్లూరులో లోకేష్ యాత్ర ప్రవేశంతో ఆ కోటకు బీటలు వాలాయి. నెల్లూరు జిల్లాలో యువగళం యాత్ర ప్రారంభానికి ముందే వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లోకేష్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. నెల్లూరులో నిర్వహించిన మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఏం చేయబోతున్నారో లోకేష్ ప్రకటించారు. ప్రకాశం జిల్లా పాదయాత్రకు జనం పోటెత్తారు. అద్దంకిలో యువగళం పాదయాత్రకు ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. ఒంగోలులో నిర్వహించిన బీసీలతో లోకేష్ కార్యక్రమం ద్వారా టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తారో స్పష్టతనిచ్చారు. రాజధాని జిల్లా గుంటూరు, కృష్ణా జిల్లా పాదయాత్రకు ప్రజలు పోటెత్తారు.
నారా లోకేష్ పాదయాత్ర నిర్వహణకు 16 కమిటీలు పనిచేస్తున్నాయి. లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ యువగళం పాదయాత్రకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. నాడు చంద్రబాబు గారి ‘వస్తున్నా... మీ కోసం’ పాదయాత్రకు గరికపాటి మోహన్ రావు సమన్వయకర్తగా సమర్థవంతంగా వ్యవహరించినట్టే నేడు లోకేష్ పాదయాత్రకు కిలారి రాజేష్ పనిచేస్తున్నారు.
యాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా నారా భువనేశ్వరి యువగళం టీంకు స్వయంగా భోజనం వడ్డించి వారిని అభినందించారు. టీడీపీ నేతలు బీద రవిచంద్ర యాదవ్, రామ్ గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రాజు యాత్ర విజయవంతం కావడానికి జోన్ల వారీగా తమవంతు సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో యువగళం పాదయాత్ర బ్రహ్మాండంగా కొనసాగుతోంది. జగన్‌రెడ్డి అరాచక పాలనలో తాము ఎదుర్కొన్న సమస్యలు, ధరల పెంపు, చార్జీల మోతతో పడుతున్న ఇబ్బందులను ప్రజలు లోకేష్‌కి వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలు పరిష్కరిస్తామని, అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని, అర్హులకు సంక్షేమం అందిస్తామని హామీ ఇస్తూ లోకేష్ ముందడుగేస్తున్నారు.
మద్దిపట్ల సూర్యప్రకాశ్
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Updated Date - 2023-08-31T04:04:26+05:30 IST