ఉపాధ్యాయులు భావి సమాజ నిర్దేశకులు
ABN, First Publish Date - 2023-09-05T02:54:03+05:30
ప్రపంచ పరిణామాలను పరిస్థితులకు అన్వయించి భవిష్యత్ కాలానికి అనుగుణమైన నిర్ణయాలకు నాంది పలికించే కర్త ఉపాధ్యాయుడు. పిల్లలకు ప్రాథమికంగా గుణగణాలు, పద్ధతుల...
ప్రపంచ పరిణామాలను పరిస్థితులకు అన్వయించి భవిష్యత్ కాలానికి అనుగుణమైన నిర్ణయాలకు నాంది పలికించే కర్త ఉపాధ్యాయుడు. పిల్లలకు ప్రాథమికంగా గుణగణాలు, పద్ధతుల లాంటివి తల్లితండ్రుల నుండి లభించినప్పటికీ, యోగ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దేది విద్య మాత్రమే. ఆలాంటి విద్యనందించే ‘గురుతర బాధ్యత’ ఉపాధ్యాయుడిదే. దేశం అభివృద్ధిపథంలో పయనించేందుకు, శాస్త్రసాంకేతిక రంగాలలో విజయానికి నాణ్యమైన విద్య ఎంత కీలకమైందో, మానవాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతే ప్రధానం.
ప్రపంచ బ్యాంకు నిర్దేశంతో అమలులోకి వచ్చిన సరళీకరణ విధానాలతో ‘విద్య’ స్వభావమే మారిపోయింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, అత్యధిక ఆదాయాన్ని సృష్టించగల, జ్ఞాన సాధనంగా ‘చదువులను’ చూడడం ప్రారంభమైంది. తరగతి గది వాతావరణం, బోధించే పాఠ్యాంశాలు, స్వేచ్ఛగా బోధించగల పరిస్థితులు మారిపోయాయి. బోధనా పద్ధతులు, కాలవ్యవధి, మూల్యాంకనా విధానం లాంటి వన్నీ విద్యావేత్తల ప్రమేయం తగ్గి ప్రభుత్వాలే ప్రతి అంశాన్ని నిర్దేశించడం మొదలైంది. విద్యార్థులపై ఉపాధ్యాయుల నియంత్రణ ప్రశ్నార్థకమైంది. ‘విద్య’ మార్కెట్టు సరుకుగా, వినిమయ వస్తువుగా మారిపోయింది. దీనితో ఉపాధ్యాయుని స్థానం పలచబడింది. అత్యధిక మార్కులు సాధించే విధంగా విద్యార్థులను సంసిద్ధుల్ని చేసే యంత్రంగా మిగిలిపోతున్నాడు.
ఒకనాడు సమాజం ఉన్నతంగా గౌరవించే ఉపాధ్యాయుడు ఈనాడు చాలీచాలని వేతనాలు, సర్వీసు సమస్యలతోనూ ప్రభుత్వం, తల్లితండ్రుల, సమాజం అండదండలు లేక ఒంటరివాడైనాడు. రెగ్యులర్ ఉపాధ్యాయుల స్థానంలో అప్రెంటిస్, కాంట్రాక్టు, స్పెషల్ టీచర్, అవుట్ సోర్సింగ్, పార్ట్‌టైం, అవర్లీ బేస్డ్, అతిథి (గెస్ట్) లాంటి పేర్లతో, అరకొర వేతనాలతో ఉపాధ్యాయులుగా నియామకమై భారంగా కాలం వెళ్ళదీస్తున్న పరిస్థితి. ‘సమాన పనికి సమాన వేతనం’ అంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం చెప్పిన మాటకు విలువే లేకుండా పోయింది. రెగ్యులర్ టీచర్లు సైతం దశాబ్దాలతరబడి పదోన్నతులు లేక, ఖాళీ పోస్టుల మూలంగా సబ్జెక్టు టీచర్లపై పనిభారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది ఉపాధ్యాయుని సంక్షేమం పట్ల ప్రభుత్వానికున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. ‘‘ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైన, ఆకర్షణీయమైన వేతన విధానాన్ని కలిగి ఉన్నప్పుడే విషయ పరిజ్ఞానం, ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను ఆకర్షింపగలుగుతాము’’ అన్న కొఠారీ మాటలకు భిన్నమైన పరిస్థితులు నేడు ఉన్నాయనేది వాస్తవం. ఆనాడు మందగమనంతో ఉన్న విద్యార్థికి ఉపాధ్యాయుడు అండగా ఉంటూ సాంత్వనను, ఆసక్తిని కలిగించే పరిస్థితులుండేవి. నేడు పోటీ పరీక్షల వలయంలో, ర్యాంకుల పద్మవ్యూహంలో మానసిక ఒత్తిడితో, దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు ఆత్యహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ఉపాధ్యాయుడు కేంద్రంగాలేని బలమైన కృత్రిమ వ్యవస్థకు పరాకాష్ఠ ఇది.
‘‘దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది’’ అనే మాటలను మళ్ళీ మళ్ళీ మననం చేసుకునే ఆవశ్యకత నేటి సమాజానికి ఉన్నది. తరగతి గదిలో దేశ భావిరూపురేఖలకు మెరుగులు దిద్దే ఉపాధ్యాయులు శక్తిసంపన్నులని సమాజం, ప్రభుత్వాలు గుర్తించాలి. సమాజాన్ని ప్రభావితం చేసే, పరిస్థితులను సరిచేసే విశిష్ఠమైన పాత్రను పోషించే బాధ్యత కూడా ఉపాధ్యాయునికి ఉన్నది. తరగతి బోధనకే పరిమితం కాకుండా విద్యారంగంలో చోటుచేసుకుంటున్న ఫెడదోరణులను, వాటివల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలను విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు వివరించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. తమ సంక్షేమం సమాజ సంక్షేమంతోనే ముడిపడి ఉంటుందనే విషయాన్ని విస్మరించక విద్యారంగ వికాసంకోసం జరిగే ఆందోళనా పోరాటాలకు ప్రజలమద్దతును కూడగట్టాలి. బోధనా ప్రక్రియ ద్వారా విద్యార్థుల ఆలోచనల్లో కొత్త తేజస్సును నింపగలిగే ఉపాధ్యాయుడు విద్యార్థుల అభిమానం ద్వారానే సమాజ విశ్వాసాన్ని పొందగలుగుతాడు.
నేడు ఏ ప్రభుత్వాలు కూడా ‘ఉపాధ్యాయులు ఎలాంటి విద్యావ్యవస్థను ఆశిస్తున్నారు?’ అనే అంశాన్ని పట్టించుకోకపోవడం బాధాకరం. ఒకవైపు ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైపోతున్నా ప్రభుత్వ ఉదాసీనత నుండి దానిని కాపాడలేని బలహీనులుగా ఉపాధ్యాయులు మారిపోయారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నించే, ఆ చైతన్యానికి నాయకత్వం వహించి ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని క్రియాశీలక శక్తులు చేసే ప్రయత్నాలను సైతం నిలువరించడానికి పాలక పక్షాలు అవకాశవాదులను చేరదీయడం మూలంగా విద్యారంగాన్ని నిరాశా నిస్పృహలు కమ్మేస్తున్నాయి.
జీవితంలో ఏనాడూ తాను ఎదగలేదనే అసంతృప్తి లేని ఉపాధ్యాయులు ఉన్నత స్థానానికి ఎదిగిన విద్యార్థులు తమకు ఎదురైనపుడు వారి ఉన్నతిని తమ గొప్పతనంగా భావించి అనిర్వచనీయమైన ఆనందానికి లోనవుతారు. తమ విద్యార్థుల ద్వారా దేశసౌభాగ్యంలో భాగస్వాములమైనామని సంతృప్తి చెందుతారు. అది ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యం.
పాపన్నగారి మాణిక్‌రెడ్డి
ఉపాధ్యాయ నాయకులు, రిటైర్డ్ టీచర్
Updated Date - 2023-09-05T02:54:03+05:30 IST