ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది!

ABN, First Publish Date - 2023-10-06T02:16:12+05:30

గెలవని రాజుకు గప్పాలు మెండు అన్న చందంగా ప్రవర్తిస్తున్న అధికారపక్షం పార్టీ నాయకుల తీరుతో ప్రజాభివృద్ధి వంటి సంకల్పాలకు చెదలు పడుతున్నాయి. పోను పోను జనాకర్షణ శక్తి కోసుకుపోతున్నా...

గెలవని రాజుకు గప్పాలు మెండు అన్న చందంగా ప్రవర్తిస్తున్న అధికారపక్షం పార్టీ నాయకుల తీరుతో ప్రజాభివృద్ధి వంటి సంకల్పాలకు చెదలు పడుతున్నాయి. పోను పోను జనాకర్షణ శక్తి కోసుకుపోతున్నా వాస్తవిక దృక్పధాన్ని అలవరుచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఇష్టపడడం లేదు. అందుకే గడపగడప, నా నమ్మకం నువ్వే, వైనాట్ 175, మళ్లీ జగన్ ఎందుకు? ఇలాంటి కార్యక్రమాలతో ఎలాగోలా ప్రజల్లోకి వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. మరో వైపు ప్రతిపక్షం ప్రజా విశ్వాసమే ఊపిరిగా ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా, అన్ని ఒడుదుడుకులను తట్టుకుంటూ ఎదురు నిలబడేందుకు ప్రయత్నిస్తోంది.

సర్కారీ విధానాల్లోని లోటుపాట్లను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తున్న ప్రతిపక్ష పార్టీపై అక్రమ కేసులు, అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేలా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏ ఒక్క సాక్ష్యాధారాలు లేని స్కిల్ డవలప్‌మెంట్ కేసులో అన్యాయంగా, అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేశారనేది నిష్ఠుర సత్యం. చట్టబద్ధమైన కర్తవ్య పాలనకు పూచీ పడాల్సిన కొంత మంది ఉన్నతాధికారగణాలు జగన్ ఏలుబడిలో తెంపరితనంతో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. జాతి నేత జనహిత ఆదర్శాలను అందిపుచ్చుకోలేకపోయిన ఖాకీలు పౌర హక్కులకు ప్రథమ శత్రువుగా అవతరించారని దేశ అత్యున్నత న్యాయస్థానం ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గతంలో వ్యాఖ్యానించారు. నేడు వైసీపీ జేబు సంస్థలా సీఐడీ మారిపోయింది. నేరస్థులపై ప్రయోగించాల్సిన అస్త్రాలను ప్రతిపక్ష నాయకులపై, వారి కదలికలపై ప్రయోగిస్తూ ప్రతిపక్ష పార్టీలను అణచివేసే క్రమంలో సీఐడీ అధికార పార్టీకి పావులా మారింది.

నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలను అణచివేయడం ఎందుకు? నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎందుకు? అన్న ప్రశ్న ప్రతి ఒక్క సామాన్యుడి మదిలో మెదులుతోంది. దాల్ మే కుచ్ కాలా హై అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ తప్పును ప్రతిపక్షాలు ప్రజలకు చేరవేస్తున్నాయి కాబట్టే అక్రమ అరెస్టులు వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాను చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్న సామెత తాజా పరిస్థితులకు అద్దం పడుతున్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు కాబట్టి తమ ప్రత్యర్థులకు సైతం అవినీతి మరకలు అంటించే ప్రయత్నానికి ఒడిగడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు బెయిల్ వస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీఐడీ న్యాయస్థానాలకు చెబుతోంది. కాని ముఖ్యమంత్రి పదేళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు కదా మరి ఆయన తన కేసుల్లో సాక్ష్యులను ప్రభావితం చేయరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ లాంటి వటవృక్షాన్ని కూకటివేళ్లతో పెకలించే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. చంద్రబాబును అరెస్ట్ చేసి లబ్ది పొందాలని చూసిన జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యావత్ తెలుగు జాతి అంతా ఒక్కటయ్యి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. ప్రజలతో పాటు మేధావులు, సీనియర్ అధికారులు సైతం రాష్ట్రానికి బాబు అవసరాన్ని గుర్తించారు. పక్క రాష్ట్రం అధికారపక్షం నాయకులు సైతం చంద్రబాబు అరెస్టుపై తొలుత స్పందించలేదు. చివరకు ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత పెరిగిపోవడంతో వారు స్వరం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లుగా ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తిపరచలేకపోయారు. 98 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్నారు గాని నిజానికి 10 శాతం హామీలను సైతం పరిపూర్ణంగా నెరవేర్చలేకపోయారు. జగన్‌రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇక అయిపోయింది. దానినే ఆయన ఆఖరి ఛాన్స్‌ చేసుకున్నారు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి

Updated Date - 2023-10-06T02:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising