పార్లమెంటుకు వచ్చింది, ప్రతిపక్ష కళ!
ABN, First Publish Date - 2023-02-09T01:19:36+05:30
మౌనానికి ఎన్ని అర్థాలుంటాయి? అర్ధాంగీకారం, అహంకారం మాత్రమే కాదు, సమాధానం చెప్పలేని తనం, భయం కూడా అర్థాలు కావచ్చు...
మౌనానికి ఎన్ని అర్థాలుంటాయి? అర్ధాంగీకారం, అహంకారం మాత్రమే కాదు, సమాధానం చెప్పలేని తనం, భయం కూడా అర్థాలు కావచ్చు. అదానీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనానికి పైన చెప్పిన అన్ని అర్థాలూ ఉన్నాయా?
ఇదేదో రాజకీయ వాదవివాదాల విషయం మాత్రమే కాదు. సాంకేతిక విషయాలు తెలియకపోవచ్చును కానీ, ఏదో తప్పు జరిగిందని, ఆ తప్పు వెనుక ప్రభుత్వ ప్రాపకం ఉన్నదని జనం చెవికి కొన్ని సంగతులు వెళ్లాయి. అది నిజమా కాదా తెలుసుకోవడం ప్రజల హక్కు. మితిమీరిన, లెక్కకు చిక్కని సంపదను పోగుచేసుకోవడంలో ఉండే దురాశ, అసభ్యలోభం ఒక ఎత్తు. ఆ పోగుచేయడానికి కావలసిన వాతావరణంలో సమృద్ధిగా అసత్యం, అక్రమం ఉండడం వేరు. పాలకులు, వ్యాపారులు చెట్టపట్టాలు వేసుకోవడం ఎప్పటి నుంచో ఉన్నది, ఒకరినొకరు పోషించుకోవడమూ అనాదిగా ఉన్నది కానీ, ఒకే ఒక్కరిని, తక్కినవారిని తొక్కి మరీ పైకెక్కాలనుకునే ఒక్కరిని, ఏలికలు ఎత్తుకుని పైకెత్తడం మాత్రం నూట ఒకటో తప్పు. జనంలో అనుమానపు అసహనం బలపడడానికి ఈ అతి కారణం. అదానీ అంటే భారత ఆత్మగౌరవమే అంటూ పెద్ద పెద్ద సంస్థలే భుజం కాయడానికి ముందుకు వస్తున్నాయి కానీ, పప్పులో ఏదో నలుపు ఉన్నదని తేలిపోయింది. నిజంగా ఏమీ లేకపోతే, నోరువిప్పడానికి ఏమి నొప్పి? విచారణ జరపడానికి ఏమి అభ్యంతరం?
పాపం, అదానీ ఎదురీదుతున్నారు. పోయిన ప్రతిష్ఠను, జారిపోయిన షేరువిలువను తిరిగి సమకూర్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే, అతనిని గట్టెక్కించే అదృశ్యహస్తాల చిరునామాలు ఢిల్లీ రాచవీధులలో దొరకవచ్చు. కీలకమంతా ఎక్కడ ఉన్నదో, ప్రధాని మౌనంలోనే కాక, ధన్యవాదాల ప్రసంగంలోని నర్మగర్భపు నిష్ఠూరపు మాటలలోనూ కనుగొనవచ్చు.
అనేక సంవత్సరాల తరువాత, ప్రజాస్వామ్యం తన ఉనికి కోసం గట్టిగా పెనుగులాడిన సన్నివేశం భారత పార్లమెంటులో ఈ సారి చూశాము. ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ పార్టీతో కలసి గొంతువిప్పిన అనేక ప్రతిపక్షాలు కాదు. అధికార స్వరానికి ప్రతిస్వరమే ప్రజాస్వామ్యం. బలమైన దేశం కావాలి కానీ, ప్రజల ముందు బలహీనమైన ప్రభుత్వమే కావాలి. ఏకపార్టీ ఆధిపత్య రాజకీయాలు కాదు, బహుళసంకీర్ణ రాజకీయాలు కావాలి. ప్రజలు తమ బలాన్నంతా ఏ ఒక్కరికో అప్పగింతలు పెట్టినప్పుడల్లా, అది భస్మాసుర హస్తమై యజమానినే మింగాలని చూస్తుంది. ఎదురులేని, తిరుగులేని చట్టసభల బలంతో పాటు, సామాజిక సాంస్కృతిక దాష్టీకం కూడా కలగలసిన నిరంకుశాధికారంతో చెలరేగుతున్న అధికారశ్రేణులకు, గట్టి నిలదీతలు ఎదురయినందుకు హర్షించవలసిన సమయం. రేపు భారతీయ జనతాపార్టీ అధికారం కోల్పోయి, ప్రజాస్వామిక స్థలం దొరకని నిస్సహాయతలో పడినప్పుడు కూడా, ఆ ఉక్కపోతను పౌరసమాజం నిరసిస్తుంది. ఇప్పటి సందర్భం, ప్రజలు, సమాజం తమ ఒత్తిడులను ప్రభుత్వం మీద ప్రభావవంతంగా వేయడానికి ఒక అవకాశం లభించడం. ఒక కూటమిగా మారకపోయినా, ఒకే కోవకు చెందకపోయినా, పరస్పరం విభేదాలు అనేకం ఉన్నా, అనేక ప్రతిపక్షాలు గొంతుకలిపాయి. అందుకని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు జేజేలు.
రాహుల్ గాంధీలో జోడో యాత్ర తీసుకువచ్చిన పరిపక్వత కనిపిస్తున్నదని, అతను ఎంత మాత్రమూ అర్భకపు అసమర్థ నాయకుడు కాదనీ అభిమానులూ, తటస్థులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలలో నాయకత్వాల అవతరణ, వారి వేషభాషలు, ప్రదర్శిత వ్యక్తిత్వాల వల్ల మాత్రమే జరగదు. అవసరమైన సమయంలో ప్రభావవంతమైన వైఖరి తీసుకోగలగడం, పర్యవసానాలను గుర్తెరిగి సాహసంతో వ్యవహరించడం ముఖ్యం. భారత సమాజానికి కావలసినది ఐక్యత అన్న ప్రాధాన్యాన్ని గుర్తించినప్పుడే రాహుల్ ఒక పరీక్షను దాటగలిగాడు. ఆశ్రిత కార్పొరేట్ వాదం మీద, అదానీ మీద స్పష్టమైన వైఖరి తీసుకోవడం కూడా అతని ప్రయాణంలో ఒక మలుపు. మునుపే చెప్పినట్టు కాంగ్రెస్ ఒడిలో పెరిగిన కార్పొరేట్లు లేకపోలేదు. రేపు రాహుల్ పాలనలోనూ కార్పొరేట్లు ఆశ్రయం పొందకుండానూ ఉండరు. ఇప్పుడు రంగం మీదకు వచ్చిన, అనేకమందిని ఏకం చేస్తున్న సమస్య, అన్ని పరిధులను అతిక్రమించిన, పెట్టుబడిదారుల మధ్య కూడా సమానావకాశాలకు అవకాశమివ్వని మాఫియా కార్పొరేటిజం.
రాహుల్ గాంధీని మాత్రమే కాదు, తృణమూల్ మహువా మొయిత్రాను కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ప్రజాజీవితంలో గట్టిగా, ఘాటుగా, నిర్భయంతో మాట్లాడగలిగే నిబద్ధత కలిగిన నాయకులు ఒకరిద్దరయినా ఎంతటి ప్రభావం వేయగలరో, మొయిత్రా ప్రసంగం చెబుతుంది. పేర్లు కూడా ప్రస్తావించకుండా, తన విమర్శకులను పరోక్షంగా ఉద్దేశించి ప్రధాని తన ప్రసంగంలో తరచు ఎద్దేవా చేయడం ప్రత్యేకంగా కనిపించింది. అదానీ విషయంలో మాట్లాడాలన్న నిర్దిష్ట డిమాండ్‌కు ఆయన స్పందించలేదు కానీ, రాహుల్ గాంధీ, ఇతరులు చేసిన విమర్శలకు ప్రతివిమర్శలు చేయకుండా వదలలేదు. కాంగ్రెస్ హయాంలోని అవినీతిని, అసమర్థ పాలనను, తన పాలనలో సాధించిన ప్రథమస్థానాలను ఆయన చెప్పుకుంటూ పోయారు. కొద్ది నెలలుగా, మతవిభజనల ఆధారంగా ఏదో ఒక రాజకీయ సంవాదాన్ని ప్రచారంలో పెట్టడం తగ్గిపోయింది. మైనారిటీలను కలుపుకుపోయే మాటలు మొదలయ్యాయి. ఈ సారి పద్మ అవార్డులలో కూడా మైనారిటీల సంఖ్య పెరిగింది. ప్రపంచం వేయి కళ్లు పెట్టి చూస్తున్నది కాబట్టి, రాబోయే ఎన్నికల ముందు ఉద్వేగపూరిత అంశాలను ఎక్కువగా ప్రయోగించే అవకాశం లేకపోవచ్చును. ఒకరకంగా, నిరాయుధ పరిస్థితే. జనజీవన సమస్యల మీద, అదానీ వంటి అంశాల మీద ప్రజాభిప్రాయాన్ని నిర్మించడానికి ప్రతిపక్షాలకు ఒక మంచి అవకాశం.
బడ్జెట్ సమావేశాలలో బిఆర్ఎస్ సరళి ఎట్లా ఉంటుందన్నది తెలంగాణలోనే కాక, ఇతరత్రా కూడా ఒక ఆసక్తిదాయమైన అంశం. అదానీ విషయంలో బిఆర్ఎస్ ఆ వైఖరి తీసుకోవడం విశేషమే. సభలో కాంగ్రెస్ నిరసనలు చెబుతున్నప్పుడు, తోడుగా నిలబడడం కూడా విశేషమే. ప్రత్యేకతను నిలుపుకోవడానికో, ముందే నిర్ణయించిన వైఖరికి కట్టుబడో కానీ, రాష్ట్రపతి ప్రసంగాన్నీ, ధన్యవాదాలు చెప్పే చర్చను కూడా బిఆర్ఎస్ బహిష్కరించింది. కాంగ్రెస్ తదితర పక్షాలు సభను భంగపరిచే వ్యూహాన్ని మానుకుని, చర్చలో పాల్గొనడానికి సమ్మతించగా, ఆప్, బిఆర్ఎస్ మాత్రం వేరు వైఖరి తీసుకున్నాయి. ఆప్, బిఆర్ఎస్ మధ్య ఆచరణాత్మకమైన మైత్రి స్థిరపడేట్టే కనిపిస్తున్నది.
చట్టసభలకు, ఎన్నికలకు వెలుపల మరో రణస్థలమున్నది. దానిమీద దృష్టి పెడితే తప్ప, మహాబలులతో బలహీనులు పోటీపడలేరు. అది సామాజిక మాధ్యమ రంగం. అదానీ వ్యవహారంలో దేశభక్తిని, జాతీయతను రంగరించి సమర్థనలను, ప్రతివాదాలను రూపొందించే కార్యక్రమం తీవ్రంగానే సాగుతున్నది. ఔచిత్యపరిధులు దాటినందువల్ల, దానిని పూర్తిగా విశ్వసించడానికి ప్రభుత్వాభిమానులు కూడా సంకోచిస్తున్నారు కానీ, నిలకడగా ప్రయత్నమైతే జరుగుతున్నది. ప్రధాన రాజకీయ రంగస్థలం మీద మతతత్వం వంటి విభజన అంశాలు వెనుకపట్టుపట్టాయి కానీ, సామాజిక మాధ్యమాలలో ద్వేషభాషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలను చాపకింద నీరులా ప్రభావితం చేయడం వల్ల కలిగే ప్రయోజనం తెలిసినవారు, ఈ ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో కనిపిస్తున్న మార్పు ఏమిటంటే, సామాజిక మాధ్యమాలలో వాదోపవాదాలు ఏకపక్షంగా ఉండడం లేదు.
భారతీయ జనతాపార్టీ స్థాపన జరిగినప్పుడు, అది తన రాజకీయ తాత్వికత గాంధేయ సోషలిజం అని చెప్పుకున్నది. సాంస్కృతిక జాతీయత మాత్రమే కాక, ఆర్థిక జాతీయతను, సమానత్వాన్ని కూడా ఆదర్శాలుగా చెప్పుకుంది. సోషలిస్టులు, కమ్యూనిస్టులు చెప్పినట్టుగా ఆస్తుల జాతీయం, నిరంకుశంగా సమానత్వస్థాపన వంటి వాటిని తాము అంగీకరించబోమని, అయితే, వివిధ వర్గాల ఆదాయాల మధ్య పదిరెట్లకు మించి అంతరం లేనట్టుగా చూస్తామని ఆనాటి పూర్వజనసంఘ కార్యకర్తలు చెప్పేవారు. పదిరెట్లు కాదు, వేయిరెట్లు అంతరం ఉన్నా పర్వాలేదేమో కానీ, భారతదేశంలో సామాన్యుడికి, అదానీకి ఉన్న ఆదాయాల, ఆస్తుల అంతరం ఎంత? నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే, నల్లధనాన్ని నిర్మూలించి, ప్రతి కుటుంబం ఖాతాలోనూ పదిహేను లక్షలు జమచేస్తారని జనం నమ్మారు. ఆ నమ్మకానికి కారణమేమిటో తెలియదు. కానీ, నిజంగానే భారతదేశంలోని నలభై కోట్ల కుటుంబాలకు ఒక్కోదానికి పదిహేను లక్షలు ఇచ్చినా, అదానీ ఆస్తులు సగం కూడా తరిగిపోవు. అందుకేనేమో, సుబ్రహ్మణ్యస్వామి వంటి అస్మదీయ అసమ్మతీయ నాయకుడు కూడా అదానీ ఆస్తులు జాతీయం చేయాలని డిమాండ్ చేశాడు!
కె. శ్రీనివాస్
Updated Date - 2023-02-09T01:19:39+05:30 IST