ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీమను ఎడారి చేసే చీకటి చట్టం!

ABN, First Publish Date - 2023-10-31T03:08:02+05:30

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధి కోసం అక్టోబర్ 6, 2023న ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చాయి. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి...

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధి కోసం అక్టోబర్ 6, 2023న ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చాయి. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ కేంద్ర మంత్రివర్గం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ చీకటి చట్టాన్ని తెచ్చింది. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని విచారణాంశాలను (టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)ను సమూలంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చీకటి చట్టం తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం బరితెగించి, రాజకీయ లబ్ధి కోసం ఈ చీకటి చట్టం చేసింది. రాయలసీమను బలిపీఠం పైకి ఎక్కించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ప్రాజెక్టువారీగా కాకుండా, ఒక ఏకమొత్తంగా తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి పంపకం చేయాలనే అంశాన్ని విచారణాంశంగా (టెర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పచెప్పారు. అలాగే గోదావరి జలాలను పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్ళించడం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలకు పంచే అంశాన్ని విచారణాంశంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పచెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం ద్వారా ఆదా అయ్యే జలాలను రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలకు పంచే అంశాన్ని విచారణాంశంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పచెప్పారు. తెలంగాణ రాష్ట్రం తమ ప్రాంతంలోని కృష్ణా నది మీద ఆధారపడిన ప్రాజెక్టులకు గోదావరి జలాలను మళ్ళించడం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంచే అంశం విచారణాంశంగా ఈ చీకటి చట్టంలో తీసుకురాకపోవడం గమనార్హం.

ఈ చీకటి చట్టం వల్ల రాయలసీమకు నష్టం అపారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా ఉన్న 811టిఎంసీలలో సగం వాటా కావాలని కోరిన తెలంగాణకు అనుకూలంగా చేపట్టిన జీవో వలన ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది.‌ విభజిత ఆంధ్రప్రదేశ్ 512 టిఎంసిల నీటి హక్కులలో కొంతమేరకైనా హక్కులు కోల్పోతాం. కెసి కెనాల్, ఎల్.ఎల్.సి, హెచ్.ఎల్.సి, ఎస్.ఆర్.బి.సి. నీటి వాటాల్లో కోత వలన రాయలసీమ‌ సాగునీటికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా డెల్టాలో ఆదా అయ్యే నీరు, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు కాకుండా తెలంగాణ ప్రాజెక్టులకు లబ్ధి చేకూరుస్తుంది.‌ అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఆదా అయ్యే 80 టిఎంసీల కృష్ణా జలాలలో రాయలసీమ నీటిని పొందడం అటుంచి, ఉన్న నీటి హక్కులను కూడా కోల్పోతుంది.‌ ఈ 80 టిఎంసీలలో గతంలో జరిగిన అంతర్ రాష్ట్ర నదీ ఒప్పందాల వలన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు 35 టిఎంసీలు పోగా మిగిలే కృష్ణా జలాలు 45 టిఎంసిలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టం వలన పోలవరం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే ఈ 45 టిఎంసీలలో కూడా తెలంగాణ సగ భాగం అంటే 22.5 టిఎంసీల హక్కు పొందితే, ఇక మనకు ఆదా అయ్యే కృష్ణా జలాలు 22.5 టిఎంసీలు మాత్రమే.

ఇరవై ఏళ్ళ క్రితం కృష్ణా డెల్టా ఆధునీకరణ వలన మిగిలే 29 టిఎంసిల జలాలలో 20 టిఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీమా ఎత్తిపోతల పథకానికి, 9 టిఎంసీలను పులిచింతల పథకానికి కేటాయింపులు చేసారు. బీమా ఎత్తిపోతల పథకం శ్రీశైలం రిజర్వాయర్‌కు, జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉండటం వలన శ్రీశైలం వద్ద ఆదా అవుతాయి అనుకుంటున్న 22.5 టిఎంసీలలో 20 టిఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరకముందే వినియోగం అయిపోతాయి. ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్‌లోనికి నికరంగా చేరేది కేవలం 2.5 టిఎంసీలు మాత్రమే. పులిచింతలకు కేటాయింపులు చేసిన 9టిఎంసీల నీటిని కూడా శ్రీశైలం రిజర్వాయర్ నుండే తీసుకోవడం వలన శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుతాయని అనుకుంటున్న 2.5 టిఎంసీలు చేరకపోగా, రాయలసీమ హక్కుగా ఉన్న 6.5 టిఎంసీల నీళ్లను కూడా కోల్పోతాం.

ఈ అంశంలో రాయలసీమ వాసులు తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నోటిఫై కానందున నీటి పంపకం పునఃసమీక్ష జరగాలంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో కలిసి నాలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సి ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే ఈ అంశానికి తెరలేపింది. పార్లమెంటు ద్వారా చట్టబద్ధమైన హక్కులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పొందిన హక్కులను క్యాబినెట్ నిర్ణయాలతో బుట్టదాఖలు చేశారు. అంతర్ రాష్ట్ర నది వివాదాల పరిష్కార చట్టం– 1956 ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ నిర్ణయాలను మార్చే హక్కు సుప్రీంకోర్టుకు కూడా లేకున్నా కేంద్ర ప్రభుత్వం తన కండ బలంతో రాజ్యాంగ విరుద్ధంగా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నది. మరోపక్క కన్నబిడ్డల లాంటి రాష్ట్ర ప్రజల హక్కులు హరించిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నట్టు నటిస్తున్నది.

రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణ పట్ల విశ్వసనీయత కూడగట్టుకోలేని ప్రభుత్వం, ఈ చీకటి చట్టంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నది. ప్రభుత్వ ప్రకటనలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదు అనడానికి అనేక ఉదాహరణలు ప్రజలకు తెలుసు. ఈ సంక్లిష్ట పరిస్థితులలో రాయలసీమ సమాజం మేల్కొని సాగునీటి హక్కులను కాపాడుకోకపొతే మన భావితరాలకు నివాసయోగ్యం కాని ఎడారిని మిగిల్చినవారిమౌతాం.

బొజ్జా దశరథ రామిరెడ్డి

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు

Updated Date - 2023-10-31T03:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising