ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికలవేళ ఆవహిస్తున్న భయాలు!

ABN, First Publish Date - 2023-10-04T01:28:24+05:30

సార్వత్రక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మన దేశం కొన్ని అద్భుత విజయాలను సాధించింది. చంద్రయాన్‌ 3 కానివ్వండి, జి20 శిఖరాగ్రం కానివ్వండి, భారతదేశాన్ని నిలువెత్తున...

సార్వత్రక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మన దేశం కొన్ని అద్భుత విజయాలను సాధించింది. చంద్రయాన్‌ 3 కానివ్వండి, జి20 శిఖరాగ్రం కానివ్వండి, భారతదేశాన్ని నిలువెత్తున నిలబెట్టిన మాట వాస్తవం. ‘మేము విజయాల మీద ఫోకస్‌ పెట్టటం కంటే, అపజయాలను తొలగించుకోవటం మీదనే దృష్టిపెట్టాం’ అని ఇస్రో శాస్త్రజ్ఞులు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రస్తుతం భారతదేశం చేయాల్సిన పని కూడా అదే.

మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదింపచేయటం గొప్ప విషయమే. కొత్త పార్లమెంట్‌ సౌధంలో ప్రత్యేక సమావేశాలు పెట్టడం ద్వారా ఎవరూ కాదనలేని పరిస్థితిని కల్పించి మోదీ చాకచక్యంగా దీన్ని తన ఖాతాలో స్వంత విజయంగా వేసుకున్నారు. కానీ ఆ రిజర్వేషన్లు తమకు ఎప్పటికి అందుతాయన్న దానిమీదే మహిళలు దృష్టి సారిస్తే వారు ఈ విజయాన్ని అంతగొప్పగా భావించరేమో. ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’ గురించి మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏం తేల్చగలదు? సాధ్యమని ఏ గణాంకాలతో, అనుభవాలతో దేశం దృష్టికి తేగలదు? అదంతా ఒక ఎన్నికల జిమ్మిక్ అని ప్రజలు అనుకునే ప్రమాదాన్ని కమిటీ తప్పించగలదా?

నిప్పుల కొలిమి ‘మణిపూర్‌’ ఇంకా నిప్పురవ్వలను చిందిస్తూనే ఉంది. ఈశాన్య భారత ప్రాంతమంతా ఆ నిప్పులు వ్యాపించే అవకాశం ఉంది. మిజోరం – మిజోస్‌, మణిపూర్‌ కుకీస్‌, జోమీస్‌, వీళ్ళే గాకుండా మైన్మార్‌ చిన్‌స్‌, బంగ్లాదేశ్‌ కుకీ–బినీస్‌... ఇలా సాలెగూడులా ప్రమాదం అల్లుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యలు దేశవాసులకు పూర్తి విశ్వాసాన్ని కలిగించటం లేదు. నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగ్‌లిం (ఎన్‌ఎస్‌సియన్‌ – ఎల్‌ఎమ్‌) అనే సంస్థ భారతదేశానికి ఎక్కువ సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది. దాన్ని నివారించే చర్యలు ప్రభుత్వం చేపడుతున్న దాఖలాలు లేవు. కెనడాలోని ఖలిస్థాన్‌ టెర్రరిస్టులు అక్కడి ప్రభుత్వ సహాయంతో పెచ్చరిల్లుతున్నారు. అది మరో ప్రమాద ఘంటిక.

సనాతన ధర్మం, అధునాతన ధర్మం, మార్క్స్‌ ధర్మం, శ్రామిక ధర్మం... ఒకటేమిటి అన్ని ధర్మాలూ ఒకేసారి మన ధర్మభూమి మీద దండయాత్ర మొదలెట్టాయి. సీబీఐ, సీఐడీ, ఐడీ, ఎన్‍ఐఏలు స్వధర్మాన్ని మరిచిపోయి ప్రభుధర్మాన్ని మాత్రం విధిగా ఆచరిస్తున్నాయి. ఇదే యుగ ధర్మమని మనల్ని నమ్మబలికిస్తున్నాయి.

ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించారు. పశ్చాత్తాపం చెంది ప్రజాస్వామ్య మార్గంలోకి మళ్లారు. ఎంక్వయిరీ కమిషన్లను ఎదుర్కొన్నారు. పార్లమెంటు నుంచి బహిష్కృతమయ్యారు. అయినా తన పాలన ధర్మయుతంగా లేదని చెప్పిన జయప్రకాష్‌ నారాయణ్‌ని ఏమాత్రం కక్ష ధోరణిలో చూడకుండా పరివర్తనను ప్రపంచానికి చాటటానికి ఆయన ఆశ్రయమే పొందింది. పి.వి. నరసింహారావు, వాజపేయి ప్రధానమంత్రులుగా రాజకీయ తప్పులు చేసినా, విపక్షాలను ద్వేషించలేదు, కక్షపూరిత ధోరణిని అవలంబించలేదు. పీవీకి స్వపక్షమే విపక్షంగా మారినా రాజకీయ నాయకుడిగా సహనాన్ని కోల్పోలేదు. సోనియా– మన్మోహన్‌ సింగ్ పాలనలో తమ పార్టీ వారిపైనే ఎంక్వయిరీలు వేసి, కేసులు పెట్టి జైలుకు పంపారు. అంతేతప్ప రాజకీయ శత్రువులను అడ్డంగా నలిపేద్దాం అనే ధోరణిలో వ్యవహరించలేదు.


ప్రధానమంత్రి మోదీ దార్శనికుడిగా, ప్రజాశ్రేయోభిలాషిగా పేరు గాంచిన ప్రముఖుడు. కానీ మీడియాను శాసించి చెప్పుచేతల్లో వుంచుకొనే విధానం ఆయనకు తెలిసి జరుగుతున్నదో, తెలియక జరుగుతున్నదో కానీ ప్రజాస్వామ్యంలోని ఒక స్తంభం బలహీనపడి ఊగిసలాడుతున్నది. పార్టీని బలోపేతం చేసే క్రమంలో తస్మదీయులు, అస్మదీయులు అవుతున్నారు, అస్మదీయులు అకారణంగా తస్మదీయులవుతున్నారు. కేంద్రీకృత వ్యవస్థలే ప్రస్తుత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలుగా మిగిలాయి.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి పోవటానికి నిబంధనలు పెరుగుతున్నాయి. పోలీసులు రూల్‌ బుక్‌లో లేని ప్రయోగాలను అత్యుత్సాహంతో చేస్తున్నారు. నిర్బంధంలోకి తీసుకున్న తర్వాతనే ఆరోపణలకు ఆధారాలు సేకరిస్తామని దర్యాప్తు సంస్థలు నిర్ద్వంద్వంగా చట్టాలకు కొత్త భాష్యాలు చెపుతున్నాయి. వందమంది అపరాధులకు శిక్ష పడకపోయినా ఫర్వాలేదు కానీ ఒక నిరపరాధిని శిక్షించగూడదని పూర్వం అనుకొనేవారు. అపరాధికీ నిరపరాధికీ తేడా గమనించే రోజులు క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతున్న సూచనలు నేడు కనపడుతున్నాయి.

భారతదేశం ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా జరుపుకుంటుందన్న మంచి పేరు స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ ఉంది. ఎన్నో క్లిష్ట రాజకీయ ఒడిదుడుకుల్లోనూ ఆ పేరును దేశం కాపాడుకుంటూనే వచ్చింది. కానీ ప్రస్తుతం ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయనే నమ్మకం సడలిపోతున్నది. బయటకు తెలియని ఎన్నో అడ్డంకులు, కుట్రలూ, కుతంత్రాలు, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వీరవిహారానికి పూనుకొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు, ఎన్నికల్లో గెలవటమే పరమావధిగా భావించి ఎంతకైనా బరితెగిస్తాయేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజల నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.

రావులపాటి సీతారాంరావు

Updated Date - 2023-10-04T01:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising