ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘‘ఆధునిక తొలి స్త్రీవాద పద్య కవయిత్రి’’

ABN, First Publish Date - 2023-10-15T03:08:27+05:30

కవయిత్రి తిలక, అభినవ మొల్ల బిరుదులు, హంస, కీర్తి పురస్కారాల గ్రహీత, ప్రథమ స్త్రీవాద ప్రబంధకర్త, నూతన పోకడల ప్రయోగశీలి, సాహితీ సామ్రాజ్య పట్టపురాణి, అక్షరవాణి, కవితల బాణి...

కవయిత్రి తిలక, అభినవ మొల్ల బిరుదులు, హంస, కీర్తి పురస్కారాల గ్రహీత, ప్రథమ స్త్రీవాద ప్రబంధకర్త, నూతన పోకడల ప్రయోగశీలి, సాహితీ సామ్రాజ్య పట్టపురాణి, అక్షరవాణి, కవితల బాణి కొలకలూరి స్వరూపరాణి. (పుట్టింటి పేరు నడకుర్తి రత్నజా స్వరూపరాణి). పద్య కవిత్వంలో దిట్ట. గేయ కవిత్వం హైకూలు, రుబాయిలు, ద్విపద కావ్యాలు, గజల్స్, పౌరాణిక నృత్య నాటికలు, పరిశీలన గ్రంథాలు, విశ్లేషణ గ్రంథాలు దాదాపు 20 పద్య, గద్య, వచన, కవితా గ్రంథాలను వెలువరించారు. తెలుగు సాహిత్యంలో హైకూల ప్రక్రియను సాహితీకరించిన మొదటి రచయిత్రిగా ప్రస్తుతించబడినవారు కొలకలూరి స్వరూపరాణి. భక్తాంజలి, ఏసుక్రీస్తు వాదన అనే దండకాలు, గంగావతరణ శివతాండవము(ద్విపద కావ్యం 1979), చంద్రగ్రహణం (పద్య ప్రబంధం 1980), ప్రబోధం(వచన కవితా సంపుటి), నన్నయ మహిళ (విమర్శనాత్మక గ్రంథం 1985), ప్రణయ కుంతి, కరువు చెరలో రైతులు, వాయునందన శతకం, గోల పడవ (స్వీయ ఆంగ్లానువాదంతో హైకూ సంపుటి) అనే రచనలు బహుళ ప్రాచుర్యం పొందాయి.

గుంటూరు జిల్లా తెనాలి గోవాడ గ్రామంలో మే 1, 1943లో జన్మించారు. తల్లి ఇంటూరి మంగమ్మ ఉపాధ్యాయురాలు. ‘ప్రథమ సౌందర్యం’ కథా రచయిత్రి. తండ్రి నడకుర్తి వెంకట రత్నకవి జిల్లా బోర్డ్ ఆఫీసులో క్లర్క్, స్వాతంత్ర్య పోరాటంలో జైలు జీవితం అనుభవించాడు. ఆయన సంస్కృతాంధ్రంలో పాండిత్యం ఉన్న గొప్ప కవి. శివకేశవుల యుద్ధం (పద్యనాటకం), ధ్యానాంజలి, బాలకోటేశ్వర తారావళి, మహోదయం పద్యకవిత్వం, ప్రాణం తీసిన దానం (కుల నిర్మూలన సామాజిక నాటకం) ఆనాడు జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ విముక్తితో పాటు కుల సమాజాలు కూడా విముక్తి జరగాలనే చైతన్యంతో పద్యకావ్యాలు, నాటకాలు రాసినవాడు, ‘కవి భూషణ’ బిరుదాంకితుడు. చదువు లేని ఎస్సీ పిల్లల్ని మిషనరీ బడుల్లో విస్తృతంగా చేర్పించి, వారు విద్యావంతులు కావడానికి విశేష కృషి చేసిన చరిత్ర కొలకలూరి స్వరూపరాణి తల్లిదండ్రులది. ఇల్లంతా సాహితీకారులు, కళాకారులతో కళకళలాడుతూ ఉండేది. కొలకలూరి స్వరూపరాణి కుటుంబాలు మిషనరీస్ స్కూళ్లల్లో చదువుకున్న దళిత క్రైస్తవులు.

స్వరూపరాణి గుంటూరులో చదువుకొని, టీచర్ ట్రైనింగ్ చేసి అనంతపురం జిల్లా సోమఘట్టలో, ప్రకాశం జిల్లాలోనూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేశారు. తల్లిదండ్రులు సాహితీకారులు కావడంతో, ఇంటి వాతావరణమంతా సాహితీమయంగా ఉండడంతో, తన చిన్ననాటి నుంచే పద్యాలు అల్లడం మొదలైంది. అట్లా ‘గైడు కానుక’ అనే కవిత ‘స్కౌట్’ అనే పత్రికలో అచ్చయిన తన మొదటి కవిత. స్వరూపరాణి తండ్రి నడకుర్తి వెంకట రత్నకవి సంస్కృతాంధ్ర ఆంగ్ల పండితుడైనా, జాతీయ ఉద్యమంలో సంఘసంస్కర్తయినా, తల్లిదండ్రులకు శిష్యులుగా ఉన్న ఆధిపత్య కులం వాళ్ళు కూడా తమని చిన్నచూపు చూడడాన్ని నిరసిస్తూ చిన్ననాడే పద్యాలు అల్లింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంస్కృత, ఆంగ్లంలో పాండిత్యం సంపాదించి అగ్రహార సంస్కృత పండితులకంటే దీటుగా, మేటిగా, దేశీ, మార్గ చందస్సులతో పద్య రచనలు చేసిన సాహితీ ప్రతిభామూర్తి కొలకలూరి స్వరూపరాణి.

‘ఆంధ్ర కవయిత్రులు’ పుస్తకంలో ఒక్క దళిత కవయిత్రిని కూడా ప్రస్తావన చేయని ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ఆ పుస్తక మలిముద్రణ(1980)లో కొలకలూరి స్వరూపరాణిని గొప్ప పద్య కవయిత్రిగా కొనియాడక తప్పలేదంటే, స్వరూపరాణి రచనా ప్రతిభాపాటవాలు ఎంత ప్రభావితములో అర్థమవుతుంది.


ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం ‘చంద్రగ్రహణం’ పద్య కావ్యాన్ని సమీక్ష చేస్తూ కొలకలూరి స్వరూపరాణిని తొలి దళిత స్త్రీవాద కవయిత్రిగా కొనియాడారు. 1974లో భారత ప్రభుత్వం ఆర్యభట్టు ఉపగ్రహాన్ని పంపించిన సందర్భాన్ని పురస్కరించుకొని ‘చంద్రగ్రహణం’ అనే స్త్రీవాద ప్రబంధ పద్యకావ్యాన్ని రాసింది. భారతీయ సాహిత్యంలో చంద్ర గ్రహాన్ని చంద్రుడిగా, పుమ్ లింగంగా చూసిన సంప్రదాయాన్ని పక్కకు పెట్టి కొత్త ఒరవడిగా స్త్రీ లింగంగా చెప్పిన ఆధునిక ప్రయోగం. చంద్రుణ్ణి చంద్రబింబం అనే పేరుగల భార్యగా, రాహువును భర్తగా, నక్షత్రాలు వారి పిల్లలుగా, భూమి నుంచి వెళ్లిన ఆర్యభట్టును చుట్టంగా పెట్టి సంసారంలో మహిళగా చంద్రబింబం పడుతున్న క్షోభను చిత్రీకరించింది. భార్య చంద్రబింబం భర్తయిన రాహువు కర్కశత్వాన్ని, హింసకు గురవుతున్న పరిస్థితిని, దేవతా లోకంలో దేవుళ్ళు దేవతలను ఎట్లా పీడిస్తుంటారు అని ఆర్యభట్టుతో పంచుకున్నట్లు మహిళావాద కోణాలు ఏకరువుగా వర్ణన చేసింది. ఈ పద్య కావ్యంలో మహిళా సమస్యల్ని, ప్రాచీన కథాంశాలను, ఆధునిక మానవ సాంకేతికతను, ఇతివృత్తాలుగా చేసి కొత్త ప్రయోగశీలిగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయారు. మహిళల, దళితుల జీవితాల్లోని సామెతలు విరివిగా వాడి, ఒక నవల్లో లాగా అనేక పాత్రల సమ్మిళితంగా ఈ పద్య కావ్యాన్ని రూపొందించడం గొప్ప విషయం.

స్వరూపరాణి ప్రతి రచనలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేడ్కర్, జాషువా, పెరియార్ కుల నిర్మూలన, హేతువాద దృష్టి, సమానత్వ చైతన్యాల స్ఫూర్తి ప్రతిఫలించే భావాలు, స్వేచ్ఛ, సమానత్వం విరివిగా కనబడుతుండేవి. అంటరాని కులాల మహిళా ప్రగతిని కాంక్షిస్తూ, వారిపై కొనసాగే అణచివేతను నిలదీసే తిరుగుబాటు కలంగా సాగిన ఆమె రచనలు ఈ సమాజానికి గొప్ప మేల్కొలుపు. అణచివేతలను నిలదీసే తిరుగుబాటుగా రూపొందిన ఆమె రచనలు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇంతటి మహాకవయిత్రికి, భాషాపండితురాలికి, సాహితీ ప్రతిభాశాలికి రావాల్సినంత గుర్తింపు, గౌరవం రాకపోవడం సాహితీ లోకానికి పట్టిన సామాజిక గ్రహణం.

జె.ఎస్

(నేడు కొలకలూరి స్వరూపరాణి ప్రథమ వర్ధంతి)

Updated Date - 2023-10-15T03:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising