ప్రజాధనంతో కట్టిన హైవేల్లో జనం నిలువు దోపిడీ!
ABN, First Publish Date - 2023-10-06T02:20:49+05:30
రెండులక్షల కోట్ల రూపాయల విలువతో, 4000 – 4500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను మానిటైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహదారుల నిర్మాణం ఇప్పటికే 88శాతం పూర్తయిందనీ...
రెండులక్షల కోట్ల రూపాయల విలువతో, 4000 – 4500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను మానిటైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహదారుల నిర్మాణం ఇప్పటికే 88శాతం పూర్తయిందనీ, మరో 12శాతం త్వరలోనే పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ రహదారులను మానిటైజ్ చేయడం అంటే వాటిని ప్రైవేట్ వ్యక్తులకు లేదా సంస్థలకు లీజుకు ఇవ్వడం వంటిది. దీని ద్వారా ప్రభుత్వానికి డబ్బు సమకూరుతుంది. కానీ, ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అది, ప్రస్తుతం నిర్మాణం పూర్తవుతోన్న ఈ హైవేలను నిర్మించేందుకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందీ అన్నది. ఆ మొత్తం అంతా వివిధ రూపాలలో ప్రజలు చెల్లించిన పన్ను డబ్బూ లేదా పొదుపు మొత్తాల నుంచి వస్తున్నదే. నిజానికి, జాతీయ చిన్న మొత్తాల పొదుపు డబ్బును కూడా ఈ నిర్మాణాలకు వాడుతున్నారు. మరి ఇదంతా ప్రజల డబ్బు. ప్రభుత్వం ఇలా ప్రజల సొమ్ముతో నిర్మితమైన ఆస్తులను ప్రైవేటు పరం చేస్తోంది.
ఇందులోను ముఖ్యంగా గమనించాల్సింది– ఇలా ప్రభుత్వం ఖర్చుపెట్టి నిర్మించిన హైవేలను అమ్మినప్పుడు లభించే మొత్తాలు వాటి నిర్మాణానికి అయిన ఖర్చుల మేరకైనా ఉంటాయా? అలా ఉండే పక్షంలో, లాభాల వేటలో ఉండే ప్రైవేట్ వ్యాపారులు వాటిని అసలు లీజుకైనా తీసుకుంటారా? ఇంతకు ఇంత లాభం లేకుంటే ప్రైవేట్ వ్యాపారులు ఎక్కడా పెట్టుబడులు పెట్టరనేది అందరికీ తెలిసిందే. విషయం అది కాగా, ఇక్కడ నష్టపోతోంది ప్రజలు గాక మరెవరు? కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా మన కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల మానిటైజేషన్ పేరిట ప్రజల సొమ్మును అడ్డదోవలో పెట్టుబడిదారులకూ ధారాదత్తం చేస్తోంది.
ప్రైవేటీకరణ లేదా పెట్టుబడుల ఉపసంహరణ అన్న మాటలు వినపడే అన్ని సందర్భాల్లోనూ ప్రభుత్వాలు– తగినంత ఉపయోగంలో లేని, లేదా నష్టాలలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను మాత్రమే అమ్ముతున్నాం లేదా లీజులకు ఇస్తున్నాం అని వల్లె వేస్తాయి. కానీ నిజానికి నేడు దేశంలోని అనేక లాభాలలో నడుస్తోన్న పరిశ్రమలను కూడా ప్రభుత్వాలు ప్రైవేటుపరం చేస్తున్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల సారాంశం ఇదే.
1947లో మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన కాలంలో దేశంలోని ప్రైవేట్ పెట్టుబడిదారుల వద్ద తగు మొత్తాలలో పెట్టుబడులకు సొమ్ము లేదు. ఆ సందర్భంలో, ప్రభుత్వమే పూనుకొని మౌలిక సదుపాయాల కల్పన, ఉక్కు ఉత్పత్తి తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టింది. కానీ నేటి పరిస్థితి అది కాదు. స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారతదేశంలోని ప్రైవేటు పెట్టుబడిదారుల ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. వారిలోని కొందరు అంతర్జాతీయ ధనవంతుల స్థాయికి ఎదిగారు. కానీ, నేటికీ వారు దేశీయంగా ప్రాధాన్యత గల రంగాలలోకి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. పైగా, అదానీల వంటివారు ఇప్పటికే నిర్మించబడి సిద్ధంగా ఉన్న వివిధ మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పెద్దల సాయంతో అప్పనంగా స్వంతం చేసుకుంటున్నారనే ఆరోపణలను వింటూనే ఉన్నాం.
ఈ జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్‌ల ద్వారా లభించే ఆదాయం ఈ రహదారులను ప్రైవేటువారికి లీజుకు ఇచ్చేదానికంటే అధిక లాభసాటిగా ఉంటుంది. ఉదాహరణకు స్వయంగా కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖా మంత్రి అయిన గడ్కరీ స్వయంగా చెప్పినట్లుగా 2022–23 సంవత్సరంలో జాతీయ రహదారులపై టోల్‌గేట్ల ద్వారా లభించిన ఆదాయం రూ.41,342 కోట్లు. ఈ ఆదాయం 2030 నాటికి రూ.1,30,000కోట్లకు పెరుగుతుందనే అంచనాను కూడా గడ్కరీ వెల్లడించారు. అంటే, ఈ లెక్కన ప్రైవేటు సంస్థలు తమ లీజు కాలంలో ఈ రహదారుల ద్వారా సముపార్జించే ఆదాయం ఎంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఈ రహదారులను నిర్మించి, వాటిని ప్రైవేటు వారి లాభార్జనకు అప్పగించేకంటే స్వయంగా వాటిని తానే నిర్వహించుకుంటే, ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తుంది. అలా చేస్తే, ప్రజల సొమ్ముతో జరిగిన నిర్మాణం, దానిపై జరిగే వ్యాపారంలో లభించే లాభాలు ప్రభుత్వ ఖజానాకూ, అంతిమంగా ప్రజా ప్రయోజనానికి దక్కుతాయి.
ఈ ప్రైవేటు లీజు వ్యవహారంలో లాభాలు పొందుతున్నది కేవలం దేశీయ సంస్థలే కాదు. విదేశీ పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున వారి పెట్టుబడులను మన దేశీయ మౌలిక సదుపాయాల రంగాలలో పెడుతున్నారు. ఉదాహరణకు కెనడా వంటి దేశాల నుంచి అనేక పింఛన్ నిధుల యాజమాన్య ఫండ్స్ మన దేశీయ మౌలిక సదుపాయ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగాలు భారీ లాభసాటిగా ఉండడమే దీనికి కారణం. అంటే, భారత ప్రజలు కడుతోన్న పన్ను డబ్బుతో నిర్మితమవుతోన్న జాతీయ రహదారుల వంటివి అంతిమంగా ప్రైవేటుపరమై, ఇటు దేశీయ మదుపుదారులకూ, అటు విదేశీ పెట్టుబడిదారులకూ లాభాల పంటలను పండిస్తున్నాయి. ఈ నిర్మాణాలకు పన్నులు కడుతోన్న జనాలకు మాత్రం టోల్‌గేట్ల వడ్డింపులే మిగులుతున్నాయి. తాము కట్టిన పన్ను డబ్బులతో నిర్మితమైన రోడ్ల మీద ప్రయాణానికి తిరిగి ప్రజలే టోల్‌గేట్ల రూపంలో డబ్బు చెల్లించుకుంటున్నారు.
డి. పాపారావు
Updated Date - 2023-10-06T02:20:49+05:30 IST