ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాలకుర్తిలో ప్రశ్నపై పాలకుల అసహనం!

ABN, First Publish Date - 2023-10-05T02:48:15+05:30

ఒక రచయిత, కవి, లేదా వామపక్షవాది చెప్పే అభిప్రాయాలు సరైనవా కావా– అన్న మీమాంస పాలకులకు ఎన్నడూ ఉండదు. ఆ అభిప్రాయాల వల్ల తమ మనుగడకు ఇబ్బంది అవుతుందా లేదా...

ఒక రచయిత, కవి, లేదా వామపక్షవాది చెప్పే అభిప్రాయాలు సరైనవా కావా– అన్న మీమాంస పాలకులకు ఎన్నడూ ఉండదు. ఆ అభిప్రాయాల వల్ల తమ మనుగడకు ఇబ్బంది అవుతుందా లేదా– అన్నదే వాళ్ల సమస్య.‌ ఆ అభిప్రాయాలకు పాలకులు ఇంతగా భయపడడం మూర్ఖత్వం అనుకుంటే అది మన మూర్ఖత్వమే! పాలకులు సకారణంగానే భయపడతారు.

ఎక్కడ రాజకీయంగా సంక్షోభం ముంచుకొస్తుందో అక్కడ నిషేధాలు, నిర్బంధాలు జరిగాయనేది చరిత్ర చెప్తున్న సత్యం. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోనూ రాజకీయ సంక్షోభం కారణంగానే నిర్బంధ హెచ్చరికలు వెలుగుచూస్తున్నాయి. అందుకే పాలకుర్తికి చెందిన మామిండ్ల రమేష్ రాజాపై అక్రమ కేసులు బనాయించబడ్డాయి. రమేష్ రాజా సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే రమేష్ రాజాను కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా కంటే కవిగా, రచయితగానే ప్రముఖంగా చెప్పుకోవాలి. అనేక అంశాలపై వందలకొద్దీ వ్యాసాలు రాసి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే వ్యక్తి ఆయన. కవిత్వమూ రాశారు. వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రపై, పాలకుర్తి చరిత్రపై, పౌరసత్వంపై వ్యాస సంపుటులు వేశారు. ‘వికసించని మందారాలు’ అనే కవిత్వ సంపుటి ప్రచురించారు. ‘సామాజిక కిరణాలు’ వంటి పలు పుస్తకాలు రాశారు. ఆయన ప్రతి వ్యాసంలోనూ ప్రశ్న అనివార్యంగానే కనిపిస్తుంది. అందుకే బహుశా ఆయనపై అక్రమ కేసులు బనాయించి నిర్బంధ హెచ్చరికలు చేశారు.

పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి పట్ల, సామాజిక న్యాయం పట్ల ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చేసిన హామీల వైఫల్యంపై సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారన్న నెపంతోనే బీసీ బిడ్డ రమేష్ రాజాపై ఈ అక్రమ కేసులు బనాయించారు. ఎఫ్ఐఆర్‌లో ‘అదర్స్’ అని కూడా జోడించి ఇంకెవరూ ప్రశ్నించకూడదు, చర్చలు జరుపకూడదూ అనే హెచ్చరిక సంకేతాలు కూడా పంపారు. ఒక కవిగా, రచయితగా, వామపక్ష భావజాలం కలిగి ఉండి ప్రస్తుతం సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రమేష్ రాజా అనివార్యంగానే ప్రశ్నిస్తారు కదా! అందులోనూ ప్రత్యేక ఉద్యమ చరిత్ర కలిగి, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చారిత్రక నేపథ్యం కలిగిన పాలకుర్తి గడ్డ మీద పుట్టిన మనిషి ప్రశ్నించడానికి దూరంగా ఎలా ఉంటాడు? వీర తెలంగాణ పోరాటవీరులు దొడ్డి కొమరయ్య, షేక్ బందగీ, చిట్యాల ఐలమ్మ, జాటోతు ఠానూ నాయక్, నల్ల నర్సింహుల విప్లవోద్యమ వారసత్వం కదా ఆ మాత్రం ఉండకుండా ఎలా ఉంటుంది? పాలకుర్తిలో కనీసం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఎందుకు ఏర్పాటు చేయలేదని రమేష్ రాజా ప్రశ్నించాడు. 30 పడకల వైద్యశాలలో వైద్యం మిథ్యగా మారిందని, దాన్ని వంద పడకల వైద్యశాలగా ఎప్పుడు మార్పుస్తారని అడిగాడు. కనీసం పోస్టుమార్టం సౌకర్యం కూడా అక్కడ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కుల సంఘాలకు ఓట్ల కోసం ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఎస్సీ హాస్టల్‌కు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలివ్వక పోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించాడు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు పదిహేనేండ్లు గడిచినా ఎందుకు పూర్తికాలేదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఎందుకు పెంచలేదని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎందుకు లేవని, ఒక్క చిన్న పరిశ్రమమైనా ఎందుకు తీసుకురాలేకపోయారని మంత్రి ఇచ్చిన విఫల హామీలను వేలెత్తి చూపుతూ ప్రశ్నించాడు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చల్లోని ఇలాంటి అంశాలే రమేష్ రాజా చేసిన నేరమైంది!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశ్నిస్తున్న రమేష్ రాజాపై పాలకుర్తి పోలీసు స్టేషన్‌లో సెప్టెంబర్ 22వ తేదీన ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బేషరతుగా రమేష్ రాజాపై నమోదు చేసిన అక్రమ కేసు ఎత్తివేయాలి. ఆయనకు పౌర సమాజం అండగా నిలువాలి.

రాజేందర్ దామెర

సీనియర్ జర్నలిస్టు

Updated Date - 2023-10-05T02:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising