ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొత్త ట్రిబ్యునల్‌ న్యాయవిరుద్ధం

ABN, First Publish Date - 2023-10-13T01:19:41+05:30

కృష్ణాజలాలపై తొలుత ఏర్పాటు చేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను, అంతకు మించి కేటాయించిన అదనపు జలాలను, పోలవరం ద్వారా కృష్ణానదికి తరలించే నీటిని...

కృష్ణాజలాలపై తొలుత ఏర్పాటు చేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను, అంతకు మించి కేటాయించిన అదనపు జలాలను, పోలవరం ద్వారా కృష్ణానదికి తరలించే నీటిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు పంపిణీ చేయాలని, కొత్త ట్రిబ్యునల్‌కు విధివిధానాలను ప్రతిపాదిస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ విధివిధానాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించేందుకు, తెలంగాణాకు అధిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా తెలంగాణ రాజకీయ శక్తులు అధికార యంత్రాంగం పలుకుబడితో, కేంద్రం ఏర్పాటు చేసినదే ఈ ట్రిబ్యునల్‌. కేంద్రం ట్రిబ్యునల్‌కు మూడు ప్రతిపాదనలు చేసింది.

మొదటిది – కృష్ణా జలాలను పునః పంపిణీ చేసేందుకు బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను పునః పంపిణీ చేయాలి.

అసలు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును మార్చవచ్చునా? 1960 నాటికి కృష్ణాబేసిన్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో అప్పటికే కట్టిన, కడుతున్న, ఆమోదం పొందిన ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకొని 75 శాతం విశ్వసనీయత ఆధారంగా కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే 2060 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు కేటాయించింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులు జరుపుతున్నప్పుడు ‘మొదటివాడికే తొలి హక్కు’ అని చెప్పే సూత్రాన్ని ప్రాతిపదికగా చేసుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నా కృష్ణా డెల్టా, కెసి కెనాల్‌, నాగార్జునసాగర్‌, తుంగభద్ర ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు అత్యధికంగా 811 టీఎంసీలను కేటాయించింది. నీటిని ముందుగా ఉపయోగించుకుంటున్న వారికి, ఆ తర్వాత వచ్చిన వారికంటే ఎక్కువ హక్కు ఉంటుంది. అమెరికా కూడా ఇదే చెబుతుంది. అంతర్జాతీయ చట్టసంఘం రూపొందించిన హెల్సెంకీ నియమాలు కూడా ఈ విషయాన్నే ధ్రువపరిచాయి. కాబట్టి కృష్ణాజలాల్లో బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని ముట్టుకోవటానికి జల చట్టాలు ఒప్పుకోవు.

అందుకే బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ కూడా బచావత్‌ ట్రిబ్యునల్‌ పంచిన 811 టీఎంసీల నీటి జోలికి వెళ్లలేదు. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పులో క్రింది విధంగా పేర్కొన్నది. క్లాజ్‌–1: బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పులోని నికర జలాలు పంపిణీ యథావిధిగా ఉంటుంది. క్లాజ్‌–18: బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం ఆ తీర్పును మార్చరాదు. క్లాజు–23: బచావత్‌ ట్రిబ్యునల్‌ చెప్పిన తీర్పులు, సూచనలను సవరించటం, సమీక్షించటం, మార్పు చేయటం జరగరాదు, ఆ ఆర్డరును ఉన్నది ఉన్నట్లు అమలు పరచాలి. విభజన చట్టంలో కూడా బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులు యథావిధిగా ఉంటాయని స్పష్టంగా ఉంది.

బచావత్‌ తీర్పును మార్చటానికి వీల్లేదని జలచట్టాలు, ట్రిబ్యునళ్లు, కోర్టులు చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలను పునః పంపిణీ చేయటానికి పూనుకోవటం అప్రజాస్వామికం. అలా మార్చే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. ట్రిబ్యునళ్లు కేటాయించిన నీటిని పునః పంపిణీ చేసుకొనే హక్కు ఆయా రాష్ట్రాలకు మాత్రమే ఉన్నది.

అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్‌ 3 ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు కృష్ణానదీ జలాలను పంచటానికి 2004లో బ్రిజేష్‌ కుమార్‌ అధ్యక్షతన ట్రిబ్యునల్‌ నేర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్‌ ఆరున్నర సంవత్సరాలు విచారణ జరిపి 2010 డిసెంబర్‌ 30న మధ్యంతర తీర్పు ప్రకటించింది. ఈ తీర్పుపై అన్యాయం జరిగిందని అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. దానిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించకుండా స్టే ఇస్తూ తిరిగి అదే ట్రిబ్యునల్‌ను పునః పరిశీలన చేయవలసినదిగా ఆదేశించింది. దానిపై పునః పరిశీలన చేసి మధ్యంతర తీర్పునే తుది తీర్పుగా 2013లో ట్రిబ్యునల్‌ ప్రకటించింది. అంటే ఇదే బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ పునః పరిశీలన జరిపి ఉన్నది. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై పునః పరిశీలన చేయాలని 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రెండవ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది.

రెండవది– మిగులు జలాల పంపకం. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా జలాలలో నీటి లభ్యత 2578 టీఎంసీలుగా నిర్ధారించి, 448 టీఎంసీల నికర, మిగులు జలాలను తేల్చింది. వీటిలో కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన నీటిలో తెలుగుగంగకు 25 టీఎంసీలు, జూరాలకు 9 టీఎంసీలు, ఆర్‌డియస్‌కు 4 టీఎంసీలు కేటాయించి, మిగిలిన 150 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో క్యారీఓవర్‌గా పెట్టాలని ట్రిబ్యునల్‌ తీర్పునిచ్చింది. కరువు ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణలో మిగులు జలాలపై నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపకుండా 150 టీఎంసీలను క్యారీఓవర్‌గా పెట్టడం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ చేసిన అన్యాయమే. విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రాజెక్టులకు నీటి పంపకాలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ట్రిబ్యునల్‌ను అడుగుతుండగా, కేసీఆర్‌ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు పదేపదే అడ్డు తగులుతోంది. పైగా కృష్ణా జలాల్లో సగభాగం కావాలని డిమాండ్‌ చేస్తున్నది. కృష్ణానది ప్రవహించే పరీవాహక శాతాన్ని బట్టి తెలంగాణకు 575 టీఎంసీలు రావాలని వాదిస్తున్నారు. కృష్ణాజలాలపై సర్వహక్కులు తమకే వున్నాయనే ఒక వితండవాదాన్ని కేసీఆర్‌ చేస్తున్నారు.


మూడవది– పోలవరం నుంచి కృష్ణానదికి తరలించే నీటి పంపకం. పట్టిసీమ నుండి కృష్ణానదికి తరలించే 80 టీఎంసీలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీల వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నీటి వాటాను కూడా కలుపుకొని తెలంగాణ కేసీఆర్‌ ప్రభుత్వం 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ జీఓ జారీ చేయటం ఏమిటి? దీనిని బట్టి కేసీఆర్‌ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో అర్థం అవుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి తగాదాలను సామరస్యంగా, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవటానికి విభజన చట్టంలో ‘అపెక్స్‌’ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. క్యారీ ఓవర్‌గా పెట్టిన 150 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా ఆదా అయిన 45 టీఎంసీలు మొత్తం 195 టీఎంసీలను విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమలో నిర్మించిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలుగొండ, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు, అపెక్స్‌ కౌన్సిల్‌ ద్వారా పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్‌ కృష్ణా జలాల సమస్యను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్‌తో జలజగడాలకు దిగుతున్నారు.

కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలంటే నదీబేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను కలిపి విచారణ జరపాలి. అలాకాకుండా ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణలను మాత్రమే విచారణ జరపడమనేది ఎలా న్యాయం అవుతుంది? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదటి నుంచి కొత్త ట్రిబ్యునల్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ను సంప్రదించకుండా కృష్ణాజలాల పునః పంపిణీపై ట్రిబ్యునల్‌ను ఎలా ఏర్పాటు చేస్తారు?

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్షతతో అప్రజాస్వామికంగా తీసుకున్న నిర్ణయమే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు. కృష్ణాజలాల పునః పంపిణీ జరిగితే ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన నికర జలాలలో కోతపడే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు సర్దుబాటు చేసుకొనే అవకాశాన్ని కోల్పోతాం. దీని మూలంగా రాయలసీమ, డెల్టా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది.

బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ మొదటి తీర్పు వెలువరించి నేటికి పదమూడు సంవత్సరాలైంది. తుది తీర్పును ప్రకటించి పది సంవత్సరాలైంది. విభజన చట్టం సెక్షన్‌ 89పై బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తొమ్మిది సంవత్సరాల నుంచి విచారణ జరుపుతున్నది. అంతర్‌రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ 2010లో ఇచ్చిన మధ్యంతర, 2013లో ఇచ్చిన తుది తీర్పులను గెజిట్‌లో ప్రచురించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మహారాష్ట్ర–కర్ణాటక రాష్ట్రాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వేసిన కేసు, విభజన తర్వాత ఆంధ్ర– తెలంగాణ రాష్ట్రాలు వేసిన కేసులు, మొత్తం ఐదు కేసులు కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో నడుస్తుండగా, కేంద్రప్రభుత్వం కృష్ణాజలాలపై మరొక ట్రిబ్యునల్‌ వేయటం న్యాయ సూత్రాలకు వ్యతిరేకం. ఈ విషయాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాలను పునః పంపిణీ చేయటానికి వేసిన కొత్త ట్రిబ్యునల్‌ను రద్దు చేయాలని కోరాలి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తమ రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త ట్రిబ్యునల్‌ను రద్దు చేసే వరకు రాజీలేని పోరాటం సాగించాలి. ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులను కాపాడాలి.

మాయకుంట్ల శ్రీనివాసులు

జలసాధన సమితి

Updated Date - 2023-10-13T01:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising