కాంగ్రెస్ పొరపాటు చాటిన సత్యం
ABN, First Publish Date - 2023-10-20T03:46:08+05:30
తనకు తాను నష్టం చేసుకోవడం, బహుశా, భారత జాతీయ కాంగ్రెస్ ప్రవృత్తిలో ఉందేమో?! ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణపై భారత జాతీయ కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం (సీడబ్ల్యూసీ) తీర్మానమే అందుకొక...
తనకు తాను నష్టం చేసుకోవడం, బహుశా, భారత జాతీయ కాంగ్రెస్ ప్రవృత్తిలో ఉందేమో?! ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణపై భారత జాతీయ కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం (సీడబ్ల్యూసీ) తీర్మానమే అందుకొక తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. పాలస్తీనియన్ హక్కుల గురించి గంభీరంగా ఉద్ఘాటించిన ఆ తీర్మానంలో ఇజ్రాయెల్‌పై ఈ నెల 7న హమాస్ భీకర దాడిని ప్రస్తావించనే లేదు! ఇంకేం, కాంగ్రెస్ చేసిన ఈ తప్పుపై భారతీయ జనతా పార్టీ మెరుపు దాడి చేసింది. ఉగ్రవాద హింసాకాండను కాంగ్రెస్ సమర్థిస్తోందని దుయ్యబట్టింది. దీంతో ఇజ్రాయిలీ పౌరులపై హమాస్ దాడులను ఎటువంటి సందిగ్ధతకు తావు లేకుండా ఖండించామని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఇంతకూ ఏం జరిగింది? సీడబ్ల్యూసీ తీర్మానాన్ని రాయడంలో ఒక ‘లేఖక ప్రమాదం’ సంభవించింది. ఇదే కాంగ్రెస్‌కు చిక్కులు కలిగించింది. అయితే ఈ వివాదం ప్రస్తుత ఎన్నికల ఋతువులో ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు ఆస్కారమిచ్చింది: ప్రపంచ ఉగ్రవాద హింసాత్మక ఘటనలు మన దేశీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయి?
ఉగ్రవాద హింసాకాండను ముక్తకంఠంతో ఖండించడం భారతీయ రాజకీయ పార్టీలకు పరిపాటి. ఇదొక చారిత్రక ఆనవాయితీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభవ ప్రాభవాలు, ఆయన అనుసరిస్తున్న తీవ్ర జాతీయవాద రాజకీయాలు ప్రస్తావిత రాజకీయ సంప్రదాయ మూల సూత్రాలనే మార్చి వేశాయి. 2019 సార్వత్రక ఎన్నికల ప్రచార పర్వంలో పదేపదే బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావించి, ‘ఘర్ మే ఘుస్కర్ మారా’ (మనం శత్రువు ఇంటిలోకి ప్రవేశించి, అతడిని చావుదెబ్బ కొట్టాం) అని ఘనంగా చెప్పేవారు. పాకిస్థాన్ భూభాగాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాలపై యుద్ధానికి, ఆనాటి ఎన్నికల వ్యూహంలో అగ్ర ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ కల్పించారు. పాక్ దుశ్చర్యలపై తమ ప్రతీకార దాడులను 26/11 ముంబై ఉగ్రవాద దాడుల అనంతరం ప్రధాని మన్మోహన్ సర్కార్ అనుసరించిన సంయమన విధానం, తమ సాహసోపేత ప్రతిదాడుల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి నరేంద్ర మోదీ పదే పదే ప్రస్తావించేవారు. జాతి భద్రత విషయంలో తాము రాజీపడబోమని, సదా అప్రమత్తమై ఉండి శత్రువును దెబ్బ తీస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఒకటికి రెండు మార్లు చెప్పి ఓటర్లను బాగా ప్రభావితం చేశారు.
2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా నరేంద్ర మోదీ మరింత నిక్కచ్చిగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తమ ఓటు బ్యాంకుకు నష్టం వాటిల్లవచ్చనే భయంతో ‘ఉగ్రవాద దాడుల’పై మౌనం వహిస్తోన్న కాంగ్రెస్, దానితో భావసారూప్యత ఉన్న ఇతర పార్టీల విషయంలో సదా అప్రమత్తమై ఉండాలని ఓటర్లను ప్రధాని మోదీ పదే పదే హెచ్చరించారు. ఎంతవరకు నిజమో గానీ సోనియా గాంధీ గురించి కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించిన ఒక విషయాన్ని కూడా ఆయన ఉపయోగించుకున్నారు. 2008లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన భారతీయ ముజాహిదీన్ మిలిటెంట్ల మృతదేహాల ఫోటోలను చూసి సోనియా కంట తడిబెట్టారని సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. మైనారిటీలను బుజ్జగిస్తోందన్న తమ వాదనకు మద్దతుగా మోదీ ఆ బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌పై సోనియా ప్రతిస్పందించిన తీరును ప్రస్తావించి ఓటర్ల నుంచి జేజేలు అందుకున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో, ముఖ్యంగా 2004–09 సంవత్సరాల మధ్య చోటు చేసుకున్న ఉగ్రవాద దాడులు కాంగ్రెస్‌ను ఎంతగానో ఆత్మరక్షణలో పడవేశాయి.
అసలు ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలే అన్నది మనం విస్మరించకూడదు. టాడా (ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం), ఊపా (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) మొదలైన వాటిని కాంగ్రెస్ పాలనలోనే పార్లమెంటు ఆమోదం పొంది అమలులోకి వచ్చాయి. చాలా కఠినమైన నిబంధనలు ఉన్న చట్టాలవి (ఆ కఠోర చట్టాల కింద ఉగ్రవాదులనే కాకుండా రైతులు, మానవహక్కుల కార్యకర్తలతో పాటు ఇప్పుడు పాత్రికేయులను కూడా అరెస్ట్ చేస్తున్నారు). అయినప్పటికీ ఉగ్రవాదంపై మెత్తని వైఖరితో వ్యవహరిస్తున్న పార్టీగా కాంగ్రెస్‌పై ముద్రపడింది. 2016లో యూరీ ఉగ్రవాద ఘటన అనంతరం పాక్ భూభాగంలో భారత సైనిక యోధుల మెరుపుదాడుల వాస్తవాన్ని ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్ నాయకులు ఒక పెద్ద పొరపాటు చేశారు. అలాగే బాలా కోట్ వైమానిక దాడులను సందేహించడం ద్వారా మన సైనికుల శౌర్య సాహసాలను ప్రశ్నిస్తున్నారనే అపవాదు పడ్డారు. జాతీయ భద్రత విషయంలో కూడా స్వార్థ రాజకీయ దృష్టిని కాంగ్రెస్ విడనాడడం లేదని బీజేపీ సహజంగానే పదేపదే తెగనాడింది.
పాలస్తీనియన్ల పోరాటానికి భారతీయ ముస్లింలు సంఘీభావం తెలుపుతున్నారు అయినంత మాత్రాన ఇజ్రాయెల్‌పై హమాస్ భయంకర దాడికి, అలాగే పాకిస్థాన్ నుంచి లష్కర్, జైష్ మిలిటెంట్లు; ఆఫ్ఘాన్ తాలిబన్లు భారత్‌కు వ్యతిరేకంగా పాల్పడుతున్న సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు భారతీయ ముస్లింలు నైతిక బాధ్యత వహించాలనడం ఎంతవరకు సబబు? మరో ముఖ్య విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంతకంతకూ విస్తృతమవుతున్న సామాజిక మాధ్యమాల ప్రభావం, ఘటనల సమాచారాన్ని తక్షణమే ప్రపంచమంతటికీ తెలియజేసే స్మార్ట్ ఫోన్ల మెసేజింగ్ టూల్స్ వాస్తవ సమయ కథనాలను సృష్టిస్తున్నాయి. వాటిని చాలా కుటిలంగా, ప్రజలలో చీలికలను సృష్టించే ఆయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డివైడ్స్– డబ్ల్యుఎమ్‌డి)గా ఉపయోగించుకోవడం జరుగుతోంది. ‘ప్రతి ముస్లిం ఒక ఉగ్రవాది కాదు, అయితే ప్రతి ఉగ్రవాదీ ఒక ముస్లిమే’ అన్న విషపూరిత డబ్ల్యుఎమ్‌డినే తీసుకోండి. వాట్సాప్ గ్రూపులలో దీనికి నిరంతరం విస్తృత ప్రచారం కల్పిస్తూ ముస్లింల గురించి దురభిప్రాయాలను వ్యాపింప చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో కరడుగట్టిన మితవాద పోకిరీలు అయితే ఉగ్రవాదాన్ని ఇస్లాంకు పర్యాయపదంగా ప్రచారం చేస్తున్నారు. భారత్‌లో సామాజిక మాధ్యమాల వినియోగదారులలో ‘పాలస్తీనియన్లు మౌలికంగా పాశవికులు’ అనే తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్న వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని ‘బూమ్’ అనే వెబ్‌సైట్ ఒకటి వెల్లడించింది.
పాకిస్థాన్ విషయంలో అయితే ఈ అంతర్జాల పోకిరీల విష ప్రచారానికి అవధులే లేవు. భారత్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు ఆ దేశ భూభాగాల నుంచే జరుగుతున్నాయన్న విషయమై భారతీయులలో చాలావరకు ఏకాభిప్రాయం ఉండడంతో ఆ ప్రచారకాండ యథేచ్ఛగా సాగిపోతోంది. అయితే ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం చాలా సంక్లిష్ట వ్యవహారం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ‘స్వతంత్ర పాలస్తీనా’ డిమాండ్‌కు భారత్ సంపూర్ణ మద్దతునిచ్చింది. భారత్–ఇజ్రాయెల్ సంబంధాలకు ఇటీవలి కాలంలో ఒక వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ పరిస్థితులు న్యూఢిల్లీ దౌత్య ప్రజ్ఞకు ఒక పరీక్ష లాంటివే. హమాస్ దాడికి గురైన ఇజ్రాయెల్ పట్ల భారత్ సానుభూతి వ్యక్తం చేయడం సహేతుకమైన విషయమే. అయితే భారత్ పట్ల సుహృద్భావంతో ఉన్న అరబ్ దేశాలను దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమున్నది. మోదీ ప్రభుత్వ రాజనీతిజ్ఞత కారణంగానే సౌదీ అరేబియా యూఏఈ లాంటి దేశాలు మన దేశంతో వాణిజ్య సంబంధాలను మరింతగా పటిష్ఠం చేసుకుంటున్నాయి. మరి ఈ పరిస్థితులలో పాలస్తీనియన్ ముస్లింలను విలన్లుగాను, ఇజ్రాయిలీ యూదులను బాధితులుగాను పరిగణించడం సరైన వైఖరి కాబోదు. అక్టోబర్ 7 దాడి, తదనంతర పరిణామాలతో పాలస్తీనియన్లు, యూదులు సమ స్థాయిలో కష్ట నష్టాలకు గురవుతున్నారన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. వాస్తవిక, నిష్పాక్షిక దృష్టితో వ్యవహరించవలసి వున్నది.
ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా సరే, భారతీయ రాజకీయవేత్తలు అందరూ ఆ వాస్తవాలను ఎట్టి పరిస్థితులలోనూ విస్మరించకూడదు. హమాస్–ఇజ్రాయెల్ ఘర్షణల నుంచి సంభావ్య ఎన్నికల లబ్ధి పొందడానికి ఏ విధంగాను ప్రయత్నించకుండా ఉండాలి. ఒకటికి రెండుమార్లు ఆలోచించుకున్న తరువాతనే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రకటనలు చేయాలి. హమాస్ భయానక దాడులను ఖండించవలసిన అవసరమున్నదనడంలో సందేహం లేదు. అయితే పాలస్తీనియన్ ప్రజలు దశాబ్దాలుగా పడుతున్న నానా అగచాట్లు, అవమానాలను ప్రస్తావించి తీరాలి. అవును, వాటిని ప్రపంచానికి మరొకసారి ఎలుగెత్తి చాటాలి, మరీ ముఖ్యంగా మనకు మనమే గుర్తు చేసుకోవాలి. విద్వేషాన్ని కుమ్మరిస్తే జరిగేదేమిటి? హింస మొలకెత్తుతుంది, ప్రచండంగా పెరిగిపోతుంది. ప్రతీకారేచ్ఛ ప్రబలుతుంది. పర్యవసానమేమిటి? అందరూ అనివార్యంగా ఒక ఉమ్మడి శిక్షకు గురవుతారు. ఈ విద్వేష హింసల, ప్రతీకార శిక్షల విష వలయంలో విజేతలు ఎవరు? పరాజితులు ఎవరు? సంఖ్యానేక మృతదేహాలు మాత్రమే మిగులుతాయి. మృతులు ఎవరైతేనేం, జయాపజయాల అంతరం అర్థరహితమవుతుంది.
తాజా కలం: సీడబ్ల్యూసీ తీర్మానం ఒక పరువు తక్కువ పని. కనుకనే కాంగ్రెస్‌వాదులు ఎందరో దాని విషయమై గింజుకుంటున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనాపై పార్టీ సందిగ్ధ వైఖరి గురించి ఒక యువ కాంగ్రెస్‌వాది ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు: ‘మా నాయకులలో కొంతమంది ఇందిరాగాంధీ కాలం నాటివారు. యాసర్ అరాఫత్‌కు ప్రాధాన్యమిస్తూ ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను ఉపేక్షించిన రోజులవి. ఆనాటి స్మృతులతో బెంగపడతూ ప్రస్తుత వాస్తవాలను వారు విస్మరించారు’. ఈ అంగీకారంలో ఒక స్పష్టమైన వాస్తవం ఉన్నది. ఉగ్రవాద చర్యల పట్ల ఏ విధమైన పక్షపాతాన్ని అయినా సరే నిర్ద్వంద్వంగా తిరస్కరించి తీరాలని భారతదేశ వర్తమానం ఘోషిస్తోంది.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్‌్ట)
Updated Date - 2023-10-20T03:46:08+05:30 IST