ఈ యుద్ధం సనాతన ధర్మమంత ప్రాచీనం!
ABN, First Publish Date - 2023-09-14T01:24:25+05:30
ఇదిఈ దేశానికి ఇప్పట్లో తీరే సమస్య కాదు, ఇప్పట్లో సమసిపోయే ఘర్షణా కాదు. పరస్పరం సంఘర్షించే రెండు భావజాలాల మధ్య వేల సంవత్సరాల సమరం ఇది...
ఇదిఈ దేశానికి ఇప్పట్లో తీరే సమస్య కాదు, ఇప్పట్లో సమసిపోయే ఘర్షణా కాదు. పరస్పరం సంఘర్షించే రెండు భావజాలాల మధ్య వేల సంవత్సరాల సమరం ఇది. ఉదయనిధి స్టాలిన్ కాలాల కందిరీగల తుట్టెను కదిపాడు. అతని తలకు వెల కడుతున్నారు. శంభూకుడిలా తలనప్పగించి కూర్చునేది లేదని తెగేసి చెప్పిన తరాలకు వారసుడు ఉదయనిధి. ఆధిపత్యం, అణచివేత పునాదులుగా లేచిన మతం ఒక వైపు; సమన్యాయం, సమధర్మం ఊపిరిగా పుట్టిన చైతన్యం మరో వైపు. ఈ రెండింటి మధ్యా యుద్ధం జరగనిదెప్పుడు? ప్రతి తరంలోనే కాదు, ప్రతి క్షణంలోనూ ఉంటుంది. ఉదయనిధి కేవలం ఈ సనాతన పోరాటానికి అధునాతన రూపం మాత్రమే. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఇక ఇప్పుడైనా లేవండ్రా బాబూ అని గర్జిస్తారు, సంగ్రామం సమసిపోలేదని చెప్తారు. యుగాల పొడవునా కురిసిన నెత్తుటి సాక్షిగా జాతి మొత్తాన్ని మేలుకొలిపే పొద్దుపొడుపు పాటందుకుంటారు. ఇదేదో ఇప్పుడే మొదలైనట్టు వైరిపక్షం హుంకరిస్తుంది.
ఒకసారి గతాన్ని తిప్పి చూద్దాం. 1927 డిసెంబర్ 25 తేదీని గుర్తు తెచ్చుకుందాం. మంటల్లో దగ్ధమైన మనుస్మృతిని జ్ఞాపకం చేసుకుందాం. అదంతా చేసింది బాబాసాహెబ్ అంబేడ్కర్. మహద్ సత్యాగ్రహం సందర్భంగా మనుస్మృతిని అగ్నికి ఆహుతిచ్చాడు. అంటరానితనానికి ఆలవాలమైన మతాన్ని ధిక్కరిస్తున్నానని చెప్పడానికే ఈ పని చేశానన్నాడు. మతం పునాదుల మీద ఒక జాతినీ, నీతినీ నిర్మించలేరు అని అంబేడ్కర్ చేసిన హెచ్చరిక ఏ సనాతన ధర్మం గురించో, అదే సనాతన ధర్మాన్ని శతాబ్దాలకు ముందే బుద్ధుడూ నిరాకరించాడు. అంతకుముందు చార్వాకులూ నిరాకరించారు. మహాత్మా ఫూలే జీవితమంతా అదే పనిచేశాడు. తర్వాత పెరియార్ చేసిన యుద్ధమంతా అదే. 1956 ఆగస్టు ఒకటో తేదీన శ్రీరాముని చిత్రపటాలను బహిరంగంగా తగలబెట్టమని పెరియార్ పిలుపునిచ్చిన కాలం ఒకటుంది. లేదని ఎవరు అనగలరు? వేలాది అరెస్టుల మధ్య లక్షలాది జనసమూహం సాక్షిగా దగ్ధమైన రాముడి చిత్రపటాల చిటపటలు నిజం కాదని ఎవరు చెప్పగలరు? అంబేడ్కర్ మరణానంతరం రిపబ్లికన్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో గణనీయంగా సీట్లు సాధించింది. 1959లో పెరియార్‌ని కాన్పూర్ ఆహ్వానించి ఆయనకు ఖడ్గాన్ని బహూకరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో రామాయణ కాపీలను చించి నిరసన తెలిపిన సందర్భం ఉంది. ఎప్పుడో 1944లోనే పెరియార్ రాసిన వాల్మీకి రామాయణం, తర్వాత ముప్పయ్యేళ్ళకి సచ్చీ రామాయణ్ అని హిందీలోకి అనువాదమైంది. అది హిందీ లోకంలో భూకంపం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధిస్తే అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే అక్కడా చుక్కెదురైంది. సచ్చీ రామాయణ్‌లోని సత్యమే గెలిచింది. ఉత్తరాది మీదుగా వచ్చి దక్షిణాదిని కబళించిన ఆర్యుల ప్రతినిధి రాముడని పెరియార్ వాదన. మూలవాసులైన ద్రవిడ సంతానాన్ని రాక్షసులుగా చిత్రించి, దక్షిణాది స్త్రీలను అవమానించిన రక్తచరిత్రే రామాయణం అని వాల్మీకి రామాయాణాన్నే ఆధారంగా చేసుకుని పెరియార్ యధార్థ రామాయణాన్ని రాశారు. తమిళనాడు మూలమూలల్లోనూ ఆ రామాయణం నాటక రూపంలో ప్రదర్శింపబడింది. ఈ విషయం నెహ్రూ దృష్టికి వచ్చినప్పుడు ఉత్తరాది ప్రజల నుంచి అణచివేతకు గురైన దుష్పరిణామాల స్వరూపం ఇదని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ‘ఇది అర్థం చేసుకోవాల్సిన సెంటిమెంటు. దీనిని విస్మరించిన హిందీ నాయకులు హిందీకి గానీ దేశానికి గానీ పెద్దగా మూల సహాయకులుగా ఉండలేరు’ అని నెహ్రూ అభిప్రాయపడినట్టు 1954 డిసెంబర్ 15న ‘ది మెయిల్’ ప్రచురించిన విషయాలను యధార్థ రామాయణం అనే పుస్తకంలో పొందుపరిచారు. ఇంత చరిత్ర ఉంది.
సనాతన ధర్మం ఎంత పురాతనమో దాని పట్ల వ్యతిరేకత కూడా అంతే పురాతనమైంది. అభ్యుదయ రచయితల సమావేశంలో సనాతన ధర్మం నిర్మూలన అనే అంశం మీద మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ తాను వచ్చిన వారసత్వపు చైతన్యాన్ని ప్రదర్శించాడు. ఎక్కడ ఏ సందర్భంలో ఎవరు ఏం మాట్లాడారన్నదే చూడాలి. తమిళనాడులో పెరియార్ రామస్వామి 20వ శతాబ్దంలో ఆర్య సంస్కృతి పెత్తనం మీద, ఆధిపత్యం మీద సాగించిన మహోద్యమం, ఈ దేశం మొత్తం మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సాగే ఉద్యమాలకు, పోరాటాలకు గట్టి పునాది వేసింది. పెరియార్ వారసత్వం డీఎంకే అధినేత కరుణానిధి, ఆ తరువాత అతని కుమారుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇలా నాలుగు తరాలుగా కొనసాగుతూ వచ్చింది. సనాతన ధర్మం మీద పోరాటం అంటే వర్ణధర్మం మీద పోరాటం. అంటే మనుస్మృతి ప్రకారం ఈ దేశంలో ఏ కులవ్యవస్థ అయితే అసమానతల పునాదుల మీద ఏర్పడిందో దానిమీద పోరాటం. కొన్ని వర్గాలకు ఆధిపత్య స్థానం, కొన్ని వర్గాలకు బానిసత్వ స్థానం నిర్దేశించినది వర్ణధర్మ వ్యవస్థ. దీన్ని శాసనబద్ధం చేసింది మనుస్మృతి. దీని వెనుక ఉన్నదే సనాతన ధర్మం. ఈ మనుస్మృతినే తగలబెట్టమన్నాడు అంబేద్కర్. ఈ మనుస్మృతి వెనుకనున్న సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే బ్రాహ్మణాది అగ్రవర్ణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి సమాజంలో సమస్త వర్ణాల సమగ్ర అభివృద్ధిని కాంక్షించడం. ఇది తమిళనాడులో పెరియారు వారసులుగా చెప్పు కుంటున్న వారి వాదనే కాదు. ఫూలే అంబేడ్కర్ పెరియార్ వారసులందరి వాదన. ఈ వారసత్వం కొనసాగింపే ఉదయనిధి స్టాలిన్.
అయితే ఇప్పుడిప్పుడే ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు ఎక్కడ దొరుకుతాయా నొక్కి పారేయాలని తహతహలాడుతున్న బీజేపీ, దాని వెనుక ఉన్న ఇతర హిందుత్వ శక్తులకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య గొప్ప అస్త్రమైంది. దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సనాతన ధర్మాన్ని తుడిచివేయాలని, భారతీయుల సాంస్కృతిక పరంపరను నాశనం చేయాలని ఆలోచిస్తున్న శక్తులన్నీ కలిసి ఇప్పుడు ప్రతిపక్ష కూటమిగా ఏర్పడ్డాయని, హోంమంత్రి అమిత్ షా నుంచి అనేకమంది బీజేపీ నాయకులు మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. హిందూ ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నవారే ప్రతిపక్షాల్లో 90శాతం నాయకులున్నారు. వారంతా హిందూ మతం నిర్మూలనకు దిగారంటే పిల్లలు కూడా నవ్వుతారు. దీన్నే పట్టుకొని బీజేపీ వారు ఊరేగితే అది కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్న సామెతకు పరమోదాహరణగా మిగిలిపోవచ్చు.
కానీ ఇదొక సాంస్కృతిక తాత్విక పోరాటం. ఎన్నికలలో తాత్కాలిక విజయాలతో ఈ పోరాటం అంతం కాదు. ఏవేవో స్వార్థాలతో, ఏవేవో కోరికలతో చేతులు కలిపి సింహాసనం ఎక్కినా ఆ కలయికలు ఎంతో కాలం నిలవవు. ఏలుబడిలో ఉన్న ఆధిపత్య విధ్వంస భావజాలానికి విరుగుడుగా కోటిరంగుల ఇంద్రధనుస్సుల కూటమి కావాలి. ఈ దేశంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం. ఇది ఒక్క ఉదయనిధితో సాధ్యం కాదు, కోట్లాది జ్ఞాననిధులు ఉదయించాలి.
ప్రసాదమూర్తి
Updated Date - 2023-09-14T01:24:25+05:30 IST