ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ క్రూరత్వం ఈనాటిది కాదు!

ABN, First Publish Date - 2023-10-22T03:41:22+05:30

కొన్ని రోజులుగా పాలస్తీనాకూ, ఇజ్రాయిల్‌కూ మధ్య కొత్తగా జరుగుతున్న యుద్ధంలో కొన్ని వేలమంది పిల్లలూ, స్త్రీలూ, పురుషులూ, వృద్ధులూ, హత్యలకు గురవుతున్నారు. అసలు యుద్ధాలు అంటేనే హత్యలు!...

కొన్ని రోజులుగా పాలస్తీనాకూ, ఇజ్రాయిల్‌కూ మధ్య కొత్తగా జరుగుతున్న యుద్ధంలో కొన్ని వేలమంది పిల్లలూ, స్త్రీలూ, పురుషులూ, వృద్ధులూ, హత్యలకు గురవుతున్నారు. అసలు యుద్ధాలు అంటేనే హత్యలు! రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో రాసిన ఒక ‘మ్యూజింగ్స్’లో, చలంగారు యుద్ధాల గురించి ఇలా అంటారు: ‘హత్యలు! ఎక్కడ చూసినా హత్యలు! యుద్ధం ముందు హత్యలు! యుద్ధమంతా హత్యలు! యుద్ధం తర్వాత హత్యలు! పదివేలమందిని హత్య చేశారంటే, అది వినేవారికి అవి ఉత్త అంకెలు. చీమలమల్లే పుట్టుకొచ్చే ఈ ప్రజలలో పదివేలమంది ఒక సంఖ్య కాదు. మళ్ళీ నిండుకుంటారు అవలీలగా. కానీ, ఒక్క జీవితం, ఒక మనిషిది. ఆలోచించి, మాట్లాడి, ప్రేమించి, కలలు కనే ఒక్క జీవితం! ఇంక ఎన్నడూ తిరిగిరాని జీవితం! అనేకమైన సజీవమైన లతలతో ఇతరుల్ని పెనవేసుకున్న జీవితం! ఎంత విలవ!’

గత 75 ఏళ్ళుగా దురాక్రమణలూ, హత్యలూ ప్రధానంగా ఇజ్రాయిల్ వేపునించే జరిగాయి. మొన్న మొదలైంది మాత్రం పాలస్తీనాకు చెందిన ‘హమాస్’ దాడితోనే! మెజారిటీ పాలస్తీనా జనాలు ఓట్లు వెయ్యగా ప్రభుత్వాధికారంలోకి వచ్చిన పార్టీ హమాస్. ఎవరు ఎప్పుడు మారణకాండ మొదలెడితేనేమీ, చచ్చిపోయేదీ, అంగవైకల్యం చెందేదీ సాధారణ ప్రజలూ, సైనికులే!

మరీ ప్రాచీన చరిత్ర సంగతి తెలీదు గానీ, వలస పాలనా కాలంలో, మొదట్లో అరబ్బులు మెజారిటీగానూ, యూదులు తక్కువ సంఖ్యలోనూ వున్న ప్రాంతం పాలస్తీనా. ఆ తర్వాత, ప్రపంచంలో అనేక దేశాల్లో చెల్లాచెదురుగా వున్న యూదులు, తమ మతానికి చెందిన ప్రాచీన ఆరాధనాలయాలున్న పాలస్తీనాకి వచ్చి, స్థిరపడ్డం మొదలుపెట్టారు. అప్పటికి ఇజ్రాయిల్ అనే పేరుతో ఒక దేశం అంటూ లేదు. ఆ కాలంలో, బ్రిటన్‌కి పాలస్తీనా ఒక రకమైన వలసగా వుండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఐక్యరాజ్యసమితి పాలస్తీనా భూభాగాన్ని రెండు రాజ్యాలుగా– ఇజ్రాయిల్‌గానూ, పాలస్తీనాగానూ – విభజించాలని తీర్మానించింది. ఈ విభజన తీర్మానం కారణంగా యూదులకూ, అరబ్బులకూ మధ్య ఘర్షణలు జరిగాయి.

ఇజ్రాయిల్, తనకు కేటాయించిన భూభాగాన్ని మించి ఇంకా ఆక్రమించే ఉద్దేశంతో, 1948లో, బ్రిటన్ పాలన ముగిశాక, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. దాన్ని పాలస్తీనా అరబ్బులు వ్యతిరేకించగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సమయంలో, ఇజ్రాయిల్ తనకి ఐక్యరాజ్యసమితి కేటాయించిన భూభాగాన్ని దాటి, పాలస్తీనాలో అనేక ప్రాంతాల్ని ఆక్రమించుకుంది. ఇంక అప్పటినించీ, ఇప్పటి దాకా యుద్ధాలూ, శాంతి చర్చలూ, కాల్పుల విరమణలూ, మళ్ళీ ఆక్రమణలూ, యుద్ధాలూ... ఇలా సాగుతూనే వుంది. పైగా, తను ఆక్రమించిన ప్రదేశాల చుట్టూ ఎత్తయిన గోడలూ, కొన్ని చోట్ల కంచెలూ కట్టి, పాలస్తీనా ప్రజల కదలికల మీద కఠినమైన ఆంక్షలు పెట్టింది. పాలస్తీనా ప్రజల వేపు న్యాయం వుందనీ, ఇజ్రాయిలే దురాక్రమణదారనీ ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. కానీ, అగ్రరాజ్యాల ఆర్ధిక, రాజకీయ లావాదేవీల వల్ల, సమస్యకి పరిష్కారం దొరకలేదు. అందుకే, పాలస్తీనా జనం, తమ రక్షణ కోసం, ఉగ్రవాద సంస్థగా ముద్రపడినప్పటికీ, ‘హమాస్’ని అధికారంలోకి రానిచ్చారు. ఉగ్రవాద సంస్థలు చేసే పనులేమిటంటే: శత్రు పక్షపు సైన్యంతో తలపడడం, శత్రు పక్షపు ప్రజల్ని బెదిరించడం, బలవంతంగా ఎత్తుకెళ్ళడం, చిత్రవధలకు గురిచేయడం, చంపడం వంటి క్రూరమైన పనులు చెయ్యడం. ఇజ్రాయల్ ప్రభుత్వానిది కూడా ఉగ్రవాద పంధాయే అని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఎన్నో ఆధారాలతో, ఎప్పటినించో చెపుతున్నాయి.

ఏ పక్షం వారు చేసినా, తమదే ధర్మ యుద్ధం అని చెప్పుకున్నా, నిజంగానే ఒక పక్షానికి చాలా అన్యాయం జరిగింది అనుకున్నా, ఉగ్రవాదం అనేది క్రూరమైనదే! అది బాధితులకు దోపిడీ పీడనల నించి విముక్తి నివ్వదు. పైగా, ఒక పక్షం ఇంకో పక్షం మీద చేసే దౌర్జన్యాల్ని జనాలు సమర్ధించే ‍స్థితికి దారితీస్తుంది. సరైన పోరాట పంధానించీ బాధితుల్ని పక్కదారి పట్టిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న క్రూర చర్యలకు ప్రధాన బాధ్యత ఇజ్రాయిల్‌దే అయినా, హమాస్ చర్యలు కూడా ఒక కారణం! కానీ, ఇప్పుడు, పాలస్తీనా వేపు నించీ జరిగిన మారణకాండనే పదే పదే ఎత్తి చూపుతున్నాయి టీవీలూ, పత్రికలూ! ఏమీ తెలియని ఇజ్రాయిల్ పసిపిల్లల్ని హమాస్ కిరాతకంగా చంపిన దృశ్యాలను పదే పదే చూపుతున్నారు. హమాస్ చర్యల్ని మాత్రమే చూపి, ఇజ్రాయిల్ సైన్యం జరుపుతున్న కిరాతకాల్ని ఖండించకపోవడం దారుణం. భారత ప్రధాని చేసిన పనికూడా ఇదే! అంటే, ఇజ్రాయిల్ చేసే దౌర్జన్యకాండకి మద్దతు ఇవ్వడమే కదా ఇది?


ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ తరచూ ఇచ్చే నినాదం: ‘జై బజరంగ్ బలీ’ (జై హనుమాన్) అని! ఆ బజరంగబలి చేసిన పనుల్ని, ఈ యుద్ధ సమయంలో ప్రజలు తెలుసుకోవాలి. ప్రధానీ, అతని పార్టీ, రాజకీయ అధికారం కోసం వాడుకునే పవిత్ర గ్రంధంలో, ఒక ఘట్టం చూడాలి. లంకా దహన వర్ణనలు చూడండి! ‘కోటి సూర్యులతో సమానుడగు అగ్ని, పిడుగులు పడినటుల, నానా విధములగు భయంకరమైన శబ్దములచే, బ్రహ్మాండమును జీల్చు దానివలె, లంక నంతయును జుట్టుకొని వెలింగెను.’ – ‘ఓ తండ్రీ! ఓ బిడ్డా! ఓ కాంతుడా!.... ఓ జీవితమా!.... అన్నియు నాశనమైనవి గదా? అని చెప్పుకొనుచు రాక్షసులు కొందరు బహు విధముల ధ్వనులు చేసిరి.’ – ‘కొందరు స్త్రీలు, తలలు విరియ బోసుకుని, చంటి బిడ్డల నెత్తుకొని, కాలుచుం మిద్దెల మీద నుండి, త్వరగ కిందబడుచు ఆకాశములో మెరుపుల వలె ప్రకాశించిరి.’ – ‘అగ్ని, కట్టెల చేతనూ, కసవు చేతనూ తృప్తి గాంచలేదు. రాక్షసుల శవములతో భూమి తృప్తి పొందలేదు. వానర శ్రేష్టుడగు హనుమంతుడు, నిప్పు పెట్టి తృప్తి పొందలేదు.’ – ‘అగ్ని జ్వాలలు కొన్ని ప్రదేశములలో మోదుగు పూల వలెను, కొన్నిచోట్ల బూరుగు పూల వలెను, కొన్ని చోట్ల కుంకుమ పూల వలెను హ్రకాశించినవి.’ – ‘కొన్నిచోట్ల, అగ్ని చల్లారిపోవు సమయములో, పొగ వ్యాప్తమై చేరిన మేఘములు నల్ల కలువల వలె ప్రకాశించినవి.’ – ‘లంకలో నుండు ఉత్తములగు రాక్షసులందరును గూడి ఈ ప్రకారము జెప్పుకొనిరి.’ – ‘సమస్తమైన దేవతలూ, రుషి శ్రేష్ఠులూ, గంధర్వులూ, విద్యాధరులూ చెప్పుటకు సాధ్యము గాని సంతోషమును బొందిరి.’ – ఈ బీభత్స దృశ్యాలను, ‘సుందర’ దృశ్యాలుగా పవిత్ర గ్రంధంలో వర్ణించారు. (సుందర కాండ, సర్గ 54, శ్లోకాలు 18 నించీ 44 దాకా. ‘రామాయణా’నికి, చదలువాడ సుందర రామ శాస్త్రులు గారి అనువాదం. ప్రచురణ: వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి.)

శత్రు దేశపు పిల్లలనీ, తల్లులనీ బాధలకి గురిచేసే భావాలు కేవలం ఒక్క మతగ్రంధంలోనే కాదు, అన్ని మతగ్రంధాలలోనూ చూడవచ్చును. ఉదాహరణకి, ‘జిహాద్’ (ధర్మయుద్ధం) నియమాలలో ఒకటి: ‘కావాలని చెయ్యకపోతే, రాత్రిపూట శత్రువుల మీద దాడి జరిపినప్పుడు మాత్రం స్త్రీలనీ, పిల్లల్నీ చంపవచ్చును.’ (‘కితాబ్ అల్ జిహాద్ వల్ సిదూర్’, చాప్టరు–9, బుక్–19, నంబర్ –4321). ఇంకో మత గ్రంధం నించీ: ‘ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని…బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరిని వధించెను’ (మత్తయి, 2–16)

ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను చూస్తే, ప్రపంచంలో ఇంకా మానవ సమాజం ప్రారంభం కాలేదనీ, ధర్మ–అధర్మ పక్షాలు రెండూకూడా, మనుషులవలే గాక, ఆటవిక ధర్మం ప్రకారం క్రూర మృగాలవలే ప్రవర్తిస్తున్నాయనే అర్ధానికి రావల్సివస్తుంది! చివరిగా చెప్పుకోవలిసింది: పాలస్తీనా ప్రజల పోరాటం పూర్తిగా న్యాయమైనది. అయినప్పటికీ, హమాస్ వంటి సంస్థలు చేసే పనుల వల్ల, పాలస్తీనా ప్రజలకు రావలిసిన సానుభూతి దొరకదు.

రంగనాయకమ్మ

Updated Date - 2023-10-22T03:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising