ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అవినీతి పంకిలంలోకి అందరినీ లాగేందుకే..!

ABN, First Publish Date - 2023-09-20T01:35:06+05:30

జ‍గన్‌రెడ్డి ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబుకి అవినీతి మరక అంటించలేడు. తెలుగు ప్రజలే కాదు, అన్ని దేశాల ప్రజలు ఆత్మీయంగా అభిమానించే ఆదర్శ నాయకుడు...

జ‍గన్‌రెడ్డి ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబుకి అవినీతి మరక అంటించలేడు. తెలుగు ప్రజలే కాదు, అన్ని దేశాల ప్రజలు ఆత్మీయంగా అభిమానించే ఆదర్శ నాయకుడు చంద్రబాబు. ప్రతి నిమిషం జనంలోనే ఉంటూ, జనం కోసమే పరితపిస్తున్న ప్రజా నాయకుడు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్ మోసకారి మాయోపాయాలను ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నది. ఎటువంటి ఆధారాలు చూపకుండా, కేవలం కక్ష సాధించడం కోసం చంద్రబాబుని అరెస్ట్ చేసిన సైకో మనస్తత్త్వంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చరిత్రలో లేనివిధంగా సీఐడీ చీఫ్, అదనపు అడ్వకేట్ జనరల్ ఇద్దరూ రాజకీయ నాయకుల అవతారం ఎత్తి ఊరూరా ఊరేగుతూ ప్రెస్‌మీట్‌లు పెట్టి కాకిలెక్కలు, కట్టు కథలు చెబుతూ ఏదో జరిగినట్లు చూపేందుకు అవస్థలు పడుతున్నారు.

ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే జగన్‌రెడ్డి చంద్రబాబుపై కక్ష తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. అవినీతి కేసులలో తాను జైలు జీవితం అనుభవించాల్సి రావడానికి చంద్రబాబు కూడా కారణం అన్న అభిప్రాయంతో ఉన్న జగన్‌, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ చంద్రబాబునే టార్గెట్‌ చేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ 2021లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు 2023లో, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, నిధుల దుర్వినియోగం అయ్యాయంటూ తప్పుడు కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేశారు. కానీ నిధులు విడుదల చేయడంలోనే గాక, అందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసిన సంబంధిత శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి మాత్రం ఈ కేసులో లేరు.

2021లో కేసు నమోదు చేసినప్పుడు చంద్రబాబును నిందితుడిగా చేర్చలేదు. రెండున్నరేళ్ల తర్వాత ఎవరో ఆడిటర్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును నేరుగా అరెస్టు చేశారు. అసలు చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టిన కేసు చూస్తే అందులో నస తప్ప పస లేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా సీఐడీ అధికారులు అత్యుత్సాహంతో చంద్రబాబుపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో పాల్గొని విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. నిధుల విడుదలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉండదు. మంత్రివర్గ నిర్ణయాలు తీసుకున్న తర్వాత నిబంధనలు, చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంటుంది. కానీ ఈ వ్యవహారంలో మంత్రి మండలిలో నిర్ణయమే తీసుకోలేదని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ అడ్డగోలుగా అబద్ధాలతో బుకాయించడం సిగ్గు చేటు.


సీఐడీ చీఫ్, అదనపు అడ్వకేట్ జనరల్ వైసీపీ నాయకులవలె వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లబ్ధిదారుడు చంద్రబాబు అని ఆరోపిస్తున్న సీఐడీ చీఫ్‌ను నిధులు చంద్రబాబుకు చేరినట్లు ప్రాథమిక ఆధారాలు ఎందుకు చూపలేదని ప్రశ్నిస్తే ‘దర్యాప్తు జరుగుతున్నది’ అంటున్నారు. మరి దర్యాప్తులో తేలకుండా, ఆధారాలు లేకుండా చంద్రబాబుని నిందితుడిగా ఎలా చేర్చారని అడిగితే ‘మీరు కూడా దర్యాప్తు సంస్థలో చేరతారా’ అంటూ విలేకర్లను వెటకారం చేశారు. కేసులో నిజంగా తప్పు జరిగితే, నిధుల దుర్వినియోగం జరిగితే, అందుకు ప్రథమ ముద్దాయిలు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ప్రేమచంద్రారెడ్డి, అజయ్ కల్లం రెడ్డి అవుతారు. చంద్రబాబును దోషిగా నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు. కానీ దర్యాప్తు సంస్థలు చంద్రబాబుని దోషిగా చూపడం ఏమిటి? నిధులు ఎక్కడికి వెళ్లాయో దర్యాప్తు చేయకుండా, నిర్ధారించకుండా ముందే అరెస్టు ఎలా చేస్తారు? గవర్నర్ అనుమతి లేకుండా ప్రతిపక్ష నేతను అరెస్టు చేయకూడదని చట్టంలో ఉన్నది. ఈ నిబంధన ఎందుకు పాటించలేదు? చట్టం పాటించలేదంటే సీఐడీ వద్ద ఆధారాలు లేకనే కదా? ఇది కక్ష సాధింపు కాక మరేమిటి?

డొల్ల కంపెనీలు నెలకొల్పి పథకం ప్రకారం చంద్రబాబు వ్యక్తిగత లబ్ధి పొందారన్నది సీఐడీ ఆరోపణ. 2021లో కేసు నమోదైంది. సీఐడీ కొంతమందిని అరెస్ట్‌ చేసి ఛార్జిషీట్‌ వేసింది. నిందితులు బెయిలుపై విడుదలయ్యారు. హైకోర్టులో విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్‌ అయింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు అనూహ్యంగా ఇప్పుడు ఎలా తెరమీదికి తెచ్చారు? దాదాపు రెండేళ్ల తర్వాత, అది కూడా 36 మంది అధికారులు బయట ఉండగా, ఎలాంటి పురోగతీ లేని కేసులో ఎలాంటి సాక్ష్యాలు బయటపడని 36 మందిని వదిలేసి 37వ వ్యక్తిగా సాక్ష్యాలు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేయడం ఎంత దారుణం!

స్కిల్‌ ప్రాజెక్టు నిజమని సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలు బలంగా చెబుతున్నాయి. అందులో తాము శిక్షణ పొంది ఉద్యోగాలు పొందామని ఎంతోమంది యువతీయువకులు వాపోతున్నారు. ప్రాజెక్టు అమలు చేశారనడానికి సాక్ష్యంగా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించడానికి వీటిని పరిశీలించకుండా కేవలం నిధుల గురించే సీఐడీ మాట్లాడటం ఏమిటి? సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ యజమాని జగన్‌రెడ్డిని సంతోష పెట్టేందుకు రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ ఇద్దరూ విజయవాడ, హైదరాబాద్‌, దేశ రాజధాని ఢిల్లీల్లో ప్రెస్ మీట్‌లు పెట్టి అబద్ధాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ప్రదర్శిస్తున్నారు, తప్ప ఆధారాలు మాత్రం చూపడం లేదు. నిజంగా ఈ కేసులో అక్రమాలే జరిగి ఉంటే వాటిని నిరూపించకుండా, కేవలం సకల శాఖామంత్రి సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని, నిధులు ఆయనకే చేరాయని పదే పదే ప్రచారం చేసి చంద్రబాబును బదనాం చేయాలని చూస్తున్నారు.

జగన్ తాను మాత్రమే అవినీతిపరుడిని కాదు చంద్రబాబు కూడా అవినీతిపరుడే అని చూపేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇదంతా! సీఐడీ జగన్ జేబు సంస్థగా మారింది. జగన్ ఎలా ఆడమంటే అలా ఆడుతున్నది. ఈ రోజు వేధిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకొనే రోజు దగ్గరలోనే ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు అరెస్టును సమర్థించుకోడానికి జగన్ ‘కాపు నేస్తం’ సభలో ఆయాస పడ్డారు. ఏదో జరిగిపోయిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందే రూ.371కోట్లు. ఆ డబ్బులతో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఇప్పటికీ ఉన్నాయి. అయినా సరే, మొత్తం రూ.371కోట్లను చంద్రబాబు తినేశారంటూ జగన్‌ ఆ సభలో అబద్ధాల ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టగానే, సభా ప్రాంగణంలో వెనుక ఉన్న వారంతా లేచి వెళ్లిపోయారు. నేరస్థులు రాజ్యాలు ఏలుతూ నీతిమంతులను జైళ్లకు పంపుతున్నారు.


అవినీతి గురించి జగన్‌రెడ్డి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు అప్పులు తీర్చడం కోసం సొంత ఇంటిని కూడా అమ్మకానికి పెట్టిన కుటుంబం, ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకొని 60కి పైగా షెల్ కంపెనీలను పెట్టడం, సొంత పత్రికను, ఛానెల్‌ను ప్రారంభించడమే గాక సిమెంట్‌ పరిశ్రమలు, విద్యుత్‌ ప్లాంట్లతో పాటు, రాష్ట్రానికి ఒక్కో ప్యాలెస్‌ నిర్మించుకున్నది నిజం కాదా? కేవలం ఐదేళ్లలోనే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్ద మనిషి అవినీతి గురించి మాట్లాడటాన్ని చూసి జనం నవ్వుకొంటున్నారు. జనాన్ని దోచిన డబ్బుతో దేశంలోని ముఖ్యమంత్రుల్లోకెల్లా అత్యంత ధనవంతుడై వెలిగిపోతూ అవినీతి గురించి మాట్లాడటం చూసి గురివిందలు సిగ్గు పడుతున్నాయి.

తండ్రి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా తవ్వి పోసిన సంపదను పోగేసుకున్న జగన్మోహన్‌ రెడ్డి, ఇప్పుడు తానే ముఖ్యమంత్రిగా ఉన్నందున ఇంకెంత పోగేసుకొని ఉంటారో ఏ ఆర్థిక గణాంక నిపుణుడైనా లెక్క తేల్చాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అంతులేని సంపదను పోగేసుకోవడం ఎలాగో జగన్మోహన్‌ రెడ్డికి తెలిసినంతగా దేశంలో మరొకరికి తెలియదు. అయినా ఆయన ఇతరులను గజదొంగలుగా అభివర్ణిస్తున్నారు! తన అధికారానికి అడ్డు వచ్చే వారంతా జగన్ దృష్టిలో గజదొంగలు. ప్రభుత్వ సంపదనే కొల్లగొట్టి అపర కుబేరుడిగా, పారిశ్రామికవేత్తగా, పత్రికాధిపతిగా కూడా మారినా, తాను మాత్రం ప్రజలకు మంచి చేస్తున్నానని చెప్పుకుంటారు.

ఏది ఏమైనా రాజకీయ ప్రతీకారంతో చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి నేరాన్ని నిరూపించే ఒక్క ఆధారం జగన్ ప్రభుత్వం చూపలేకపోయింది. రానున్న రోజుల్లో దీనికి అధికారులు, జగన్‌రెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

యనమల రామకృష్ణుడు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

Updated Date - 2023-09-20T01:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising