ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేటి పథకాలు రేపటిని కుంగదీయకూడదు!

ABN, First Publish Date - 2023-11-02T02:05:13+05:30

తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం– ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో జరగనున్నాయి. పార్టీలు హామీలతో ఓటర్లని హోరెత్తిస్తున్నాయి....

తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం– ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో జరగనున్నాయి. పార్టీలు హామీలతో ఓటర్లని హోరెత్తిస్తున్నాయి. వీటిలో కొన్ని హేతుబద్ధమైనవి ఉన్నాయి, ఇంకొన్ని హాస్యాస్పదమైనవి, మరికొన్ని ఇంత మూర్ఖత్వమా అనిపించేవి, ఇంకొన్నయితే ఏ మాత్రం అనుమానం అక్కర్లేకుండా ప్రమాదకరమైనవి ఉన్నాయి. తాత్కాలిక వ్యక్తిగత లబ్ధి కలిగించే ఇటువంటి హామీలనే ఈ ఏడాది మొదట్లో కర్ణాటకలో కూడా ఇచ్చారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత విద్యుత్‌, ఉచిత ప్రయాణాలు, వృద్ధాప్య, సామాజిక పెన్షన్లు పెంచటం, మహిళలు, రైతులు, స్కూలు విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు... ఇలా జాబితా కొనసాగుతూనే ఉంటుంది.

మధ్యప్రదేశ్‌లో అయితే, ఒక పార్టీ రాష్ట్రానికి సొంత ఐపీఎల్‌ జట్టును కూడా హామీ ఇచ్చింది! అవన్నీ ఒక ఎత్తయితే, చాలా రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదకరమైన హామీని కొన్ని పార్టీలు ఇచ్చాయి. ఈవేళ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా చూపకుండా, ప్రతి అయిదేళ్లకోసారి జీతం పెరిగినప్పుడల్లా భారీగా, అమలు అసాధ్యమైన రీతిలో పెరుగుతుండే ప్రభుత్వోద్యోగుల పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) తిరిగి తీసుకొస్తామని ప్రకటించాయి. మన జనాభాలో పనిచేసేవారిలో ప్రభుత్వోద్యోగ్యుల సంఖ్య కేవలం 3శాతం. కానీ వీరికి మాత్రమే వర్తించే ఓపీఎస్‌ అమలు చేస్తే, ఆర్థిక వ్యవస్థ దివాలా తీయటం, వచ్చే తరాల భవిష్యత్తు అంధకారమవటం ఖాయం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రకాల వ్యక్తిగత తాత్కాలిక సంక్షేమ పథకాలను ప్రతిపాదించి ప్రజల మద్దతు కోరే బాధ్యత, హక్కు పార్టీలకు ఉంటాయి. కానీ ఎన్నికలు ఈ వేళ పూర్తిగా వ్యక్తిగత తాత్కాలిక సంక్షేమ పథకాల స్థాయికి పడిపోయి, అసలు ప్రభుత్వం ఎందుకోసం ఉందో ఆ మౌలిక బాధ్యతలు చర్చలో లేకుండా పోయాయి.

ప్రజలందరికీ ఉమ్మడిగా ఉపయోగపడే మౌలిక వసతులు, చట్టబద్ధపాలన, కనీస సౌకర్యాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు చర్యలు.. ఇవన్నీ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ప్రభుత్వం ఆ లక్ష్యాలని మొక్కుబడిగా తప్ప పట్టించుకోకుండా, పార్టీలన్నీ తాత్కాలిక సంక్షేమ పథకాల చుట్టూనే ఎన్నికల్ని తిప్పుతున్నాయంటే దేశం ప్రమాదంలో ఉందని అర్థం. జవహర్‌లాల్‌ నెహ్రూ చాలాకాలం క్రితమే మనల్ని మందలించారు: ‘భారతదేశం గెలిస్తే, ఓడేదెవరు; భారతదేశమే ఓడిపోతే, ఇక గెలిచేదెవరు?’. కానీ ఈ వేళ చాలాపార్టీలు భారతదేశం ఓడిపోయినా తమకు లెక్కలేదని మనకు స్పష్టమైన సంకేతాన్నిస్తున్నాయి; అన్ని రకాలుగా అధికారమే వారి పరమావధి!

‘ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?’ అని చాలామంది ప్రజలు అమాయకంగా ఆవేశపడుతుంటారు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని ఆశపడుతుంటారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశం మీద ఆ మధ్య ఒక పిటిషన్‌ను స్వీకరించింది. కానీ ఎన్నికల మేనిఫెస్టోల్లో ఎన్నికల సంఘం (ఈసీ), కోర్టుల పాత్ర ఉండదు.

ప్రభుత్వానికుండే రాజ్యాంగబద్ధ విధులతో సంబంధంలేకుండా అసంబద్ధంగా ఇచ్చే హామీల విషయంలో మాత్రమే ఎన్నికల సంఘం లేదా కోర్టులకు కొంత పాత్ర ఉంటుంది. కానీ అటువంటి సందర్భాల్లో కూడా తమకున్న అధికారాన్ని వినియోగించటంలో అవి ఇప్పటిదాకా విఫలమయ్యాయి. ఉదాహరణకి, తమను ఎన్నుకుంటే ఓటర్లకు కలర్‌ టీవీలను ఇస్తామని 2006లో డీఎంకే హామీ ఇచ్చింది. కలర్‌ టీవీల్ని పంచటం రాజ్యాంగపరంగా ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో భాగం కాదు. కాబట్టి ‘జోక్యం చేసుకోండి, అలాంటి హామీల్ని నిలువరించండి’ అని అప్పుడు నేను ఈసీని కలిసి కోరినా స్పందించలేదు.

మీరు టీవీల పందేరానికి అనుమతిస్తే, ప్రతి కుటుంబానికి 10 గ్రాముల బంగారం ఎందుకు పంచకూడదు? నెలనెలా అయిదు బాటిళ్ల మద్యం ఇంటింటికీ ఎందుకు పంపిణీ చేయకూడదు? ఎన్నికల హామీల విషయంలో ఒక గీత దాటకూడదన్నది సుస్పష్టం; ప్రభుత్వానికి రాజ్యాంగం నిర్దేశించిన పాత్రే అందులో తర్కం. కానీ ఈ కొద్దిపాటి పరిధిలో కూడా తనకున్న పరిమిత అధికారాన్ని వినియోగించటంలో ఈసీ, విజ్ఞతతో దిశానిర్దేశం చేయటంలో కోర్టులు విఫలమవటం విచారకరం.

తాత్కాలిక సంక్షేమ పథకాలు అసలు వద్దనటం సరి కాదు. ఓవంక పేదరికం బాధను తగ్గించటానికి, మరోవంక తమ ప్రయోజనాలను పట్టించుకుంటారనే, తమ గొంతుకు విలువ ఉందనే ఆశను, ఆత్మవిశ్వాసాన్ని సమాజంలో అన్ని వర్గాలకీ కల్పించటానికి హేతుబద్ధ సంక్షేమ పథకాలు అవసరం. వాటిని న్యాయమైన ఉపకరణాలుగా మనం గుర్తించాలి. కానీ చైనా సామెత చెప్పినట్లు, పేదవానికి కేవలం ఉచిత భోజనం కాకుండా, చేపలు ఎలా పట్టాలో నేర్పించి అందుకు తగ్గ సాధనాలు ఇవ్వాలి.

తాత్కాలిక వ్యక్తిగత సంక్షేమ పథకాలకి, దీర్ఘకాల ఆదాయాలు, ఆర్థిక ప్రగతికి మధ్య సమతూకాన్ని పునరుద్ధరించేందుకు మన చేతుల్లో ఉన్నదేమిటి? మొదటిది, తాత్కాలిక సంక్షేమ పథకాలు గనక స్పష్టంగా ప్రభుత్వ రాజ్యాంగ విధుల పరిధిలోనివి కానప్పుడు, అటువంటి హామీలు, ధోరణులపై కచ్చితంగా నిషేధం విధించాలి. ఉదాహరణకు ఉచితంగా కలర్‌ టీవీలు, బంగారం, మద్యం వంటివి. రెండోది, పేదరికం బాధ నుంచి ఉపశమనం కలిగించేందుకు అమలు చేసే మిగిలిన తాత్కాలిక పథకాలు మోయలేని అప్పు రూపంలో వచ్చేతరం మీద అన్యాయమైన భారం కాకుండా ద్రవ్య నిబంధనలుండాలి.

జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, తాత్కాలిక సంక్షేమాలు సహా ప్రభుత్వ రోజువారీ ఖర్చుకి అప్పు చేయకూడదు, ప్రభుత్వ సొంత ఆదాయం నుంచే ఆ ఖర్చు చేయాలి అనేది ప్రామాణిక సూత్రంగా ఉండాలి. అంటే రెవెన్యూ లోటు అనేది ఉండకూడదు.

అప్పు తెచ్చిన నిధులు భవిష్యత్తు అభివృద్ధికి, వచ్చే తరం ఆదాయాల్ని పెంపొందించేందుకు ఉపయోగపడాలి. అంటే, ఆస్తులు పెంచే పెట్టుబడికి, మౌలిక వసతులకి మాత్రమే వాటిని వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో రోజువారీ ఖర్చులకు వాడకూడదు. ఈ హద్దుల్లోపల, తమకు నచ్చిన ఏ కార్యక్రమాలనైనా అమలుచేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండాలి. అప్పుడు ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. ప్రజల తీర్పును ప్రమాణంగా తీసుకోవాలి, ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి; కానీ అదే సమయంలో, ఈవేళ్టి ఆదాయాల నుంచే ఈవేళ్టి ఖర్చులు చేస్తూ, అప్పు చేసిన డబ్బును భవిష్యత్తు కోసం పెట్టుబడులుగా మాత్రమే వినియోగించటం అనే పరిధి దాటకూడదు.

చివరిగా, మన ఆర్థిక వ్యవస్థకు, మన పిల్లల భవిష్యత్తుకి అసలైన ప్రమాదం, ఈవేళ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపు చేయకుండా రేపటి తరాల్ని పణంగా పెట్టి నిరంతరం భారీగా పెరిగిపోయేరీతిలో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుల నుంచి పొంచి ఉంది. అనేక రాష్ట్రాల్లో ఓపీఎస్‌కి తిరోగమించటం, అందుకోసం పార్టీలు బాధ్యతారహిత హామీలివ్వటం అనివార్యంగా ఆర్థిక వినాశనానికి దారితీస్తూ మన బిడ్డల ఆర్థిక భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి.

ఈ సవాలుకు సమాధానం సులభం. భవిష్యత్తులో అయ్యే ఖర్చుకి ఈవేళ చట్టబద్ధహామీ ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడే అందుకు తగిన చెల్లింపు నిధిని విధిగా ఏర్పాటు చేయాలి. డబ్బు విలువ తరుగుతుంటుంది కాబట్టి, రాబోయే కాలంలో చెల్లించేందుకు అవసరమైన డబ్బును అప్పటి విలువ ప్రాతిపదికన ఆ నిధిలో డిపాజిట్‌ చేయాలి. ప్రస్తుత బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయంలో భాగంగానే ఇదంతా చేయాలి.

అప్పుడు ఇష్టారాజ్యంగా తీసుకునే నిర్ణయాల భారం భవిష్యత్తు బడ్జెట్ల మీద పడదు. ఈ రకంగా చేయటంలో రాష్ట్రం విఫలమైతే, ఆ భవిష్యత్తు భారాన్ని వాయిదా వేసిన ఖర్చుగానే, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిగానే యూనియన్‌ ప్రభుత్వం పరిగణించాలి. ఆ ప్రాతిపదికన రుణం, లోటు మొదలైన నిబంధనల్ని అమలు చేయాలి. అప్పుడు ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని గౌరవిస్తూనే బడ్జెట్‌ ప్రక్రియలో పారదర్శకత, ద్రవ్య నిర్వహణలో జవాబుదారీతనానికి భరోసా వాటంతటవే సాధ్యమవుతాయి.

డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌

ప్రజాస్వామ్య పీఠం (ఎఫ్‌.డి.ఆర్‌),

లోక్‌సత్తా వ్యవస్థాపకులు

Updated Date - 2023-11-02T02:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising