ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడతెగని యుద్ధం!

ABN, First Publish Date - 2023-02-24T02:10:43+05:30

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి ఏడాది పూర్తయింది. భవిష్యత్తులో హెచ్చే వాతావరణమే కనిపిస్తున్నది. రష్యా అధ్యక్షుడు ఐదులక్షల సైన్యంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి ఏడాది పూర్తయింది. భవిష్యత్తులో హెచ్చే వాతావరణమే కనిపిస్తున్నది. రష్యా అధ్యక్షుడు ఐదులక్షల సైన్యంతో, మరింత ఆయుధ మోహరింపుతో వసంతకాల గర్జనకు సిద్ధపడుతుంటే, పశ్చిమదేశాలు ఉక్రెయిన్‌కు మరిన్ని ట్యాంకులు, క్షిపణులు, రక్షణవ్యవస్థలను సమకూర్చుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నేరుగా యుద్ధక్షేత్రంలో అడుగుపెట్టి, ఆప్తమిత్రుడి జీవితకాలపు రక్షణకు హామీ ఇస్తే, తాను సుదీర్ఘయుద్ధానికి సన్నద్ధంగా ఉన్నానని, ‘స్టార్ట్‌’ నుంచి వైదొలగడం ద్వారా పశ్చిమదేశాలతో అణుయుద్ధానికి కూడా వెనుకాడేది లేదని రష్యా అధ్యక్షుడు తేల్చేశారు. నెత్తురోడుతూనే ఉభయపక్షాలూ సాగిస్తున్న యుద్ధం మిగతా ప్రపంచాన్ని ఇంకా ఎంతకాలం హింసిస్తుందో తెలియనిస్థితి.

యుద్ధం జరుగుతున్న ఇరాక్‌లోనో, అఫ్ఘానిస్థాన్‌లోనో అమెరికా అధ్యక్షుడు పర్యటించడం వేరు, అమెరికా సైన్యం ప్రత్యక్షంగా లేని ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం వేరు. రష్యా కానీ, ఉక్రెయిన్‌ కానీ యుద్ధ విరామం ప్రకటించని దశలో, కీవ్‌ చేరిన బైడెన్‌ నడివీధుల్లో కూడా నడిచి, కూలిన భవనాలను దర్శించిన దృశ్యం అసామాన్యమైనది. మరో ఐదువందల మిలియన్‌ డాలర్ల ఆధునిక ఆయుధసంపత్తితో పాటు, ఉక్రెయిన్‌ ఎంతోకాలంగా అడుగుతున్న ఎఫ్‌ 16 యుద్ధవిమానాలను కూడా సత్వరమే అందిస్తానని రహస్య ప్రమాణం చేయడానికి ఆయన ఈ పర్యటన జరిపారట. ఆయన ఉక్రెయిన్‌లో ఉండగా హెచ్చరిక సైరెన్లు వినిపించాయి కానీ, రష్యా దాడి ఒక్కటీ జరిగిన దాఖలాలైతే లేవు. ఈ ధీరోదాత్త పర్యటన గురించి రష్యా చెవిలో ముందే వేయడానికీ, ఆ సమయంలో ఉక్రెయిన్‌మీద ఒక్కబాంబు పడకుండా రష్యా సైనికాధికారులు జాగ్రత్తలు తీసుకోవడానికీ ఉభయపక్షాలూ ఎంతో కష్టపడివుంటాయి. బైడెన్‌ పర్యటన తరువాత, ఎఫ్‌ 16 విమానాల తయారీ సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌ డజన్లకొద్దీ విమానాల తయారీకి నడుంబిగించిందన్న వార్తలు వస్తున్నాయి. భాగస్వామ్యదేశాలకు తప్ప ఇతరులకు నేరుగా ఎఫ్‌ 16 విమానాలు ఇవ్వకూడదన్న నియమం అమెరికా చట్టాల్లో ఉన్నది కనుక ఈ విమానాలు పోలెండ్‌కో, డెన్మార్క్‌కో, నెదర్లాండ్స్‌కో ముందు అమ్ముడుపోయి అక్కడనుంచి ఉక్రెయిన్‌కు బదిలీ అవుతాయని అర్థం.

యుద్ధాన్ని ఆరంభించింది రష్యా అధ్యక్షుడే కనుక, ఆయనే దానిని ముగించాలని పశ్చిమదేశాలు అంటూంటాయి. కానీ, కారకులూ కర్తలూ ఎవరో అమెరికా అధ్యక్షుడు తన నోటితోనే చెప్పారు. జూనియర్‌ బుష్‌, క్లింటన్‌ పాలనాకాలంలో నాటోలో చేరిన ‘బుఖారెస్ట్‌ నైన్‌’ అని పిలుచుకొనే తూర్పు యూరోపియన్‌ దేశాల కూటమిని ఉద్దేశించి బుధవారం పోలెండ్‌లో ప్రసంగిస్తూ, సెనేట్‌ సభ్యుడిగా నాటో విస్తరణకు తాను ఎంత కృషిచేసిందీ చెప్పుకొచ్చారు. మాజీ సోవియట్‌ రిపబ్లిక్కుల్లోనే కాక, తూర్పుయూరప్‌ దేశాలన్నింటా నాటో విస్తరణకు అమెరికా ఎంతగా శ్రమించిందో తెలియనిదేమీ కాదు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అనంతరకాలంలో చేసుకున్న ఒప్పందాలను తుంగలోతొక్కి తన పొరుగువరకూ నాటో క్రమబద్ధంగా చొరబడిన అవమానాలను రష్యా ఎంతోకాలంగా అవమానంతో భరించింది. విస్తరించిన ప్రతిచోటా నాటో ఆయుధాలను మోహరిస్తూ రష్యాను రెచ్చగొట్టింది. కనీసం, 1997 మేనెల తరువాత నాటోలో చేరిన తూర్పు యూరోపియన్‌ దేశాలనుంచి భారీ ఆయుధాలనైనా ఉపసంహరించుకోండి, ఉక్రెయిన్‌ను నాటోలోకి ఆహ్వానించకండి అన్న తన అభ్యర్థనలను తోసిపుచ్చినకారణంగానే ఈ యుద్ధం అనివార్యమైందన్నది రష్యా వాదన.

యుద్ధపిపాసులు మీరేనంటూ ఇరుపక్షాలూ ఆయుధాలు భారీగా పోగుచేసుకుంటున్నాయి. ఆంక్షలు రష్యాను ఆర్థికంగా ఎంతో దెబ్బతీశాయి. పశ్చిమదేశాలనుంచి అందుతున్న ఆయుధాలతో ఉక్రెయిన్‌ యుద్ధక్షేత్రంలో నిలబడుతున్నది కానీ, రష్యాదాడులతో దాని సమస్తవ్యవస్థలూ దెబ్బతిన్నాయి. లక్షలకోట్ల ఆర్థిక, ఆయుధసహాయం చేసిన పాశ్చాత్యదేశాలు ఇకపై దాని పునర్నిర్మాణం పేరిట అనేకరెట్లు ఆర్జిస్తాయి. అపారమైన, అరుదైన ఖనిజ సంపద ఉన్న ఉక్రెయిన్‌ దోపిడీకి అడ్డూఆపూ ఉండదు. రష్యా పక్షాన ప్రత్యక్షంగా రంగప్రవేశం చేసేందుకు చైనా కూడా సిద్ధపడుతున్న తరుణంలో, అణుయుద్ధభయం హెచ్చుతున్న స్థితిలో, ఇప్పటివరకూ ఎవరికీ నిర్దిష్ట విజయాలను చేకూర్చని ఈ యుద్ధానికి, చర్చలతో ముగింపు పలకడం శ్రేయస్కరం.

Updated Date - 2023-02-24T02:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising