ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనవసర రాద్ధాంతం

ABN, First Publish Date - 2023-01-24T03:40:47+05:30

రెండుదశాబ్దాలనాటి గుజరాత్‌ అల్లర్లపై బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీని భారతదేశంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండుదశాబ్దాలనాటి గుజరాత్‌ అల్లర్లపై బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీని భారతదేశంలో ఎవరూ చూడకుండా బ్లాక్‌చేయాలంటూ యూట్యూబ్‌, ట్విట్టర్‌లను కేంద్రం ఆదేశించింది. గుజరాత్‌ అల్లర్ల వెనుక అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని ప్రత్యక్ష హస్తం ఉన్నదని చెబుతున్న ఈ డాక్యుమెంటరీ భారత్‌లో ప్రసారం కాకపోయినప్పటికీ, కొందరు దీని లింకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నందున, సమాచార సాంకేతిక నిబంధనల చట్టంలోని ఎమర్జెన్సీ అధికారాలను కేంద్రం ప్రయోగించి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయినదానిని తొలగించడం, భవిష్యత్తులో కాకుండా చూడటం, ఇతర సామాజికమాధ్యమాల్లో ఎప్పటికప్పుడు లింకులు తొలగించడం వంటివి ఈ ఆదేశాల్లో ఉన్నాయి. మోదీపై బిబిసి డాక్యుమెంటరీని నిషేధించిన భారత్‌ అంటూ అంతర్జాతీయ మీడియా ఇప్పుడు, ఈ డాక్యుమెంటరీలో ఉన్నదేమిటో, అప్పట్లో జరిగిందేమిటో మళ్ళీ చర్చ చేస్తున్నది.

వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులంతా కలిసి ఈ డాక్యుమెంటరీని చూస్తే, భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం, సుప్రీంకోర్టు విశ్వసనీయతను ప్రశ్నించడం, సమాజంలోని భిన్నవర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం ఇత్యాది లక్ష్యాలు, లక్షణాలు అందులో ఉన్నట్టు తేలిందట. ఈ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతను దెబ్బతీసేట్టుగా ఉన్నదని విదేశాంగశాఖ అంటున్నది. ఇంతభారీ పదజాలం అవసరం లేదనీ, మోదీ, ఆయన బృందానికి ఈ డాక్యుమెంటరీద్వారా నిజాలు వెలుగుచూడటం ఇష్టంలేనందున ప్రభుత్వం నిషేధించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తృణమూల్‌ ఎంపీ మొహువా మొయిత్రావంటివారు అందరూ తప్పకచూడండి అంటూ నలుగురికీ లింకు పంచుతున్నారు.

బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పట్లో నియమించిన ఒక కమిటీ సేకరించిన వివరాల ఆధారంగా దీనిని రూపొందించినట్టు బిబిసి చెబుతోంది. కొన్ని కీలక డాక్యుమెంట్లు చూపడం, అందులోని అంశాలు వివరించడంతో పాటు, బ్రిటిష్‌ మాజీ విదేశాంగమంత్రి జాక్‌స్ట్రా అభిప్రాయాలను కూడా జోడించింది. అప్పట్లో బ్రిటన్‌ తెలుసుకున్న విషయాలను, తన అభిప్రాయాలను ఆయన అందులో ప్రస్తావించారు. ‘ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం’ ప్రమాణాలకు అనుగుణంగా, సాధికారికంగా ఇది తయారైందని బిబిసి వాదిస్తోంది. మోదీ అనుకూల వాదనలకు కూడా ఈ డాక్యుమెంటరీలో తగిన ప్రాధాన్యం ఇచ్చింది. మాజీ రాజ్యసభ సభ్యుడు స్వపన్‌ దాస్‌గుప్తా వంటివారు ఎప్పటికప్పుడు కనిపిస్తూ విమర్శలను ఖండిస్తూ తమ అభిప్రాయాలను చెబుతూవచ్చారు. మోదీ ప్రత్యక్ష ప్రమేయం లేదన్న సుప్రీంకోర్టు తీర్పు సహా ఈ దేశంలోని అనేక వ్యవస్థల అభిప్రాయాలకు స్థానం దక్కింది. అయినప్పటికీ, ఈ డాక్యుమెంటరీ దురుద్దేశపూరితమైందని పాలకులు అభిప్రాయపడటంలోనూ తప్పేమీ లేదు. కానీ, దానిపై అతిగా స్పందించడం, మరీముఖ్యంగా నిషేధించడం ద్వారా అనవసరపు ప్రాధాన్యం ఇచ్చినట్టు అయింది. దీనిని చూడవద్దనీ, ప్రదర్శించవద్దనీ యూనివర్సిటీలు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడంతో లేని ఉత్సాహం కలుగుతోంది. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి, రెండుదశాబ్దాల తరువాత కూడా నివ్వెరపరిచే అంశాలు కొత్తగా ఏమీ ఉండకపోవచ్చు. ఇప్పటికే, రెండువైపుల వాదనలు తెలియచేసే లోతైన సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉంది. సుదీర్ఘకాలం కేసులు నడిచినందున తెలియని రహస్యాలంటూ ఏమీ లేవు. ఎవరికి నచ్చింది వారు నమ్ముతున్నారు, నమ్మనివారు తోచిన విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో బ్రిటన్‌లో తయారైన ఓ డాక్యుమెంటరీని పట్టుకొని వల‍సవాద మనస్తత్వం, విదేశీకుట్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల విదేశీ సంబంధాలకు నష్టంచేకూరే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం పక్షాన మూడువందలమంది పెద్దలు దీనిని విభజించి పాలించే బ్రిటిష్‌ ఆలోచనావైఖరికి నిదర్శనంగా వ్యాఖ్యానించడం సరికాదు. శ్వేతజాతి దురహంకారం, వలసవాద భావజాలం వంటిమాటల ప్రయోగం వల్ల బీజేపీ అనుకూల దేశీయ ఓటర్లు సంతృప్తిపడవచ్చునేమో కానీ, మోదీ అంతర్జాతీయ ఖ్యాతికి భంగం వాటిల్లుతుంది. జి–20 అధ్యక్షస్థానంలో ఉంటూ, దేశం విశ్వగురువు కావాలని ఆశిస్తున్నప్పుడు విమర్శలు సహించాలి, ప్రజాస్వామిక విలువలకు కట్టుబడాలి.

Updated Date - 2023-01-24T03:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising