ఊరూరా బహుజన బతుకమ్మ
ABN, First Publish Date - 2023-10-13T01:01:20+05:30
ఒకనాడు తెలంగాణలో మూడు వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయముంటే, ఈనాడు కేవలం టెండర్ల మీదనే దాదాపు మూడువేల కోట్లు రావడం, 40 వేల కోట్లు ప్రభుత్వ ఆదాయంగా సమకూరడం...
ఒకనాడు తెలంగాణలో మూడు వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయముంటే, ఈనాడు కేవలం టెండర్ల మీదనే దాదాపు మూడువేల కోట్లు రావడం, 40 వేల కోట్లు ప్రభుత్వ ఆదాయంగా సమకూరడం ఎవరమైనా ఊహించామా! నీటిపారుదలతో పెరిగిన ఉత్పత్తి సంపదనంతా తాగుడుకు, అనుత్పాదక రంగాలకు తగలేయడం ఏ రకమైన అభివృద్ధికి చిహ్నం. నవ తెలంగాణ నిర్మాణానికి నడుం కట్టాల్సిన యువతరం గంజాయి మత్తుకు, డ్రగ్స్ అలవాట్లకు లోనవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. డిస్టిలరీ కార్మికులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించి, మద్యం ఉత్పత్తులనే నిలువరించాలని ఎన్నికల ముంగిట్లో ఉన్న పాలక పార్టీలను బహుజన బతుకమ్మ నిలదీస్తున్నది. దాంతోపాటు తమ గ్రామాల్లోకి మద్యాన్ని, బెల్టుషాపులను రానివ్వమంటూ ‘మద్యపాన రహిత గ్రామాలు’గా తీర్చిదిద్దుకుందామంటూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సి ఉంది. ఇందుకోసం బహుజన బతుకమ్మ ఎప్పట్నించో పోరాటం చేస్తున్నది. మద్యం వ్యతిరేక పూల కవాతుగా–స్త్రీల కవాతుగా నేటి నుంచి కార్యక్రమాలు జరుగనున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌లో నివాళి, మధ్యాహ్నం రెండు గంటలకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆటా పాటా జరుగుతుంది. అక్టోబర్ 14న బోడుప్పల్‌లో, 15న గోదావరిఖని సెంటినరీ కాలనీలో, 16న రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో, 17న రంగారెడ్డి జిల్లా రావులపల్లిలో, 18న వికారాబాద్ జిల్లా రేగడి మైలారంలో, 19న జనగాం జిల్లా బమ్మెరలో, 20న వేములవాడలో, 21న సూర్యాపేట జిల్లా కేశవాపురంలో, 22న ఖమ్మం జిల్లా ముదిగొండలో కార్యక్రమాలు జరుగుతాయి.
బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ
Updated Date - 2023-10-13T01:01:20+05:30 IST