ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భవిష్యనిధి, బీమా మొత్తాలు ఏమయ్యాయి?

ABN, First Publish Date - 2023-10-05T03:04:52+05:30

రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. వీరిలో సెప్టెంబర్‌ 2004కి ముందు నియామకమైన వారు 1.5 లక్షల మంది. వీరికి పాత పెన్షన్‌ విధానం వర్తిస్తుంది. వీరు సాధారణ భవిష్యనిధి...

రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. వీరిలో సెప్టెంబర్‌ 2004కి ముందు నియామకమైన వారు 1.5 లక్షల మంది. వీరికి పాత పెన్షన్‌ విధానం వర్తిస్తుంది. వీరు సాధారణ భవిష్యనిధి (జిపిఎఫ్‌) అకౌంట్‌ కలిగి ఉంటారు. వీరి నెలసరి వేతనం నుంచి 6శాతం మినహాయించాల్సి ఉంటుంది, కాని ఆదాయపు పన్ను పరిధి నుంచి మినహాయింపు పొందడానికి చాలామంది ఉద్యోగులు 6శాతం కంటే ఎక్కువ మొత్తంలో జమ చేసుకుంటారు.

ఉద్యోగికి అత్యవసరమైనప్పుడు పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు, ఇంటి స్థలం కొనుగోలుకు, గృహ నిర్మాణానికి అప్పుగా గాని, లేదా కొంత మొత్తాన్ని గాని ఉపసంహరించుకొనే అవకాశం ఉంది. లేదా పదవీ విరమణ తరువాత పూర్తి మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఉద్యోగులకు మంజూరయిన అప్పు, లేదా విరమణ మొత్తాలు, ఉద్యోగ విరమణ తరువాత వచ్చే సొమ్ము రాష్ట్ర ఆర్థిక శాఖ (ఈ–కుబేర్‌)కు వస్తుంది. ఆ మొత్తాలు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీనివల్ల వేలాదిమంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిపిఎఫ్‌ ఉద్యోగులందరూ 20 నుంచి 35 సంవత్సరాల సర్వీసు కలిగి ఉంటారు. 1.5 లక్షల మంది జిపిఎఫ్‌ ఉద్యోగుల ఒక్కొక్కరి ఖాతాలో సరాసరిగా 10లక్షల రూపాయలకు పైగానే జమ అయి ఉంటాయి. అంటే 15 వేల కోట్లకు పైగా జిపిఎఫ్‌ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో ప్రత్యేక హెడ్‌ మీద జమ చేయబడతాయి. వీటికి ప్రతి సంవత్సరం వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులను బట్టి వడ్డీ చెల్లించి వారి వారి ఖాతాలకు జమచేయాలి. కాని గత 2, 3 ఏళ్లుగా ప్రభుత్వం వడ్డీ చెల్లించడం లేదు.

2004 సెప్టెంబర్‌ తరువాత నియామకమైన ఉద్యోగులు 1.5 లక్షల మంది ఉన్నారు. వీరికి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) వర్తిస్తుంది. వీరికి పెన్షన్‌ చెల్లించడానికి వారి వేతనం నుంచి 10శాతం మినహాయించి, మరో 10శాతం రాష్ట్ర ప్రభుత్వం కలిపి వారి ఖాతాలో జమ చేస్తుంది. జూనియర్‌, సీనియర్‌ ఉద్యోగుల సరాసరి తీసుకొంటే నెలకు రూ. 4వేల వరకు మినహాయిస్తారు. ప్రభుత్వం కూడా మరో 4 వేలు కలిపి రూ.8వేలు ఉద్యోగి ఖాతాలో జమ చేయాలి. ఈ లెక్కన 1.5 లక్షల మందికి 8 వేల చొప్పున నెలకు రూ.120 కోట్లు, సంవత్సరానికి సుమారుగా రూ.1440 కోట్లు ప్రభుత్వం, ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి. గత సంవత్సర కాలంగా ఇది జరగడం లేదు.

ఓపీఎస్‌, సీపీఎస్‌ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ (టిఎస్‌జిఎల్‌ఐ) మినహాయిస్తారు. ఇది ఉద్యోగుల వేతన శ్లాబులననుసరించి జరుగుతుంది. ఉద్యోగుల ఒక్కొక్కరి ఖాతాల్లో సరాసరిగా రూ.3 లక్షలపైన జమ అయి ఉంటాయి. ఈ జిఎస్‌ఎల్‌ఐ ఖాతా నుంచి కూడా ఉద్యోగి అత్యవసరాలకు అప్పు తీసుకోవచ్చు. కాని గత సంవత్సరకాలంగా లోన్‌ మొత్తాలు, ఉద్యోగ విరమణ పొందిన వారి ఫైనల్‌ చెల్లింపులు ఈ–కుబేర్‌లో నిలిచిపోయాయి. ఈ మూడు లక్షల ఉద్యోగుల జిఎస్‌ఎల్‌ఐ ఖాతాల్లో రూ.3 లక్షల చొప్పున సుమారు 9 వేల కోట్లు నిల్వ ఉంటాయి.


జిపిఎఫ్‌ రూ.15 వేల కోట్లు, సిపిఎస్‌లో జమ చేయాల్సిన రూ. 1500 కోట్లు, జిఎస్‌ఎల్‌ఐ మొత్తం రూ.9 వేల కోట్లు అన్నీ కలిపి సుమారుగా రూ.25 వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన నిధులు ఆయా పద్దుల్లో ఉన్నాయా, లేవా? అనే సందేహం ఉద్యోగులకు కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక అవసరాలను సర్దుబాటు చేసుకోవడానికి ఈ మొత్తాలను వాడుకోవడం వల్లనే ఉద్యోగులకు సకాలంలో చెల్లించలేకపోతున్నది. ఈ నిధులపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.

ఉద్యోగులు పొదుపు చేసుకొన్న డబ్బుల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేక జూలై 2018 నుంచి వర్తింపజేయాల్సిన పీఆర్‌సీని 33 నెలలు ఆలస్యంగా అమలు చేసి, బకాయిలను ఇప్పటివరకు చెల్లించడం లేదు. అలాగే ఆరు నెలలకు ఒకసారి పెరిగే డీఏను ఆలస్యంగా 17 నెలల తరువాత ప్రకటిస్తూ కూడా బకాయిలు దీర్ఘకాలం పాటు విడతల వారీగా చెల్లిస్తున్నారు. మార్చి 2021కి ముందు పదవీ విరమణ చేసిన కొందరికి గ్రాట్యూటీ, కమ్యుటేషన్‌, సరెండర్‌ సెలవుల మొత్తాలను చెల్లించలేదు. రెండేళ్లకు పూర్వం హెల్త్‌కార్డులపై కొన్ని ఆస్పత్రులు చికిత్సలు చేసేవి, ప్రభుత్వం వాటికి తిరిగి చెల్లించనందున అవి చికిత్సలు నిలిపివేసాయి. ఉద్యోగులు తొలుత సొమ్ము చెల్లించి రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకొంటే సంవత్సరం తరువాత బిల్లు మొత్తంలో 40శాతం మించి మంజూరు కావడం లేదు. అది కూడా ఈ–కుబేర్‌లో పెండింగ్‌లో ఉంటున్నాయి. దీనికి కారణం ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీయడమే.

మార్చి 2021 నుంచి ఉద్యోగ విరమణ వయో పరిమితి మూడేళ్లు పెంచడం వల్ల గత మూడేళ్లుగా ఉద్యోగుల పదవీ విరమణలు జరగడం లేదు. మార్చి 2024 నుంచి ఉద్యోగ విరమణలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రతి నెల 2 వేల మందికి పైగా పదవీ విరమణ చేస్తారు. వీరికి పెన్షన్‌ చెల్లింపునకు ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.50లక్షలు, జీపీఎఫ్‌, జిఎస్‌ఎల్‌ఐకి 25 లక్షల చొప్పున నెలకు రూ.1500 కోట్లకు పైగా అవసరమవుతుంది. ఈ చెల్లింపులు చేయలేక ప్రభుత్వం ఓపీఎస్‌ ఉద్యోగులు కూడా సీపీఎస్‌ ఉద్యోగులే అంటే పరిస్థితి ఏమిటి? అందుకే ఉద్యోగులందరూ ఒక్కటై సమస్యల సాధనకు పోరాడాలి. అందుకు ఎన్నికల సమయమే సరైనది. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు, సీపీఎస్‌ రద్దు, సకాలంలో డిఏ చెల్లింపు, హెల్త్‌ స్కీం అమలు వంటి గ్యారంటీలను ఇచ్చేలాగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు రాజకీయ పార్టీలపై ఒత్తిడి చేయాలి.

పులి సరోత్తం రెడ్డి

పిఆర్‌టియు మాజీ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2023-10-05T03:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising