ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇదేం ఇంటెలిజెన్స్?

ABN, First Publish Date - 2023-09-27T01:55:20+05:30

మీ పోలీసులు మరొకసారి, మూడోసారి, ఒక యుఎపిఎ కేసులో నా పేరు ఇరికించిన సందర్భంలో మీకు బహిరంగ లేఖ రాయక తప్పడం లేదు. క్షమించాలి. అక్రమ కేసులు, అబద్ధపు కేసులు...

గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారూ,

మీ పోలీసులు మరొకసారి, మూడోసారి, ఒక యుఎపిఎ కేసులో నా పేరు ఇరికించిన సందర్భంలో మీకు బహిరంగ లేఖ రాయక తప్పడం లేదు. క్షమించాలి. అక్రమ కేసులు, అబద్ధపు కేసులు తయారుచేయడం పాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రోజుల నుంచీ పోలీసులకు అలవాటేనని మీకు కూడ తెలుసు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్ళు గడిచినా మన రాష్ట్ర పోలీసులకు ఆ అలవాటు తప్పిపోయినట్టు లేదు. అలవాట్లు అంత తొందరగా వదిలిపోవు గదా. అయినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడ పోలీసులకు సంపూర్ణమైన, ప్రశ్నాతీతమైన, మితిమీరిన అధికారాలు ఇచ్చిన రాజకీయాధినేతగా మీ దృష్టికి ఈ విషయం తప్పనిసరిగా తేవాలనుకుంటున్నాను.

మొట్టమొదట ఈ కొత్త అబద్ధపు కేసులో మీ పోలీసుల తెలివితక్కువను మీ దృష్టికి తెచ్చి తర్వాత గంభీరమైన విషయాలలోకి వెళతాను. ఏ ప్రభుత్వానికైనా నిర్దిష్టమైన, నిర్దుష్టమైన సమాచారం సేకరించగలిగే పోలీసు ఇంటిలిజెన్స్ శాఖలు ఉండడం అవసరమని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాని మీ పోలీసులకు అటువంటి సమాచారం లేదని ఇటీవలనే మీ దృష్టికి వచ్చిన తాడ్వాయి యుఎపిఎ కేసులో కూడా బైటపడిందని మీకు తెలుసు.

ప్రస్తుత సందర్భంలో కూడా ఎఫ్‍ఐ‍ఆర్‌లో పోలీసులు నా పేరు పక్కన ‘సభ్యుడు’ అని ఒక సంస్థ పేరు రాశారు. ఆ సంస్థ 2009లో నన్ను బహిష్కరించింది. ఈ పద్నాలుగు సంవత్సరాలుగా నేను ఆ సంస్థ సభ్యుడిని కాదు, ఆ సంస్థతో ఎటువంటి సంబంధమూ లేదు. మరి మీ ఇంటిలిజెన్స్ శాఖ నా పేరును ఆ సంస్థ పేరుతో జోడించేంత తెలివిగా, పద్నాలుగేళ్ల కిందటి సమాచారంతో ఉందన్నమాట! ఇటువంటి తెలివితో పనిచేసే ఇంటిలిజెన్స్ శాఖ ఇచ్చే సమాచారం మీద ఆధారపడి పాలన నడిపితే అది ఎక్కడికి చేరుతుందో మీకు చెప్పనక్కరలేదు.

ఆ సంస్థ పేరు విరసం. ఆ సంస్థ సభలకు నేను శ్రోతగా వెళతాను, ఎప్పుడైనా వారు వక్తగా పిలిస్తే వెళతాను, ఆ సంస్థ పత్రికలో రచనలు చేస్తాను. అంత మాత్రాన ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తిగా లెక్కిస్తున్నారంటే మీ ఇంటిలిజెన్స్ శాఖ తెలివితేటల మీద నాకు జాలిగా ఉన్నది. నేను వందలాది సభలకు శ్రోతగా వెళతాను, డజన్ల కొద్దీ సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నన్ను వక్తగా పిలుస్తాయి. అనేక పత్రికలలో రచనలు చేస్తాను. నా పేరు పక్కన అవన్నీ కూడా రాస్తారా? నేనేమిటో కూడా తెలియకుండా నన్ను ఒక సంస్థకు ముడివేసి, తప్పుడు కేసు బనాయించేంత సమాచార లోపం ఉన్న ఇంటిలిజెన్స్, పోలీసు శాఖలు మిమ్మల్ని ఎట్లా తప్పుదారి పట్టిస్తున్నాయో ఊహిస్తేనే నాకు మీమీద జాలిగా ఉన్నది.

సరే, అది ఏదో సాంకేతిక విషయం, పక్కన ఉంచండి.

నేను విరసంలో గాని, మరే సంస్థలో గాని సభ్యుడిని కాదు. కాని నాకు అధ్యయనం వల్ల, అనుభవం వల్ల, ఆచరణ వల్ల ఏర్పడిన కచ్చితమైన, నిర్దిష్టమైన రాజకీయ విశ్వాసాలున్నాయి. సరిగ్గా మీకూ, రాష్ట్రంలో అనేక మందికీ కూడా ఏవో ఒక రాజకీయ విశ్వాసాలు ఉన్నట్టుగానే. నిజానికి తెలంగాణకు జరిగిన అన్యాయం విషయంలో మీ రాజకీయ విశ్వాసాలూ నా రాజకీయ విశ్వాసాలూ ఏకీభవించాయి కూడా. అందువల్లనే తెలంగాణ ఉద్యమ కాలంలో మీరూ నేనూ వేదికలు పంచుకున్నాం. ఇప్పుడు మీ ప్రభుత్వంలో, పార్టీలో ఉన్న అనేక మందితో కూడా నేను వేదికలు పంచుకున్నాను. అప్పుడు నేను రాసిన రచనలూ, నా ఉపన్యాసాలూ, టెలివిజన్ చర్చల్లో నా మాటలూ, నేను సంపాదకుడుగా ఉండిన ‘వీక్షణం’ రాజకీయార్థిక, సామాజిక మాసపత్రికా మీకు నచ్చాయి. 2014 తర్వాత కూడా నా రాజకీయ విశ్వాసాలేమీ మారలేదు. అవే రాజకీయ విశ్వాసాలతో ఉన్నాను. అవే రచనలూ ఉపన్యాసాలూ పనులూ చేస్తున్నాను. అదే పత్రిక నడుపుతున్నాను. కాని ఇప్పుడు ఇవన్నీ మీ పోలీసుల దృష్టిలో నేరాలుగా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టం కిందా, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం కిందా ఆరోపించదగిన నేరాలుగా ఎలా మారిపోయాయో మీకే తెలియాలి.


అసలు భారత నేర శిక్షా స్మృతి ప్రకారం ఆస్తి నష్టానికో, ప్రాణ నష్టానికో, శరీర గాయానికో దారితీసే పని, చర్య, ఘటన నేరం అవుతుంది గాని, మాట, రాత, భావ ప్రకటన, సంపాదకత్వం నేరం ఎలా అవుతాయి? మీ పోలీసులు 2019లో కూడ నా పేరు ఇట్లాగే ఒక యుఎపిఎ కేసులో ఎఫ్ఐఆర్‌లో ఇరికించారు. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులనుంచీ, పౌర సమాజం నుంచీ నిరసన చెలరేగింది. నేను ఆ కేసును క్వాష్ చేయమని హైకోర్టులో అభ్యర్థన దాఖలు చేశాను. ఆ తర్వాత కొన్ని నెలలకు మరొక కేసులో ఒక నిందితుడి ఒప్పుకోలు ప్రకటన (కన్ఫెషన్ స్టేట్‌మెంట్)లో మీ పోలీ సులు నా పేరు చేర్చారు. ఈ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ అనేదాన్ని పోలీసులు ఎట్లా అబద్ధాలతో, ఊహలతో, అపోహలతో వండి వారుస్తారో ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీకు తెలిసే ఉంటుంది. పోలీసుల ఈ అబద్ధ రచన గురించి తెలిసినందువల్లనే చివరికి న్యాయవ్యవస్థ కూడా పోలీసులు రాసే కన్ఫెషన్ స్టేట్‌మెంట్లు నమ్మదగినవి కాదనే వైఖరి తీసుకుంటున్నది.

ఇప్పుడు, సెప్టెంబర్ 15న సైబరాబాద్ జిల్లా కెపిహెచ్‌బీ కాలనీ పోలీసు స్టేషనులో నమోదైన యుఎపిఎ, టిపిఎస్ఎ కేసులో ఎఫ్ఐఆర్‌లో నా పేరు చేర్చారు. ఎవరినో ఎక్కడో అరెస్టు చేశామని, ఆయన చెప్పినదాని ఆధారంగా ఇరవై మూడు మంది పేర్లు రాశామని చెపుతున్నారు. నిజానికి ఆ ఎఫ్ఐఆర్‌కు జత చేసిన ఒప్పుకోలు ప్రకటన (అరెస్టు అయిన వ్యక్తి చెప్పాడని ఇద్దరు పంచులు రాసిన ప్రకటన) అంటూ పోలీసులు రాసినదానిలో ఆ వ్యక్తి మాటల్లో నా పేరు లేదు. పోలీసులు చేర్చిన పేర్లలో ఉంది. ఆ వ్యక్తి పేరు నేను వినడం ఇదే మొదటిసారి. ఆయన ఎవరో తెలియదు. కాని పోలీసులు నాకు ఆయనతోనూ, మరెంతో మంది నాకు తెలియనివారితోనూ సంబంధం అంటగట్టి, నా మెడ మీద మరొక కత్తి వేలాడదీశారు. ఈ అబద్ధపు కేసు న్యాయ విచారణలో ఎట్లాగూ నిలవదు. కాని ఈ లోగా నా రాత మీద, మాట మీద, భావ ప్రకటన మీద ఒక అవరోధంగా, నా మీద బెదిరింపుగా మీకూ మీ పోలీసులకూ ఇది ఉపయోగపడుతుంది.

ఒక పత్రికా రచయితగా, వక్తగా, సంపాదకుడిగా, ప్రజాపక్ష ఆలోచనాపరుడిగా మీ ప్రభుత్వ విధానాల మీద, కేంద్ర ప్రభుత్వ విధానాల మీద విమర్శ చేస్తున్నందువల్లనే నా భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడానికి మీ ప్రభుత్వమే ఇలా పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్నదని నేను అనుమానిస్తున్నాను. నేను చేసిన చర్య ఏదైనా చూపి ఎట్లా చట్టవ్యతిరేకమయినదో సాక్ష్యాధారాలతో కేసులు పెట్టండి. కాని మాటనూ, రాతనూ, భావప్రకటననూ, పత్రికా సంపాదకత్వాన్నీ నేరంగా పరిగణించి, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలననూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలననూ కొనసాగిస్తున్నామనీ, ఇంకా రెండాకులు ఎక్కువే చదివి మరిపిస్తున్నామనీ చూపుకోవడానికి ప్రయత్నించకండి.

ఎన్. వేణుగోపాల్

Updated Date - 2023-09-27T01:55:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising