ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంచార జాతులకు సామాజిక గౌరవం ఎప్పుడు?

ABN, First Publish Date - 2023-08-31T04:09:08+05:30

బ్రిటిష్ ప్రభుత్వం 1871 సంవత్సరంలో దేశంలో కొన్ని కులాలను క్రిమినల్ ట్రైబ్స్‌గా వర్గీకరిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం సంచారజాతి కులాల వారిని నేరస్థులుగా...

బ్రిటిష్ ప్రభుత్వం 1871 సంవత్సరంలో దేశంలో కొన్ని కులాలను క్రిమినల్ ట్రైబ్స్‌గా వర్గీకరిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం సంచారజాతి కులాల వారిని నేరస్థులుగా గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచేది, వారి జీవనోపాధిపై నియంత్రణ విధించి కఠినంగా శిక్షించేది. 1952లో ఈ చట్టం రద్దయి, ఆ జాతులు విముక్త జాతులుగా ప్రకటింపబడినప్పటికీ దాని వారసత్వం సంచారజాతుల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాలపై ప్రభావాన్ని చూపుతూనే ఉన్నది. రాజ్యాంగంలో దళితుల, ఆదివాసీల, మహిళల హక్కుల గురించి మాట్లాడిన రాజ్యాంగ నిర్మాతలు సంచారజాతుల గురించి ప్రస్తావించలేదు. కానీ నిజానికి ఆయా వర్గాల కంటే కూడా దుర్భరమైన జీవితాలను సంచార జాతులవారు నేటికీ గడుపుతున్నారు.

1952లో సంచార జాతులను విముక్త జాతులుగా ప్రకటించిన తర్వాత వీరిని ఎస్టీలుగా గుర్తిస్తూ కుల సర్టిఫికెట్స్ ఇచ్చి ప్రత్యేకమైన హాస్టళ్ళను, స్కాలర్షిప్పులను ఏర్పాటు చేసి విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహించారు. అయితే, తమ బడ్జెట్‌ను సంచారజాతులకు కేటాయిస్తున్నారని ఎస్టీలు వ్యతిరేకించడంతో దీన్ని ఆపివేశారు. 1965లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల పరిరక్షణ కోసం బి.ఎన్. లోకూర్ కమిటీ వేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో కలపడం వల్ల వారికి తగిన స్థాయిలో సంక్షేమ పథకాలు అందటం లేదని కమిటీ భావించింది. వీరిని ప్రత్యేక తరగతిగా పరిగణించి రిజర్వేషన్లను కల్పించాలని సూచన చేసింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైన కమిషన్లను వేసుకొని సమస్య పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో అనంతరామన్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ చేసిన సూచనల మేరకు గతంలో ఉన్న కుల సర్టిఫికెట్లను రద్దు చేసి ఈ సంచారజాతులను బీసీల్లో ఏబీసీడీలుగా వర్గీకరించి వీరిని బీసీ–ఏలో చేర్చారు.

1980లో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బీపీ మండల్ కమిషన్ సిఫారసుల మేరకు 1993 నుంచి ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చినప్పటికీ, స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్ లభించినప్పటికీ సంచార జాతులు అభివృద్ధికి నోచుకోలేకపోయారు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం 72 సంవత్సరాల క్రితం రద్దు చేయబడినప్పటికి వీరు ఇంకా ‘అలవాటు నేరస్థులుగా’ పరిగణించబడుతున్నారు. భారత ప్రభుత్వాలు వీరి స్థితిగతులపై చాలా కమిటీలు, కమిషన్లను వేసినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించటం లేదు.

తెలంగాణలో ఉన్న సంచార జాతుల్లో ఎక్కువ బీసీ కులాల వారే. ఎస్సీ, ఎస్టీ కులాలు కూడా ఉన్నప్పటికీ తక్కువే. బీసీ (ఏ)లో ఉన్న 53 కులాలలో అన్ని అర్ధ సంచారజాతులే. వీరికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు కూడా అందటం లేదు. వీరంతా ప్రధాన స్రవంతి సమాజానికి దూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని సంచార కులాలకు గ్రామ స్థాయిలో కనీస గౌరవం ఉండదు. వీరు అనునిత్యం పౌరసమాజం చేత, పోలీసుల చేత మానవ హక్కుల ఉల్లంఘనలకు, వేధింపులకు గురి అవుతున్నారు. అంతేకాదు సంచార జాతుల కులాల పేర్లను బూతు అర్థంలో పిలిచే సంస్కృతి ఇప్పటికీ వారిని వెంటాడుతూనే ఉన్నది.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సుపరిపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 2019 సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఈ సర్వే ప్రధానంగా కులాల మధ్య విభజన రేఖను గీసి రాజకీయంగా లబ్ధిపొందాలనే లక్ష్యంతో జరిగింది కాబట్టి, అందులో భాగంగానే సంచార జాతుల సంక్షేమాన్ని విస్మరించి బీసీలో ఉన్న ప్రధాన కులాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎంబీసీ సంచార జాతుల అభివృద్ధికి ఇది ఎంతమాత్రం దోహదపడలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల వారికి లక్ష రూపాయల పథకాన్ని తీసుకువచ్చింది. దానికి చాలా కులాలవారు అప్లై చేసుకున్నప్పటికి సంచార జాతుల్లో ఇరవైకి పైగా కులాలు ఈ పథకానికి అప్లై చేసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే వీరంతా ఇంకా నోటిఫై చేయబడకుండా సంచరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వీరిని గుర్తించటానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయటం లేదనీ స్పష్టం అవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో సంచార జాతుల వారికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. టిక్కెట్లు ఇవ్వడంలో కుటుంబానికి, అగ్రకులాలకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యతను చూస్తే రాష్ట్రంలో ఎలాంటి ఆధిపత్య పాలన కొనసాగుతున్నదో అర్థమవుతుంది. తెలంగాణను కొన్ని ప్రజాస్వామిక విలువలతో నడపాలనుకున్న మేధావుల, ప్రజల కోరికలను ఆయన తుంగలో తొక్కారు.

సంచార జాతులది చాలా సున్నితమైన సమస్య. వీరిని రాజ్యాంగబద్ధంగా ప్రత్యేకమైన గ్రూపుగా ప్రకటించాలి. 10శాతం ఉన్న జనాభాకి విద్య, ఉద్యోగాలలో హక్కులను కేటాయించాలి. పంచాయతీ వ్యవస్థలో బీసీలకు, ఎస్సీలకు ఉన్నట్టుగా వీరికీ ప్రాతినిధ్యం కల్పించాలి. ఎస్సీ ఎస్టీ తరహాలో అట్రాసిటీ యాక్ట్ వంటివి అమలుచేయాలి. ఇలాంటి ఎన్నో డిమాండ్లతో సంచార జాతులు సంఘాలుగా ఏర్పడి దశాబ్ద కాలంగా ఉద్యమిస్తున్నా ఫలితం లేకపోతున్నది. వీరి ఉద్యమంలో ప్రజాతంత్రవాదులు చేరి, సంచార జాతులను ఆధునిక వ్యవస్థలో భాగస్వాములను చేసే దిశగా ప్రయత్నం సలపాలి.

సునీల్ నీరడి

ఉస్మానియా విశ్వవిద్యాలయం

(ఆగస్టు 31 సంచారజాతుల దినోత్సవం)

Updated Date - 2023-08-31T04:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising