ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీపీఎస్ రద్దు ఎప్పుడు?

ABN, First Publish Date - 2023-08-31T04:06:51+05:30

ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలు చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అమలు చేస్తే ఉద్యోగ విరమణ తర్వాత ఆసరా పెన్షన్ కన్నా...

ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలు చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అమలు చేస్తే ఉద్యోగ విరమణ తర్వాత ఆసరా పెన్షన్ కన్నా తక్కువ పెన్షన్ వస్తుందా? ఇదెక్కడి న్యాయం? వయస్సు మళ్ళాక వచ్చే ఆరోగ్య సమస్యలకు, పెరుగుతున్న నిత్యావసర ధరలకు ఏ మాత్రం సరిపోని ఈ నూతన పెన్షన్ స్కీమును ఎందుకు రద్దు చేయరని తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము) ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీపీఎస్ రద్దు చేస్తారని ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం దశాబ్దం గడిచినా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకపోవడం, ఓపీఎస్‍ (ఓల్డ్ పెన్షన్ స్కీం)ను పునరుద్ధరించకపోవడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తెలంగాణ ప్రజలే కదా. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. మరి ఉద్యోగుల సంక్షేమం కోసం ఓపీఎస్ ఎందుకు అమలు చేయరూ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీపీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకుంటూ 23 ఆగస్టు 2014న జీఓను జారీ చేసింది. దాంతో 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సీపీఎస్ పరిధిలోకి వచ్చినట్లు అయింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత లేకుండా చేసిన ఈ సీపీఎస్ అమలు తేదీని పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పాటిస్తున్నారు.

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు దాదాపు రెండు లక్షలమంది ఉద్యోగులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలో పని చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలో పనిచేయడం వల్ల రిటైర్మెంట్ సమయంలో వచ్చే 50శాతం పెన్షన్, కుటుంబ సభ్యులకు 30శాతం పెన్షన్, కనీసం 16 లక్షల గ్రాట్యుటి, కమ్యూటేషన్ వంటి సౌకర్యాలను కోల్పోతున్నారు. ఒక సీపీఎస్ ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే వారికి వచ్చే పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక భద్రత లేక వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి కుటుంబాలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.


నూతన పెన్షన్ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేయడం ప్రారంభించాయి. గల్లీలో ప్రారంభమైన ఉద్యమాలు ఢిల్లీ వరకు చేరాయి. గతంలో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‍టి‍ఎఫ్‍ఐ) ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దును కోరుతూ ఛలో పార్లమెంట్‌ను ఉద్యోగ ఉపాధ్యాయులు నిర్వహించారు. సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ అనేక కార్యక్రమాల ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం నిరసనలు తెలియజేస్తున్నారు.

సీపీఎస్‌ని రద్దు చేసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‍ఆర్‍డిఏ) చట్టం ప్రకారం వీలు కల్పిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వారి ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కోసం సీపీఎస్ ని రద్దు చేయాలనుకుంటే చేసుకునే స్వేచ్ఛ ఉంది. భారతదేశంలోని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల మిగతా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునేందుకు తమ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ని రద్దు చేస్తామని ఓపిఎస్‌ని పునరుద్ధరిస్తామని ప్రకటించే అవకాశం ఉంది. ఎన్జీవోలు, టీఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందని, ఎన్నికలకు ముందు ఖచ్చితంగా సీపీఎస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని నమ్మకంతో ఉన్నారు.

పాకాల శంకర్ గౌడ్

(సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం)

Updated Date - 2023-08-31T04:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising