ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లతో ఎవరికి మేలు?

ABN, First Publish Date - 2023-01-13T00:55:01+05:30

ఎలక్ట్రిసిటీ (ఎమెండ్‌మెంట్‌) బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. విద్యుత్‌ రంగాన్ని నియంత్రించే లక్ష్యంతో ఈ బిల్లు రూపొందించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలక్ట్రిసిటీ (ఎమెండ్‌మెంట్‌) బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. విద్యుత్‌ రంగాన్ని నియంత్రించే లక్ష్యంతో ఈ బిల్లు రూపొందించారు. వ్యవసాయానికి ఉచితంగా, బలహీనవర్గాల పేదవారికి, కుటీర పరిశ్రమలకు కొంత తక్కువ టారిఫ్‌తో విద్యుత్‌ సరఫరా చేయబడుతున్న ప్రస్తుత పరిస్థితులలో వాటిని క్రమేపీ తగ్గిస్తూ, అంతిమంగా మూడు సంవత్సరాలలో రద్దు చేయడం, విద్యుత్‌ కనెక్షన్లన్నింటికీ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించడం, డిస్కంలను ప్రైవేట్‌ సంస్థలకు అమ్మివేయడం మొదలైన అంశాలను ఇందులో పొందుపరచారు.

మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లును ఉపసంహరించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా దాదాపు సంవత్సరం పైగా శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగించింది. చివరకు ప్రధానమంత్రి దిగివచ్చి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని, రైతులను సంప్రదించకుండా ఎలక్ట్రిసిటీ ఎమెండ్‌మెంట్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టమని స్పష్టంగా, లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ హామీని విస్మరించి రైతు సంఘాలు, వినియోగదారుల సంఘాలతో చర్చించకుండానే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినందున, బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు నివేదించారు.

మన రాజ్యాంగంలో విద్యుత్‌ అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటికీ అధికారం ఉంది. ఇప్పటివరకు విద్యుత్‌ అంశంపై ఉన్న రాష్ట్రాల హక్కులను చాలావరకు తొలగించి, కేంద్రప్రభుత్వ ఏజెన్సీలకు ఆ అధికారాలను కట్టబెట్టింది. మన రాజ్యాంగం లోని మౌలిక సూత్రాలలో ఒకటైన ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కల్గించింది. మల్టీ స్టేట్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యురేటరీ కమిషన్ల నుంచి తప్పించి, కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు అప్పగించింది. కానీ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను నిర్వహించి మెయిన్‌టెయిన్‌ చేయవలసిన భారం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉండిపోతుంది.

ఒకే ప్రాంతంలో ఒకటికి మించిన డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సీలు ఉన్నప్పుడు ఎక్కువ టారిఫ్‌తో, ఎక్కువ ఆదాయాన్నిచ్చే వినియోగదారుల వైపు ప్రైవేట్‌ లైసెన్సీలు మొగ్గుచూపుతూ, తక్కువ టారిఫ్‌, తక్కువ ఆదాయం వచ్చే బలహీనవర్గాల కాలనీలు, మురికివాడల లోని కనెక్షన్లు, వ్యవసాయ కనెక్షన్ల పట్ల నిర్లక్ష్యం చూపే అవకాశం ఉంది. ఒప్పందం ప్రకారం డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సీ నుంచి జనరేటింగ్‌ కంపెనీకి కట్టవలసిన మొత్తాన్ని కట్టే వరకు ప్రాంతీయ, రాష్ట్ర డిస్పాచ్‌ సెంటర్లు విద్యుత్‌ సరఫరాను ఆపివేయాల్సిందే. అదే సమయంలో ఆ ప్రాంతంలో లేదా రాష్ట్రంలో గ్రిడ్‌ నిర్వహణకు సంబంధించిన ప్రమాణాలను అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్ర సంస్థల పైనే ఉండి, కొన్ని ఇబ్బందులు సంభవించే అవకాశం ఉంటుంది. దాంతో వినియోగదారులు ఇబ్బందికి గురవుతారు. పునరుత్పాదక విద్యుత్తును కొంతశాతం మేరకు విధిగా కొనుగోలు చేయవలసిన నిబంధన అమల్లో లోపం జరిగితే అధిక పెనాల్టీ విధిస్తారు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలకు ఈ అంశం బాగా ఉపయోగపడుతుంది.

వ్యవసాయం, కుటీర పరిశ్రమలు బలహీనవర్గాలకు ఇప్పటివరకు క్రాస్‌ సబ్సిడీ విధానం వల్ల చాలా తక్కువ టారిఫ్‌తో విద్యుత్తు అందుతున్నది. ఈ క్రాస్‌ సబ్సిడీలను క్రమేపీ తగ్గించాలని బిల్లులో స్పష్టంగా ఉంది. విద్యుత్తు ఉత్పత్తి, రవాణా, పంపిణీలకు అయ్యే వ్యయం కవర్‌ అయ్యేలా టారిఫ్‌ను నిర్ణయించాలని, లైసెన్సీల ఆర్థిక సుస్థిరతకు, వారు పెట్టే పెట్టుబడులపై తగు ఆదాయం వస్తూ ఉండాలని కూడా ఉంది.

మన రాజ్యాంగం ప్రకారం భారతదేశం సంక్షేమ రాజ్యం. అందువల్లనే సమాజం లోని నిరుపేద, బలహీనవర్గాలకు, కుటీర పరిశ్రమలకు, అత్యధిక సంఖ్యలో ఉన్న సన్నకారు, చిన్న రైతులు ఉన్న వ్యవసాయ రంగానికి అందుబాటులో విద్యుత్‌ సౌకర్యం అందించాలంటే క్రాస్‌ సబ్సిడీ విధానం అమలుచేయక తప్పదని, ఇప్పటివరకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తూ వచ్చాయి. అంతేకాక మారుమూల ఉన్న లక్షలాది గ్రామాలకు, కోట్లాది ప్రజలకు విద్యుచ్ఛక్తిని అందచేసే ప్రక్రియను వ్యాపారాత్మకంగా పెట్టుబడి పెట్టి ఖచ్చితంగా లాభాలార్జించే రంగంగా కాక సేవారంగగా భావించాల్సి ఉంటుందనే దృక్పథంతోనే స్వాతంత్య్రానంతరం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పత్తి, విద్యుత్‌ జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కొరకు సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవస్థలను లక్షలకోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దృక్పథంతోకాక, పూర్తిగా వ్యాపార దృక్పథంతో నిర్ణయాలు తీసుకొంటోంది. డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవస్థలను కారుచౌకగా ప్రైవేట్‌ సంస్థలకు అమ్మేందుకు ‘మానిటైజేషన్‌’ విధానాన్ని పార్లమెంటులో ప్రకటించి ఎయిర్‌పోర్టులు, సీపోర్టులతో సహా అనేక పబ్లిక్‌ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మివేస్తోంది. కొన్ని సందర్భాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి), సిబిఐలతో కొన్ని సంస్థలపై దాడులు నిర్వహించి, యాజమాన్యాలను భయపెట్టి గౌతమ్‌ అదానీ సంస్థలకు అమ్మే పరిస్థితులు కల్పిస్తోంది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు!

సందట్లో సడేమియా అన్న చందాన కేంద్రంలో బిల్లు ఆమోదం పొందకమునుపే అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీఓ 22, జీఓ 68లను జారీచేసి శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ ఎలక్ట్రిసిటీ మీటర్లను బిగించడం ప్రారంభించింది. రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసినా లెక్కచేయకుండా ముందుకు సాగుతోంది. కొన్ని రాష్ట్రాలలో బిగించబడుతున్న స్మార్ట్‌మీటర్ల ధరల కన్నా అధిక ధరలకు కొనుగోలు చేయడానికేకాక, వాటిని బిగించి నిర్వహించేందుకు చాలా అధిక మొత్తాలను చెల్లించేందుకు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూనుకోవడం ద్వారా వందలాది కోట్ల రూపాయల అవినీతికి తెరతీసింది.

వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు నానాటికీ పెరిగిపోతూ, పండించిన పంటలకు సరైన ధరలు రాక, దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులను గమనించే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మీటర్లు పెట్టినా రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని జగన్‌ ఇస్తున్న హామీని రైతులు ఎంతమాత్రమూ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యోగులకు నెలవారీ జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలోనే వైఫల్యం చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల వ్యయం కూడా రైతులు, పేదవర్గాల పైనే వేయబోతున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. భారతదేశం మొత్తంమీద వివిధ రంగాలలోని విద్యుత్‌ కనెక్షన్లకు ఉన్న విద్యుత్‌ మీటర్లను తొలగించి, 25 కోట్లు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ ఎలక్ట్రిసిటీ మీటర్లను రూ.1.5 లక్షల కోట్లు రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీ వ్యవస్థను మరికొంత మెరుగుపరిచేందుకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు, మొత్తంగా మూడు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ‘రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూటరీ సెక్టార్‌ స్కీమ్‌’ను కేంద్రం అమలు చేస్తోంది. ఆ తరువాత డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ప్రక్రియ చేపట్టనుంది. విద్యుత్‌ తయారీ కంపెనీలకు నెలవారీగా ముందుగానే వారికి రావలసిన మొత్తం జమయ్యే వెసులుబాటు లభిస్తుంది. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల తయారీ సంస్థలకు లాభాలు చేకూరుతాయి. కానీ రైతులు, ఇతర వినియోగదారులకు ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ పథకం కింద కేంద్రం ఖర్చుచేసే నిధులను వివిధ రాష్ట్రాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మీడియం, మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఇస్తే దేశానికి మహోపకారం చేకూరుతుంది.

వడ్డే శోభనాద్రీశ్వరరావు

Updated Date - 2023-01-13T00:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising