ఈ ‘ఏక ఎన్నిక’ ఎవరికోసం?
ABN, First Publish Date - 2023-09-08T01:04:45+05:30
పాతఆలోచనలు కొత్త ప్రభాతాలుగా పరిణమిస్తాయా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘటనాఘటన సమర్థుడు. సార్వత్రక ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో ప్రతిపక్షాలు సంఘటితమవడం...
పాతఆలోచనలు కొత్త ప్రభాతాలుగా పరిణమిస్తాయా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘటనాఘటన సమర్థుడు. సార్వత్రక ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో ప్రతిపక్షాలు సంఘటితమవడం, భద్ర భవిష్యత్తుకు కొత్తదారిని అన్వేషించేలా ఆయనను పురిగొల్పింది. ఫలితమే ‘ఒకే దేశం, ఒకేసారి ఎన్నికల నిర్వహణ’ ప్రతిపాదన. వెంటాడుతోన్న అదానీ వివాదంలో కొత్త వాస్తవాలు బహిర్గతమైన రోజున, న్యూఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే ఆలోచనను చైనా అధ్యక్షుడు జిన్‌సింగ్ విరమించుకున్న వేళ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ముంబైలో సమావేశమవుతున్న సందర్భాన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ప్రకటించడమూ, వెన్వెంటనే సకల చట్ట సభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడమూ వార్తా జగత్తులో సర్వమూ తానేగా ఉండడంలో నరేంద్ర మోదీ అసాధారణ నేర్పును సూచించడంలేదూ? అవును, ఆయన ఘటనాఘటన సమర్థుడు.
పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమనేది నిజానికి ఒక పాత ఆలోచన. భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఐదేళ్ల క్రితం ‘జాతీయ ప్రయోజనాలను’ దృష్టిలో ఉంచుకుని ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను పరిశీలించాలని ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 2018 ఆగస్టులో భారత న్యాయసంఘం (లా కమిషన్)కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఒకేసారి ఎన్నికలను రెండు దశలలో నిర్వహించాలని 2015లో పార్లమెంటరీ స్థాయీ సంఘం ఒకటి సిఫారసు చేసింది. ఏక కాలంలో ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనను 2018లో నీతీఆయోగ్ చర్చా పత్రం ఒకటి సంపూర్ణంగా సమర్థించింది. అయితే బీజేపీ యేతర పార్టీలు సమర్థించకపోవడంతో ఆ ప్రతిపాదన ఒక ఆలోచనగానే మిగిలిపోయింది. 2018లో కంటే 2023లో భిన్న పరిస్థితులు ఉన్నాయా? పాత ఎజెండాను సరికొత్తగా ప్రతిపాదించడం మాత్రమేనా ప్రధాని సంకల్పించిన జమిలి ఎన్నికల నిర్వహణ?
సకల చట్ట సభలకు ఏక కాలంలో ఎన్నికల నిర్వహణ ఆలోచనను మోదీ సర్కార్ తలకెత్తుకోవడం వెనుక నాలుగు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సదా పతాక శీర్షికలలో ఉంటూ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్న మోదీ ఆరాటం ఆ కారణాలలో మొట్టమొదటిది. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో లేదా వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించవలసి రావడంలో ఉన్న అమిత వ్యయ భారం, పాలనకు అవరోధాలు అన్నీ ఇన్నీ కావన్న విషయమై సమాజాన్ని ప్రభావితం చేయగల మధ్యతరగతి ప్రజలలో ఒక నిర్మాణాత్మక బహిరంగ చర్చను ప్రేరేపించడం రెండో కారణం. ప్రధాని మోదీ ఇప్పటికే ‘ఉచితాల’ సంస్కృతిపై ఇటువంటి బహిరంగ చర్చను ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికలలో స్వప్రయోజనాలకోసం పార్టీలు, అభ్యర్థులు పోటా పోటీగా ఓటర్లకు ‘ఉచితాల’పై అభయమివ్వడం ఆర్థిక క్రమశిక్షణకు పూర్తిగా విరుద్ధమని ప్రధానమంత్రి హెచ్చరించారు. ప్రతిపక్షాల ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఆర్థిక క్రమశిక్షణకు తిలోదకాలు వదులుతున్నాయని ప్రధాని మోదీ ఒక పక్క విమర్శిస్తుండగా మరో పక్క ఆయన పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలే విచక్షణారహితంగా ఓటర్లను నానా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. గత కొద్ది నెలలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తుండడమే అందుకొక ఉదాహరణగా చెప్పితీరాలి.
సమర్థ పాలననందించగల నాయకుడు నరేంద్ర మోదీ ఒక్కరే అన్న అంశానికి ఎనలేని ప్రాధాన్యమివ్వడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న బీజేపీ ఆరాటం మరొక కారణం. ఒక దశాబ్ద కాలంగా జాతీయ అధికార పార్టీ ప్రతీ ఎన్నికను ఒక నాయకత్వ పోటీగా ప్రజల ముందుకు తీసుకెళుతోంది. ‘మోదీకి దీటైన ప్రత్యర్థి ఎవరు?’ అని ప్రశ్నిస్తూ ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. సార్వత్రక ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, చివరకు స్థానిక మునిసిపల్ ఎన్నికలైనా ప్రధానమంత్రి పేరిట ఓట్లను అడగడం బీజేపీకి పరిపాటి అయిపోయింది. మోదీ ప్రజాకర్షణ శక్తిని ఒక రాజకీయ ‘బ్రహ్మాస్త్రం’గా బీజేపీ ఉపయోగించుకొంటోంది. అయితే మోదీ ఆకర్షణ శక్తికి పరిమితులు ఉన్నాయని ఇటీవలి శాసనసభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు అపజయం పాలయ్యాయి. ‘డబుల్ ఇంజిన్’ కథనాలను ఓటర్లు విశ్వసించలేదు. కమలానికి ఓటు వేయడం తన నాయకత్వంలో విశ్వాసాన్ని పునరుద్ఘాటించడమేనని ఆ రెండు రాష్ట్రాలలోనూ ప్రధాని మోదీ మరీ మరీ ప్రచారం చేశారు ఆయన మాటలకు మన్నన లభించలేదు. బీజేపీని తిరస్కరించడమేకాదు, కాంగ్రెస్ పార్టీకే ఆ రెండు రాష్ట్రాల ఓటర్లు పట్టం కట్టారు. ఈ అపజయాలు మోదీ పార్టీకి పెనుఘాతాలే అనడంలో సందేహం లేదు.
నిజానికి 2019 సార్వత్రక ఎన్నికలలో మోదీ నాయకత్వానికి మద్దతుగా బీజేపీకి ఓటు వేసిన ఓటర్లు, ఆ తరువాత వివిధ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆ జాతీయ పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత, ఇతర స్థానిక అంశాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. ఈ వాస్తవం దృష్ట్యానే పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి మోదీ సర్కార్ వచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు. గతంలో మాదిరిగా సార్వత్రక, శాసనసభ ఎన్నికలను యథాప్రకారం నిర్వహిస్తే మోదీ ప్రజాకర్షణ అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోలేమని బీజేపీ భావిస్తోంది. 1999– 2014 సంవత్సరాల మధ్య వివిధ ఎన్నికల గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించినప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీని 77 శాతం నియోజకవర్గాలలో ఎన్నుకున్నారు. ఆరు నెలల వ్యవధితో ఎన్నికలు నిర్వహించినప్పుడు కేవలం 61 శాతం నియోజకవర్గాలలో ఒకే పార్టీని ఎన్నుకోవడం జరిగింది.
దేశ పాలనా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ ప్రాబల్యాన్ని మరింతగా పెంపొందించాలన్న ఆకాంక్ష ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు నాలుగో కారణంగా చెప్పవచ్చు. ఇది చాలా మందిని అమితంగా కలవరపరుస్తోంది. అసలు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చే లక్ష్యమేదో ఈ ప్రతిపాదన వెనుక ఉందనే భయాందోళనలు బాగా వ్యక్తమవుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య రాజ్యాంగ బద్ధమైన సంబంధాల కార్యచట్రాన్ని మార్చివేసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ప్రధానమంత్రి కాక ముందు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ ‘సహకార సమాఖ్య వాదం’ గురించి పదేపదే మాట్లాడుతుంటారు. అయితే ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది ఒక వాస్తవం. నోట్ల రద్దు, కొత్త సాగు చట్టాల, వస్తు సేవల పన్ను నష్ట పరిహారాల వివాదాలు, జాతీయ విద్యా విధానం, కొవిడ్ లాక్‌డౌన్, జాతీయ భాషగా హిందీకి ప్రాధాన్యమివ్వడం ఇత్యాది అంశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించడానికి బదులుగా తన నిర్ణయాన్ని రాష్ట్రాలు ఆమోదించేలా చేసేందుకే మోదీ సర్కార్ ప్రయత్నించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాబల్యాన్ని పెంపొందించడానికి ఏకపక్షంగా ప్రయత్నించడం నిజమైన సంస్కరణలకు పెద్ద అవరోధమవుతోంది. కొత్త సాగుచట్టాలను అంతిమంగా ఉపసంహరించుకోవల్సిరావడమే అందుకొక నిదర్శనం.
మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో బీజేపీయేతర, ఎన్డీఏ యేతర ప్రభుత్వాలు ఉన్నాయి. మన పరిపాలనా పద్ధతుల్లో వైవిధ్యాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఒకే దేశం, ఒకే నాయకుడు అన్న నిరంతర ఘోష ఆ అద్వితీయ వాస్తవాన్ని అస్పష్టం చేస్తోంది. అర్థరహితంగా కూడా చేస్తుందేమో? ఈ రాష్ట్ర ప్రభుత్వాలలో అనేకం ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలో ఉన్నాయి. మరి వాటికి, జాతీయ పార్టీలకు ఉన్నట్టుగా తరచు ఎన్నికల బెడదను ఎదుర్కోవాల్సిన అగత్యం లేదు. కనుకనే ‘ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు’ అన్న మోదీ సర్కార్ సంకల్పాన్ని పలు ప్రతిపక్షాలు సహజంగానే సందేహిస్తున్నాయి. భీతి చెందుతున్నాయి. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
విపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? శాసనసభలను రద్దుచేసి, తదుపరి రాజకీయ కార్యాచరణ కాల క్రమాన్ని తమకు అనుకూలంగా ఉండేలా చేసుకోవడమనేది రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కు. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ ప్రతిపాదన అమలులోకి వస్తే, ఆ హక్కు ఒక్కసారిగా హరించుకుపోతుందని ప్రతిపక్షాలు, అవి నడుపుతున్న ప్రభుత్వాలు కలతచెందున్నాయి. ఇక ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన శాసన నిర్మాణ ప్రక్రియను తమను సంప్రదించకుండానే ప్రారంభించి, ముగిస్తారనే శంక విపక్షాలను ఆగ్రహానికి గురి చేస్తోంది.
‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ను సుస్థిర పాలనను సుసాధ్యం చేసే చిట్కాగా చెబుతున్నారు. ఇదొక అసంగతమైన వాదన. ఎందుకని? బీజేపీ ఇటీవలి సంవత్సరాలలో పార్టీలను చీల్చడం లేదా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రతిపక్షాల ప్రభుత్వాలను పడగొట్టింది. ప్రతి ఐదేళ్లకూ పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ అన్న అవాస్తవిక ఆలోచన నిక్కమైన ప్రజాస్వామిక వ్యవస్థ, విలువలను పెంపొందించలేదు. రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధులను, రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని మరింతగా గౌరవిస్తూ, ఎన్నికల సందర్భంలోనూ, ఎన్నికల అనంతరమూ సమాన అవకాశాలను కల్పించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించినప్పడే అసలైన ప్రజాతంత్రం వర్ధిల్లుతుంది. ధన బలాన్ని దుర్వినియోగపరచడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిర్నిరోధంగా ఆచరణలోకి తీసుకువచ్చే సంకల్పం లోపించడం వల్ల ఎన్నికల ప్రక్రియ బలహీనపడడం లేదూ? నిజానికి దేశ పాలనా విధానాల నిర్ణేతలు ఈ అపసవ్య పరిణామాలపైనే జరూరుగా చర్చించవలసిన అవసరం ఉన్నది.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్‌్ట)
Updated Date - 2023-09-08T01:04:45+05:30 IST