అలవికాని హామీలను నమ్మేదెవరు?
ABN, First Publish Date - 2023-10-17T01:37:13+05:30
ఆరు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ ఎన్నికల సమయాల్లో ఎన్నో హామీలను ఇచ్చేది. అవి అమలయివుంటే భారతదేశం భూతల స్వర్గంగా మారిపోయి...
ఆరు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ ఎన్నికల సమయాల్లో ఎన్నో హామీలను ఇచ్చేది. అవి అమలయివుంటే భారతదేశం భూతల స్వర్గంగా మారిపోయి ఉండేది కాదూ? కానీ అలా జరగలేదు. భారీ అవినీతికి, అస్తవ్యస్త పరిపాలనకు, సామాన్యుడి ప్రాణాలకు భద్రత లేని పరిస్థితికి, ఉగ్రవాదుల స్వైరవిహారానికి దేశం నిలయంగా మారింది. గరీబీ హటావో అని ఇందిర పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ నేతలు తమ బొక్కసాలను నింపుకుని ధనవంతులైతే, పేదలు మరింత నిరుపేదలయ్యారు. మిస్టర్ క్లీన్ అన్న పేరుతో అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ హయాంలోనే బోఫోర్స్ కుంభకోణం జరిగింది. పది సంవత్సరాల యూపీఏ పాలనలో రూ. లక్షల కోట్ల అవినీతి జరిగినందువల్లే ప్రజలు కాంగ్రెస్ పాలనకు సమాధి కట్టారు. నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ మరోసారి అలవి కాని వాగ్దానాలను చేసి ప్రజలపై వల విసిరేందుకు ప్రయత్నిస్తోంది.
కొద్ది నెలల క్రితం కర్ణాటకలో ఏమి జరిగింది? ఏ విధంగానైనా అధికారంలోకి రావాలన్న తపనతో ఐదు అతి పెద్ద వాగ్దానాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చి ఉధృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ హామీలను అమలుపరచలేక ఆ రాష్ట్ర ప్రభుత్వం నానా తంటాలుపడుతోంది. ఈ వాగ్దానాలను అమలు చేస్తే ఏటా రూ 62,000 కోట్ల ఖర్చవుతుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.2.27 లక్షల కోట్లు కాగా, అందులో 22 శాతాన్ని ఈ వాగ్దానాల అమలుకే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం ప్రజలపైనే మళ్లీ భారం మోపాల్సి వస్తుంది. అందువల్లే 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తామన్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రేట్లను 50 శాతం కంటే ఎక్కువగా పెంచారు. హామీ ఇచ్చిన విధంగా పది కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి ఇచ్చేం దుకు ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోగా, అవినీతి తారస్థాయికి చేరుకుంది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామన్న కర్ణాటకలో మహిళలు ప్రయాణించేందుకు తగిన బస్సులే లేవు. బస్టాండులలో బస్సుల కోసం ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువతకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న కర్ణాటక ప్రభుత్వం ఇంకా ఈ పథకాన్ని ప్రారంభించలేదు. అయితే నేతల అవినీతి పెచ్చరిల్లిపోయింది. వారి ఇళ్లలో భారీ ఎత్తున నోట్లకట్టలు ఐటీ దాడుల్లో పట్టుబడుతున్నాయి.
కర్ణాటక అనుభవాన్ని బట్టి చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా కాంగ్రెస్ తన వాగ్దానాలను నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఎన్నికల సమయంలో అలవికాని వాగ్దానాలను చేయడం ఆ పార్టీకి అలవాటైపోయింది. ఉచితాలు ప్రకటించడం, మైనారిటీలను బుజ్జగించడం, ఎడా పెడా అవినీతికి పాల్పడడం కాంగ్రెస్ సంస్కృతిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో లాగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా గత ఎన్నికల్లో మద్యాన్ని నిషేధిస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు ఏపీలో లాగా అక్కడ కూడా వేల కోట్ల మద్యం కుంభకోణం జరుగుతోంది. పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నెలకు రూ. 2500 చొప్పున ఉద్యోగ భృతి కల్పిస్తామని ఛత్తీస్‌గఢ్‌లో కూడా హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా, ఇంతవరకూ ఈ హామీలను నిలబెట్టుకోలేదు. కనీసం స్వయం సహాయక బృందాలకు హామీ ఇచ్చినట్లుగా రుణాలు మాఫీ కూడా చేయలేదు. పైగా ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్ పేరిట వనరుల దోపిడీ తీవ్రతరమైంది. శాంతిభద్రతల పరిస్థితి గతంలో కంటే ఎక్కువగా క్షీణించింది. కాంగ్రెస్ హయాంలో ఆరువేల మేరకు ఆదివాసీలపై అత్యాచారాలు జరిగాయి. జష్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం రోజే ఒక అధ్యాపకురాలిపై అత్యాచారం జరిగింది. రాజస్థాన్‌లో జల్ జీవన్ మిషన్ టెండర్ల స్థాయిలో రూ.20వేల కోట్ల మేరకు కుంభకోణం జరిగింది. ఐటీ విభాగంలో మరో రూ. 5వేల కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి. మధ్యాహ్న భోజన పథకంలో కూడా అవినీతి బయటపడింది. ఐదు సంవత్సరాల అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య కుమ్ములాటల మధ్య ప్రభుత్వ పాలనను గాలికి వదిలేశారు.
కాంగ్రెస్ బూటకపు వాగ్దానాల చరిత్రను కేసీఆర్ కూడా నేర్చుకున్నట్లున్నారు. ఇప్పటివరకూ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించని కేసీఆర్ ఇప్పుడు మళ్లీ ఓట్లేస్తే సిలిండర్ ధర రూ.400 మేరకు తగ్గిస్తామని అంటున్నారు. ఇళ్లు కట్టిస్తామని, బీమా కల్పిస్తామని, మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రూ.3వేల చొప్పున ఉద్యోగ భృతి చెల్లిస్తామని హామీఇచ్చిన కేసీఆర్, అధికారంలో ఉన్న ఈ పదేళ్ల కాలంలో అవన్నీ ఎందుకు చేయలేదు? ఉద్యోగాలు ఆయన కల్పించి ఉంటే ప్రవళిక లాంటి నిరుద్యోగ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది? ప్రభుత్వ అసమర్థత మూలంగా, మాటిమాటికీ పేపర్ల లీకేజీలతో నోటిఫికేషన్లు వాయిదా పడుతుంటే దిక్కుతోచని నిరుద్యోగుల ఆందోళనను ఎవరైనా పట్టించుకున్నారా? పరీక్షలు నిర్వహించే సామర్థ్యం లేకుండా 2014, 2018, 2019లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కేసీఆర్ ఎన్నిటిని నెరవేర్చారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? కనీసం పెట్రోల్‌పై పన్ను అయినా తగ్గించి, ప్రజలకు ఊరట కల్పించారా? రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబసభ్యులు, ఆయన అస్మదీయులకు తప్ప ఎవరికైనా ఆయన పాలన వల్ల ప్రయోజనం దక్కిందా? నిమ్స్ స్థాయిలో 24 కేంద్రాల్లో 24 ఆసుపత్రులు కడతామని, దళితులకు 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు కల్పిస్తామని, మూతపడ్డ కంపెనీలను తెరుస్తామని, హైదరాబాద్ నుంచి వరంగల్‌కు పారిశ్రామిక కారిడార్‌ను నిర్మిస్తామని, ప్రతి ఊళ్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ ఎన్నో ప్రగల్భాలు పలికారు. రకరకాల పనికిరాని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి పేరిట విచ్చలవిడిగా అప్పులు చేశారు. విశ్వనగరం కావాల్సిన హైదరాబాద్ వర్షాలు వస్తే చాలు మురికివాడగా మారే పరిస్థితి ఏర్పడింది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వడ్డీలకే పోతోంది.
భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఎన్నికల రాజకీయాల కోసం బూటకపు వాగ్దానాలు చేయదు. తాను చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చారో రిపోర్ట్ కార్డు సమర్పించే ఏకైక పార్టీ బీజేపీ. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ బూటకపు వాగ్దానాల సంస్కృతినే మార్చారు. ప్రజలనుంచి సూచనలు స్వీకరించిన తర్వాతే వారి ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలను రూపొందిస్తుంది. అనుత్పాదక ఉచితాలను ఇవ్వడం మూలంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని మోదీ అనేక సందర్భాల్లో స్వయంగా ప్రకటించారు. మోదీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాలు కనీవిని ఎరుగని స్థితిలో నిర్మాణమయ్యాయి. ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతదేశం త్వరలో మూడో స్థానానికి చేరుకోనుంది. మన దేశంలో రూ. 50 లక్షల కోట్ల మేరకు విదేశీ పెట్టుబడులు రాగా, ఉత్పాదక రంగంలో ఎక్కువగా విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఎజెండా అయితే, జాతీయవాదం బీజేపీకి జెండా లాంటిది. ప్రజలకు ఈ విషయం తెలుసు కనుకనే రానున్న ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు తప్పక లభిస్తాయి.
వై. సత్యకుమార్
(బీజేపీ జాతీయ కార్యదర్శి)
Updated Date - 2023-10-17T01:37:13+05:30 IST