ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ఆధార్ పేమెంట్’పై ఎందుకంత పట్టుబడుతున్నారు?

ABN, First Publish Date - 2023-09-15T00:45:01+05:30

గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఆధార్ పేమెంట్ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి తప్పనిసరి చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది....

‘‘మోడీ ప్రభుత్వం ‘ఆధార్ సాంకేతికత’ను ఆయుధంగా మార్చడం మానేయాలి. అప్పుడు అత్యంత దుర్బలమైన పౌరుల సాంఘిక సంక్షేమ ప్రయోజనాలు తిరస్కరణకు గురికాకుండా ఉంటాయి.’’

జై రామ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి

గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఆధార్ పేమెంట్ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి తప్పనిసరి చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఉపాధి హామీతో సహా అన్ని సామాజిక భద్రతా కార్యక్రమాలలో ఆధార్ పేమెంట్ పద్ధతిని ప్రజలపై రుద్దవద్దని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ పేమెంట్ పద్ధతి అంటే ఏమిటి; దీనిని దేశవ్యాప్తంగా పౌర సమాజ సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి; దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి... తదితర అంశాలను చర్చించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

ప్రభుత్వ పథకాలలో ప్రజలకు నగదు బదిలీ చేయాలంటే ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి: 1) ఖాతా ఆధారిత చెల్లింపు (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ – నాచ్). 2) ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టం (ఏపీబీఎస్) లేదా ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏబీపీఎస్).

ఖాతా ఆధారిత చెల్లింపులు (నాచ్) అంటే హక్కుదారుల పేరు, బ్యాంకు ఖాతా సంఖ్య, బ్యాంకు IFSCని ఉపయోగించి జరిగే సాధారణ బ్యాంక్ బదిలీలు. ఇది NEFT బ్యాంక్ బదిలీ లాంటిది. ఈ ఖాతా ఆధారిత చెల్లింపు వ్యవస్థలలో ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలంటే మండల స్థాయి ఆ పథకాన్ని అమలుచేసే కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ స్థానికంగా చేయవచ్చు.

ఆధార్ బ్రిడ్జి పేమెంట్ సిస్టం(ఏబీపీఎస్) పద్ధతిలో హక్కుదారుల ఆధార్ నెంబర్ వారి ఆర్థిక చిరునామాగా పని చేస్తుంది. ఏబీపిస్ కోసం హక్కుదారుల ఆధార్ వివరాలను తప్పనిసరిగా జాబ్ కార్డ్‌కు, బ్యాంక్ ఖాతాకు అనుసంధానించాలి. కార్మికుని ఆధార్ తప్పనిసరిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటాబేస్‌తో మ్యాప్ చేయబడాలి. చివరగా, బ్యాంక్ సంస్థాగత గుర్తింపు సంఖ్య (IIN) తప్పనిసరిగా NPCI డేటాబేస్‌తో మ్యాప్ చేయబడాలి. హక్కుదారుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే తాజాగా జరిగిన ఆధార్ లింకు, NPCI లింక్ జరిగిన బ్యాంకు ఖాతాకు వేతనాలు జమ ఔతాయి.

ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్‌ధన్, ఆధార్, మొబైల్’ (JAM) త్రయంలో ‘ఏబీపీఎస్’ పద్ధతి ఒక భాగం. కేంద్ర ప్రభుత్వం 2017లో వంద కోట్ల బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించటానికి ప్రయత్నించడం నుంచి అనేక సామాజిక భద్రతా పథకాలను హక్కుదారులను అనుసంధానించడం వరకు అనేక అంశాల్లో ఆధార్ సీడింగ్ కోసం లక్ష్యాలను నిర్దేశించింది.

గత సంవత్సరం జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఏబీపీఎస్ పద్ధతిని మాత్రమే వినియోగించాలని లేఖ రాసింది. ఆ లేఖను అనుసరించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఏబీపీఎస్ పద్ధతిని తప్పనిసరి చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వును అనుసరించి జనవరి 2023లో దేశవ్యాప్తంగా అన్ని ఉపాధి హామీ వేతన చెల్లింపులకు ‘ఏబీపీఎస్’ పద్ధతిని తప్పనిసరిగా ఉపయోగించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కానీ ఆ సమయంలో ఉపాధి హామీ కార్మికులలో కేవలం 43శాతం మంది మాత్రమే ‘ఏబీపీఎస్’ చెల్లింపులకు అర్హులుగా ఉన్నారు. అప్పటి నుంచి, ప్రజల ఒత్తిడి, లక్ష్యాలను చేరుకోవడంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా తప్పనిసరి ‘ఏబీపీఎస్’ కోసం అనేకసార్లు గడువును పొడిగించింది. ఐతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘ఏబీపీఎస్’ సమస్యలని పరిష్కరించలేక స్థానిక అధికారులు ఉపాధి హామీ కార్మికుల పేర్లను తొలగిస్తున్నారని దేశంలో పలు రాష్ట్రాల నుంచి వార్తా కథనాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా గత 18 నెలల్లో సుమారు 6 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికుల పేర్లు తొలగించబడ్డాయి. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐతే 80 లక్షల మంది కార్మికుల పేర్లు, తెలంగాణాలో సుమారు 5 లక్షల పేర్లు గల్లంతు అయ్యాయని తెలుస్తున్నది. ఇంత చేసినా 31 ఆగస్టు 2023 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కార్మికులలో 41శాతం మంది ‘ఏబీపీఎస్’కి అనర్హులుగానే మిగిలిపోయారు.

నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పథకాలకూ ఆధార్ పేమెంట్ పద్ధతిని ఎప్పటి నుంచో వాడుతున్నారు. అయినప్పటికీ ‘ఏబీపీఎస్’ పద్ధతిలో కార్మికులకు అర్హత కల్పించలేక సులువుగా కార్మికుల పేర్లను తొలగించడానికి పూనుకున్నారు. కథ ఇక్కడితో పూర్తి కాలేదు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంలో 2021లో రెండు లక్షలమంది రైతుల పేర్లను వారు ఆధార్ పేమెంట్ పద్ధతికి అర్హులు కారన్న కారణంగా మూడో కంటికి తెలియకుండా తొలగించారు. ఒకవేళ ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే వారు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చినా, ఆధార్ పేమెంటుకు అర్హత సంపాదించడానికి మాత్రం ఎలాంటి తోడ్పాటు క్షేత్ర స్థాయిలో రైతులకు అందలేదు.

ఖాతా ఆధారిత చెల్లింపుల పద్ధతికి, ఆధార్ పేమెంట్ పద్ధతికి ఒక మౌలికమైన తేడా ఉన్నది. ఖాతా ఆధారిత చెల్లింపుల పద్ధతిలో ప్రజలకు ఏవైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదే ఆధార్ పేమెంట్ పద్ధతిలో ఏదైనా సమస్య వస్తే బ్యాంక్‌కు వెళ్ళి దాన్ని పరిష్కరించుకోవాల్సింది ప్రజలే. ఈ పరిష్కారం అంత సులువు కాదని ‘లిబ్‌టెక్ ఇండియా’ సంస్థ చేసిన పరిశోధనలో తేలింది. ఈ సంస్థ తరఫున దేశవ్యాప్తంగా పథకాలను అమలు చేస్తున్న వందలాది మంది ప్రభుత్వ అధికారులతోనూ, బ్యాంకు అధికారులతోనూ మాట్లాడినపుడు వారికి ఆధార్ లింకింగ్‌కు, NPCI లింకింగ్‌కు మధ్య తేడా తెలియదని కనుగొన్నాం.

అసలు కేంద్ర ప్రభుత్వం ఆధార్ పేమెంట్ పద్ధతి కోసం ఎందుకు పట్టుబడుతోందన్నది తెలుసుకునే ఉద్దేశంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను సమాచార హక్కు చట్టం క్రింద అడిగాం. గ్రామీణాభివృద్ధి శాఖ తమ వివిధ లేఖల్లోను, ఉత్తర్వుల్లోను, అలాగే ఆర్టీఐ ప్రతిస్పందనల్లోను ‘నాచ్’ పద్ధతి కంటే ‘ఏబీపీఎస్’ చెల్లింపులు ఏ విధంగా మెరుగైనవో చెబుతూ ఈ కారణాలను పేర్కొంది: 1) ‘ఏబీపీఎస్’ పద్ధతి ‘నాచ్’ పద్ధతి కంటే సమర్థవంతమైనది. 2) ‘ఏబీపీఎస్’ పద్ధతి పారదర్శకతను మెరుగుపరుస్తుంది.

గ్రామీణాభివృద్ధి శాఖ పరిభాషలో ‘సమర్థత’ అంటే ఖచ్చితంగా ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. బహుశా నకిలీ లబ్ధిదారుల్ని ఏరివేయడం, నగదు బదిలీకి తక్కువ సమయం పట్టడం, నగదు బదిలీలో సాంకేతిక కారణాల వలన జరిగే తిరస్కరణలు తగ్గటం... ఇవి కావొచ్చు. కానీ ఇందుకు ఆ శాఖ ఎలాంటి రుజువులూ చూపలేకపోయింది. అకౌంట్ పేమెంట్ పద్ధతి కంటే ఆధార్ పేమెంట్ పద్ధతిలో వేతనాల బదిలీకి తక్కువ సమయం పట్టడం అన్నది నిజం కాదని లిబ్‌టెక్ ఇండియా సంస్థ 3 కోట్లకు పైగా ఉపాధి హామీ వేతన లావాదేవీలను విశ్లేషించి రూపొందించిన నివేదికలో తేలింది. అలానే పేమెంట్ బదిలీల్లో సాంకేతిక కారణాల వలన జరిగే తిరస్కరణలు ఆధార్ పేమెంట్ పద్ధతిలో తక్కువన్న భావన కూడా నిజం కాదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

ఏబీపీఎస్‌ పారదర్శకత పెరుగుదలకు దోహదపడుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ పలు సందర్భాల్లో పేర్కొన్నది. కానీ పథకాల హక్కుదారుల దృక్కోణంలోంచి చూస్తే: 1) నాకు రావాల్సిన వేతనాలు/ నగదు ఎంత? 2) అవి చెల్లించారా? 3) వాటిని ఏ ఖాతాలో జమ చేసేరు?

4) జమ అయిన తర్వాత నాకు అవసరమైనప్పుడు నేను వేతనాలను పొందవచ్చా?... ఈ ప్రశ్నలకు జవాబు ఆన్లైన్/ ఆఫ్‍లైన్ రెండు పద్ధతుల్లోనూ ప్రజలకు దొరికినప్పుడు మాత్రమే పారదర్శకత పెరిగినట్లు. ప్రజలతో ఆ సమాచారం పంచుకోనప్పుడు ‘నాచ్’ ఐనా, ‘ఏబీపీఎస్’ అయినా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.

పైపెచ్చు ఏబీపీస్‌లో ప్రజల హక్కులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఉపాధి హామీ కార్మికులకు తెలియకుండా వారి పేరు మీద ఒక మొబైల్ ఫోన్ కంపెనీ తాము ప్రారంభించిన బ్యాంకులో ఖాతాలు ప్రారంభించడం, వాటిని ఆధార్‌తో లింక్ చేయడంతో ఉపాధి హామీ వేతనాలు అందులో జమకావడం ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగింది. ఆ విషయం నాలుగు నెలల తర్వాత కార్మికులకు అర్థం అయి గొడవ చేయడంతో ఆ మొబైల్ ఫోన్ కంపెనీ బ్యాంకు వేతనాల్ని తిరిగి వారి రెగ్యులర్ బ్యాంకు ఖాతాలకు జమ చేసింది.

చివరిగా, ప్రభుత్వ పథకాలలో కేవలం వాగ్దానం చేసిన ప్రయోజనాలను బదిలీ చేయడంతోనే తమ పాత్ర ముగిసిందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ ఆ ప్రయోజనాలను అందుకునే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాటిని పరిగణలోనికి తీసుకుని, వారిని నిర్ణయాధికారాలలో భాగస్వాములను చేసినపుడే సాంఘిక సంక్షేమ పథకాల అసలు ప్రయోజనం సిద్ధిస్తుంది.

చక్రధర్ బుద్ధ

లిబ్‌టెక్ ఇండియా పరిశోధకులు

Updated Date - 2023-09-15T00:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising