ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ ప్రైవేటు సైన్యంగా ప్రజారక్షణ వ్యవస్థలు!

ABN, First Publish Date - 2023-09-13T03:47:22+05:30

ప్రపంచం మొత్తం జీ–20 సమావేశాలవైపు చూస్తున్న వేళ జగన్‌రెడ్డి చూపు కక్షలు కార్పణ్యాల వైపు చూస్తోంది. తనకు అంటిన అవినీతి మరకను అందరికీ...

ప్రపంచం మొత్తం జీ–20 సమావేశాలవైపు చూస్తున్న వేళ జగన్‌రెడ్డి చూపు కక్షలు కార్పణ్యాల వైపు చూస్తోంది. తనకు అంటిన అవినీతి మరకను అందరికీ అంటించాలని చూస్తున్నారు. 11 సీబీఐ కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉండి, 16 నెలల పాటు జైలు జీవితం గడిపి, ఖైదీ నెం.6093గా తాను తిన్న జైలు కూడునే అందరికీ తినిపించాలని జగన్‌రెడ్డి ఆరాటపడుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి అక్రమాలు జరగనప్పటికీ, చంద్రబాబు పాత్రపై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అన్యాయంగా ఇరికించారు. పద్నాలుగు రోజుల పాటు ఆయన్ను రిమాండ్‌కు పంపడం జగన్‌రెడ్డి రాక్షసత్వానికి పరాకాష్ఠ. పథకం ప్రకారమే సెలవురోజున అరెస్ట్ చేశారు.

14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబును అత్యంత దుర్మార్గంగా, అర్ధరాత్రివేళ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? కనీసం ఆయన వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా పోలీసు అధికారులు ఉన్మాదంగా వ్యవహరించారు. గవర్నర్ అనుమతి కూడా తీసుకోకుండా అరెస్ట్ ఎలా చేస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? 2021లో కేసు నమోదు చేస్తే.. ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? గుజరాత్ సహా తమిళనాడు, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలు చేసుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందాన్ని ఏ విధంగా తప్పంటారు? 2.13 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు కల్పిచడం వాస్తవం కాదా?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితంగా ఆపాదిస్తున్నారు. రిమాండ్ రిపోర్టులో కూడా ఒకదానికొకటి పొంతన లేదు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేష్ వాంగ్మూలంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామనే వాదనను ఆయనే ఖండించారు. తాను అప్రూవర్‌గా మారారనే ప్రచారం అవాస్తమన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదన్నారు. ఒకవేళ తప్పు చేస్తే అజయ్ కల్లాం రెడ్డి, ప్రేమచంద్రారెడ్డి పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు లేవు? దీనిని బట్టి సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది. జగన్‌రెడ్డి ప్రైవేటు సైన్యంలా సీఐడీ వ్యవహరిస్తోంది.


జగన్‌రెడ్డికి పగ ప్రతీకారాలపై ఉన్న ప్రేమ ఓటేసి గెలిపించిన ప్రజలపై లేదు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా వందలమందిపై అక్రమ కేసులు పెట్టారు. సుమారు 75 మంది తెలుగుదేశం కార్యకర్తలను హతమార్చారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి నిరంకుశత్వం ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరు ఏకపక్షంగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక నిర్ధారించింది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేసిన చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గంలో సైతం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లను కనీసం పరామర్శకు కూడా రాకుండా అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటి? కృష్ణా జిల్లా ఎస్పీ శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపిస్తూ పవన్ కల్యాణ్ ప్రయాణించాలనుకున్న ప్రత్యేక విమానానికి అనుమతులు ఇవ్వనీయకుండా లేఖలు రాయడం దుర్మార్గం కాదా? దేశచరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా చూశామా? చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రోడ్డెక్కిన ప్రజలు, పార్టీ శ్రేణులు, మహిళలు, మీడియా ప్రతినిధులను విచక్షణారహితంగా కొడుతూ పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్ట్, రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తలతో ఆందోళనకు గురై రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది గుండె పోటుతో చనిపోయారు. ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం మనం చూశాం. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడిచేసినా, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినా కేసులు లేవు. పైగా దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించారు.

సాక్షాత్తూ పోలీసులే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, రాష్ట్రం తగలబడుతుంటే చలికాచుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు. సంజయ్, కొల్లి రఘురామిరెడ్డి లాంటి సీఐడీ ఉన్నతాధికారుల ప్రవర్తన పోలీసు వ్యవస్థపై మాయని మచ్చలా మిగులుతుంది. వీరిద్దరి అరాచకాలు హద్దులు దాటాయి. అధికారమదంతో ఏం చేసినా ఎదురులేదనే భావనతో విర్రవీగుతున్నారు. గౌతమ్ సవాంగ్, సునీల్ కుమార్‌లు ఇంతకంటే విశ్వాసంగా పనిచేసినా అవమానాలు తప్పలేదు. నిన్నటి వరకు అధికార పార్టీ నిర్బంధాలకు, వైసీపీ కార్యకర్తల విధ్వంసాలకు పోలీసులు సహకరించడం చూశాం. ఇప్పుడు పోలీసులే ప్రత్యక్షంగా వైసీపీ కార్యకర్తల పాత్ర పోషిస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు జగన్‌రెడ్డి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితులను పోలీసులు కల్పిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో బాధితుల పక్షాన ఉండాల్సిన రాష్ట్ర పోలీసులు నిందితుల వైపు ఉన్నారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఇందుకు అద్దం పడుతోంది. సకల శాఖ మంత్రి సజ్జల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. ఆయన ఆదేశాలతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బాధితులను నేరస్థులుగా, నేరస్థులను బాధితులుగా చిత్రీకరిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లాంటి వాటిని వదిలేసి రాజకీయ కక్షసాధింపులకు తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నారు.


ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కూడా చాలా కీలకమైనది. అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమే అవుతుంది. పోలీసులు పాలకపక్షానికి ఊడిగం చేయడం మాని నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. బాధితులకు అండగా ఉండి శాంతిభద్రతలను కాపాడాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇంతకంటే పెద్ద నియంతలే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లుగా, జగన్‌రెడ్డి తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్

Updated Date - 2023-09-13T03:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising