ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యవ్వన భారతం

ABN, First Publish Date - 2023-01-21T03:54:54+05:30

అధిక జనాభా గురించిన ఆందోళన ఇప్పుడు అంతగా లేదు కానీ, అందులో దేశ ఆర్థికవ్యవస్థ ఉన్నతికి ఉపకరించేవారి సంఖ్య ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధిక జనాభా గురించిన ఆందోళన ఇప్పుడు అంతగా లేదు కానీ, అందులో దేశ ఆర్థికవ్యవస్థ ఉన్నతికి ఉపకరించేవారి సంఖ్య ఎంతన్నదే ప్రధానం. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా రికార్డుకెక్కిన చైనాలో ఇటీవల జననాల రేటు తగ్గినట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. రేటు తగ్గడంతో పాటు, వయోవృద్ధుల సంఖ్య కూడా ఆ దేశంలో హెచ్చుతున్నది. అక్కడి పరిణామం భారతదేశాన్ని ఇప్పుడు జనాభాలో అగ్రదేశంగా మార్చింది. గత ఏడాది జనాభా దినోత్సవంనాడే ఈ ఏడాది చివరికల్లా భారతదేశం చైనాను మించిపోతుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇప్పటికే మనం చైనాను అధిగమించేశామన్న విశ్లేషణలు ఇప్పుడు జోరందుకున్నాయి.

మాక్రోట్రెండ్స్‌ సహా కొన్ని సంస్థలు కట్టిన లెక్కల ప్రకారం భారత్‌ జనాభా చైనాకంటే కనీసం కోటి ఎక్కువ. చాలా రంగాల్లో అగ్రస్థానం కోసం చైనాతో పోటీపడుతున్న భారతదేశం ఈ విషయంలో తొలి ఘనత సాధించింది. జనాభా పెరిగితే చాలా కష్టాలుంటాయన్న విశ్లేషణలు సహజం. సహజవనరులపై తీవ్రప్రభావం ఉంటుందనీ, అందరికీ ఉపాధి కల్పించడం కష్టమవుతుందనీ, ఆహార కొరత ఏర్పడుతుందనీ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. జనాభా పెరుగుదల కూడా ఆఫ్రికన్‌ దేశాలు, భారత్‌, పాకిస్థాన్‌ వంటి ఆసియా దేశాల్లోనే అధికంగా ఉంటుందనీ, రాబోయే ముప్పయ్యేళ్ళకాలంలో ప్రపంచ జనాభా వృద్ధిరేటులో సగం ఇటువంటి ఎనిమిది దేశాల్లోనే నమోదవుతుందని ఐరాస అంటున్నది. 2050 కల్లా భారత్ జనాభా దాదాపు 166కోట్లకు చేరుతుందనీ, అప్పటికి చైనా జనాభా ఇంకా తగ్గి దాదాపు 131 కోట్లకు పరిమితం అవుతుందని ఐరాస నివేదిక గతంలో విశ్లేషించింది. అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థలున్న దేశాలు జనాభాక్షీణతను నమోదుచేయడం, వృద్ధిచెందుతున్న, వెనకబడిన దేశాల్లో జననాలు బాగుండటం గుర్తించాల్సిన పరిణామం.

చైనాలో జననాల సగటు కొంతకాలంగా వేగంగా తగ్గుతూవస్తున్నందున జనాభాక్షీణతను ముందుగా లెక్కలు వేసుకొనే, 1979 నుంచి అమల్లో ఉన్న ఒకే బిడ్డ విధానాన్ని ఆరేళ్ళక్రితమే రద్దుచేసింది. ఒక్కరినే కనాలన్న విధానాన్ని అది ఎంత కఠినంగా అమలు చేసిందో తెలిసిందే. నాలుగు దశాబ్దాల పాటు ఆ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ, కాఠిన్యాన్ని పాటించినా, ఆ తరువాత దేశం ఎంతో వృద్ధిచెందింది. కానీ, మరోపక్క జనాభా తరుగుదల మొదలైంది. ఆ తరువాత ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలను కనవచ్చునంటూ ప్రోత్సాహకాలు ప్రకటించినా చైనీయులు ఎక్కువమంది పిల్లలను కనేందుకు ఆసక్తిచూపడం లేదు. ప్రస్తుతానికి దేశ శ్రామికశక్తి బాగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులోనైనా చైనా ఆ కొరత ఎదుర్కోక తప్పదు. ఈ కారణంగా, యావత్ ప్రపంచాన్ని తన ఉత్పత్తులతో ముంచెత్తుతున్న చైనా సమీపభవిష్యత్తులో ఆ స్థానాన్ని కోల్పోవలసిరావచ్చునని అంటున్నారు.

పనిచేయగలిగే వయసున్నవారి సంఖ్యకు మన దేశంలో లోటేమీ లేదు. డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ ఉన్నదేశమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మనది నవయవ్వనదేశం కనుక, మిగతాదేశాల పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది కనుక మన మానవవనరులకు ఎంతో డిమాండ్‌ ఉంటుందని పాలకులనుంచి విశ్లేషకుల వరకూ అందరూ అంటున్నారు. పనిచేయగలిగేవారి సంఖ్య హెచ్చుగా ఉండేస్థితి కనీసం మరో ముప్పయ్యేళ్ళపాటు కొనసాగుతుందట. ఇది కచ్చితంగా ఉత్పాదకతకు, దేశాభివృద్ధికి ఉపకరించే పరిణామం. చైనాకు పూర్తిభిన్నంగా, చైనాకంటే మనదేశం యవ్వనంలో ఉన్న దశ. దేశజనాభాలో దాదాపు సగంమంది వయసు ముప్పయ్యేళ్ళలోపే. చైనాలో అరవైయ్యేళ్ళకు పైబడినవారి సంఖ్య మనదేశంలో కంటే రెట్టింపు. చైనాలో ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ హరించుకుపోతుంటే, భారతదేశంలో అది ఇప్పటికే మొదలై, కొనసాగుతున్నది. ఇది భారంగా కాక, వరంగా ఉపకరించాలంటే ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. ప్రధానంగా ఆరోగ్యం, చక్కని విద్యానైపుణ్యాలు సమకూర్చినప్పుడే ఉత్పత్తికి ఉపకరించే సమర్థమైన శ్రామికశక్తి రూపొందుతుంది. ఈ దేశంలో నైపుణ్యం ఉన్న శ్రామికశక్తి నాలుగుశాతం లోపే. దేశంలో నిరుద్యోగిత తీవ్రంగా ఉంటూ, ఉపాధికల్పన తగ్గుతూండటం మరో ప్రమాద సూచన. చక్కని ప్రణాళికలతో మానవశక్తిని సద్వినియోగం చేసుకోకపోతే అది భారంగానే కాదు, ప్రమాదకరంగా కూడా మారుతుంది.

Updated Date - 2023-01-21T03:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising