రోబోటిక్ సర్జరీలు లాభమా? నష్టమా? వైద్యులు ఏమంటున్నారంటే..!
ABN, First Publish Date - 2023-05-13T17:03:09+05:30
సర్జరీ నొప్పి, దుష్ప్రభావాలు తక్కువగా ఉండాలి. వీలైనంత త్వరగా కోలుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సర్జరీ సక్సెస్ కావాలి. రోగులతో పాటు వైద్యులు కూడా
సర్జరీ నొప్పి, దుష్ప్రభావాలు తక్కువగా ఉండాలి. వీలైనంత త్వరగా కోలుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సర్జరీ సక్సెస్ కావాలి. రోగులతో పాటు వైద్యులు కూడా ఇదే కోరుకుంటారు. అలాంటి అనుకూలతలన్నీ రోబోటిక్ సర్జరీలలోనే ఉన్నాయంటున్నారు వైద్యులు.
ఓపెన్ సర్జరీలను ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు అధిగమించాయి. ఇవి కీ హోల్ సర్జరీలు కాబట్టి కోత, కోలుకునే సమయాలు తగ్గాయి. అయితే ల్యాప్రోస్కోపిక్ సర్జరీల్లో కూడా ఇటు వైద్యులకు, అటు రోగులకు కొన్ని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఈ ఇబ్బందులను అధిగమిస్తూ రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకొచ్చాయి. ల్యాప్రోస్కోపిక్ సర్జరీతో పోలిస్తే, రోబోటిక్ సర్జరీల్లో, పరికరాల మీద, చేసే సర్జరీ మీద వైద్యులకు పట్టు ఎక్కువగా ఉంటుంది.
ల్యాప్రోస్కోపీ కంటే రోబోటిక్ మేలు
సాధారణంగా సర్జరీల్లో పెద్ద కోతతో కూడిన ఓపెన్ సర్జరీ, లేదంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు ఉంటాయి. ఓపెన్ సర్జరీలో కోలుకునే సమయం ఎక్కువ. సర్జరీ తర్వాత హెర్నియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే! అలాగే సర్జరీ తర్వాత కొన్ని నెలల పాటు పొట్ట మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఈ ఇబ్బందులన్నీ తగ్గించుకోవడం కోసం ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. అయితే వీటిలో బేసిక్ (అపెండిక్స్, గాల్‌బ్లాడర్, చిన్నపాటి హెర్నియా) అడ్వాన్స్‌డ్ (లివర్, పాంక్రియాస్, స్టమక్ కేన్సర్లు, కాంప్లెక్స్ హెర్నియా, రికరెంట్ హెర్నియా) అనే రెండు రకాల సర్జరీలుంటాయి. అయితే అడ్వాన్స్‌డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీల్లో, సర్జరీ సమయంలో పేగులు అతుక్కు పోవడం, సరిపడా చోటు లేకపోవడం లాంటి సమస్యల మూలంగా, పది నుంచి 20 శాతం మందికి ఓపెన్ సర్జరీ చేయవలసి వస్తూ ఉంటుంది. సర్జరీ చేసే వైద్యులకు సహకరించడం కోసం ఇద్దరు ముగ్గురు సుశిక్షితులైన వైద్యులు కూడా అవసరం అవుతారు. వీళ్లలో ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా రోగిని నష్టం జరుగుతుంది. ల్యాప్రోస్కోపీలో హౌ డెఫినిషన్ కెమెరా మాత్రమే ఉంటుంది. కానీ రోబోటిక్ సర్జరీ ఇందుకు పూర్తి భిన్నం.
నాలుగు రంధ్రాలతో: అదెంత క్లిష్టమైన సర్జరీ అయినా రోబోటిక్ సర్జరీలో కేవలం నాలుగు రంధ్రాలే వేయడం జరుగుతుంది.
అన్నీ వైద్యుడి నియంత్రణలో: పరికరాలతో పాటు, కెమెరా సర్జరీ చేసే వైద్యుడి నియంత్రణలోనే ఉంటుంది. కాబట్టి ఏ ప్రదేశాన్ని వైద్యుడు స్పష్టంగా చూడాలనుకుంటే దాన్నే చూడగలుగుతారు.
అంతర్గత స్రావాలు: ల్యాప్రోస్కోపీలో అంతర్గత అవయవాలను పక్కకు జరిపే సమయంలో లేదా ఒకే భంగిమలో పట్టుకునే సమయంలో ఆ పనికి ఉద్దేశించిన వ్యక్తుల వల్ల పొరపాట్లు జరిగి అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశాలుంటాయి. రోబోటిక్ సర్జరీలో ఇలాంటి పనుల కోసం రోబోటిక్ ఆర్మ్‌ను ఉంచి, లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఒకే భంగిమలో గంటల తరబడి ఉండిపోతుంది. కాబట్టి పొరపాట్లకు ఆస్కారం ఉండదు.
త్రీడి విజన్: రోబోటిక్ సర్జరీలో త్రీడి విజన్ ఉంటుంది. కాబట్టి అంతర్గత అవయవాలన్నిటినీ స్పష్టంగా చూసే వెసులుబాటు వైద్యులకు ఉంటుంది.
కెమెరా: రోబోటిక్ సర్జరీలో ఉపయోగించే కెమెరాను 16 రెట్లు అదనంగా మాగ్నిఫై చేసి చూడగలిగే వీలుంటుంది. కాబట్టి చిన్న చిన్న రక్తస్రావాలను కూడా వైద్యులు కనిపెట్టగలిగే వీలుంటుంది.
కడుపులో చికిత్సలకు...
ప్రారంభంలో రోబోటిక్ సర్జరీలను ప్రాస్టేట్, యూరాలజీ మొదలైన కేన్సర్లకే పరిమితం చేశారు. కానీ ప్రస్తుతం గ్యాస్ర్టోఎంటరాలజీకి సంబంధించిన (స్టమక్, పేగులు, కాలేయం, పాంక్రియాస్) అన్ని కేన్సర్లకు రోబోటిక్ సర్జరీలను అనుసరించడంతో పాటు అన్ని రకాల హెర్నియాలకు, బేరియాట్రిక్ మెటబాలిక్ సర్జరీలను కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.
హెర్నియా: మునుపు హెర్నియాకు ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో భాగంగా రెండు రకాల టెక్నిక్స్‌తో మెష్ వేసేవాళ్లు. పైగా ఆ మెష్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. సర్జరీ తర్వాత వారం నుంచి పది రోజుల వరకూ నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎంత కీ హోల్ సర్జరీ అయినప్పటికీ ఉపయోగించే మెష్, పిన్స్ వల్ల నొప్పి ఉంటుంది. అయితే నొప్పికి కారణమయ్యే పిన్స్‌కు బదులుగా ఓపెన్ సర్జరీలో మాదిరిగా కుట్లు వేయగలిగితే నొప్పి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోబోటిక్ సర్జరీలో కుట్ల విధానాన్నే అనుసరిస్తున్నారు. పైగా మూడు రంథ్రాలతోనే సర్జరీ ముగిసిపోతుంది. కాబట్టి సర్జరీ పూర్తయిన మరుసటి రోజే ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు. తర్వాత వారంలోగా సాధారణ జీవితాన్ని గడపవచ్చు.
కడుపులోని కేన్సర్లు: పాంక్రియాస్, కాలేయం, అన్నవాహిక, చిన్న పేగు, పెద్ద పేగు, గర్భసంచి, ఈ అవయవాలకు సోకిన కేన్సర్లు క్లిష్టంగా ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఓపెన్ సర్జరీలు, లేదా ల్యాప్రోస్కోపిక్ అసిస్టెడ్ సర్జరీలనే ఎంచుకుంటూ ఉంటారు. 40ు సందర్భాల్లో ల్యాప్రోస్కోపిక్ కాస్తా ఓపెన్ సర్జరీగా మారిపోతూ ఉంటుంది. అయితే రోబోటిక్స్‌తో ఈ సమస్య పది శాతానికి తగ్గిపోయింది. పాంక్రియాస్‌లో రాళ్లు, గడ్డలను కూడా ఈ సర్జరీతో తొలగించవచ్చు.
బేరియాట్రిక్ మెటబాలిక్ సర్జరీ
ఈ సర్జరీతో బరువు తగ్గడంతో పాటు, బరువుతో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ అదుపులోకి వస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం, నిద్ర లేమి, మోకాళ్లు, వెన్ను నొప్పులు, పిసిఒడి, ఇన్‌ఫెర్టిలిటీ లాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. కాబట్టి ఈ సర్జరీని బేరియాట్రిక్ అనకుండా మెటబాలిక్ బేరియాట్రిక్ సర్జరీ అంటున్నారు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ (స్టమక్ సైజు తగ్గించడం), రెండు మూడు రకాల బైపాస్ ఆపరేషన్లను బేరియాట్రిక్ సర్జరీల్లో అనుసరిస్తారు. అయితే ల్యాప్రోస్కోపీ విధానంలో చేసే బేరియాట్రిక్ సర్జరీలో భాగంగా పేగును బైపాస్ చేసే పద్ధతిలోనే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. బైపాస్ చేసి పేగును అతికించేటప్పుడు, కొన్ని చోట్ల పేగు కణజాలం మందంగా ఉండి పిన్నులతో ఆ భాగం సరిగ్గా అతుక్కోక పోవచ్చు. దాంతో సర్జరీ తదనంతరం లీక్స్ ఏర్పడి ఇతరత్రా సమస్యలు తలెత్తవచ్చు. రోబోటిక్ సర్జరీలో త్రీడీ విజన్ ఉండడం వల్ల, కణజాలం మందాన్ని అంచనా వేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టేప్లర్ల సహాయంతో, సరిపడా ఒత్తిడితో స్టేప్లర్లను బిగుస్తూ, పేగును స్టమక్‌కు అతికించడం జరుగుతుంది. కాబట్టి లీక్‌లకు ఆస్కారం ఉండదు. అలాగే బరువు ఎక్కువగా ఉండేవాళ్ల పొట్టలో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ల్యాప్రోస్కోపీ కెమెరాతో పొట్టలోని అన్ని ప్రదేశాలకు చేరుకోగలిగే వీలుండదు. రోబోటిక్‌లో ఎంత లోతుకైనా, ఎంత మూలకైనా చేరుకోగలిగే వీలుంటుంది.
కేన్సర్ చికిత్స: సాధారణంగా ఓపెన్ సర్జరీ ద్వారా కేన్సర్ సోకిన భాగాన్ని తొలగిస్తే, ఆ గాయం పూర్తిగా మానేవరకూ రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకునే వీలుండదు. బదులుగా రోబోటిక్ సర్జరీని ఎంచుకునే కోతలు ఉండవు, సర్జరీ తర్వాత 15 రోజుల నుంచే కీమో, రేడియేషన్ మొదలుపెట్టవచ్చు. కాబట్టి సర్జరీ తదనంతర కేన్సర్ చికిత్సలను త్వరగా మొదలుపెట్టి కేన్సర్‌ను అదుపులోకి తెచ్చుకోవడం కోసం రోబోటిక్ సర్జరీలను ఎంచుకోవచ్చు.
-డాక్టర్ విజయకుమార్ బడా
సీనియర్ సర్జికల్ గ్యాస్ర్టోఎంటరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్.
Updated Date - 2023-05-13T17:03:09+05:30 IST