Gold Toilet: 2019లో చోరీకి గురైన రూ.50 కోట్ల విలువ చేసే గోల్డ్ టాయిలెట్.. ఇన్నేళ్ల తర్వాత కేసులో కొత్త ట్విస్ట్
ABN, First Publish Date - 2023-11-07T18:52:06+05:30
అదొక అద్భుతమైన ప్యాలెస్. అందులో రూ.50 కోట్ల విలువ చేసే బంగారపు టాయిలెట్ ఉంది. దాంతో పాటు ఇతర విలాసవంతమైన వస్తువులు కూడా ఉన్నాయి. అందుకే.. చోరీకి గురవ్వకుండా ఎల్లప్పుడూ కాపలాగా సెక్యూరిటీ సిబ్బంది...
అదొక అద్భుతమైన ప్యాలెస్. అందులో రూ.50 కోట్ల విలువ చేసే బంగారపు టాయిలెట్ ఉంది. దాంతో పాటు ఇతర విలాసవంతమైన వస్తువులు కూడా ఉన్నాయి. అందుకే.. చోరీకి గురవ్వకుండా ఎల్లప్పుడూ కాపలాగా సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది. సీసీటీవీ కెమెరాలూ అమర్చబడ్డాయి. ఇంతటి బందోబస్తు ఉన్నప్పటికీ.. కొందరు దొంగలు ఎంతో చాకచక్యంగా ఆ ప్యాలెస్‌లోకి దూరి, ఆ గోల్డెన్ టాయిలెట్‌ని దొంగలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో.. తీవ్ర వివాదాస్పదమైంది. అసలు అలాఎలా దొంగతనం చేశారంటూ సర్వత్రా ప్రశ్నలు రేకెత్తాయి. ఈ ఘటన 2019లో యూకేలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆ గోల్డెన్ టాయిలెట్‌కు ‘అమెరికా’ అనే పేరు పెట్టారు. దీని విలువ 4.8 మిలియన్ పౌండ్‌లు (సుమారు రూ.50 కోట్లకు సమానం). దీనిని ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలన్ తయారు చేశాడు. 18 క్యారెట్ల ఈ బంగారపు టాయిలెట్ ‘ఆర్ట్ ఇన్‌స్టాలేషన్’లో భాగంగా.. బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ఉంచబడింది. 2016లో కూడా న్యూయార్క్‌లోని గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో ఈ టాయిలెట్‌ను ప్రదర్శించారు. అయితే.. 2019లో కొందరు దొంగలు దీనిని ఎంతో తెలివిగా దొంగలించారు. ఆ సమయంలో ఈ దోపిడీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో.. పోలీసులు ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగలిగారు.
ఈ నలుగురు నిందితులపై అభియోగాలు నమోదు చేయబడ్డాయని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) స్పష్టం చేసింది. వారిపై నేరారోపణలు మోపేందుకు అధికారాన్ని మంజూరు చేసినట్లు సీపీఎస్ వెల్లడించింది. వీరిని నవంబర్ 28వ తేదీన ఆక్స్‌ఫర్డ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే.. దొంగతనం ఎలా చేశారన్న వివరాల్ని మాత్రం బయటపెట్టలేదు. అది తమకే సిగ్గుచేటు అవుతుందన్న ఉద్దేశంతో.. అధికారులు వెల్లడించడం లేదు. 2019లో చోటు చేసుకున్న ఈ దోపిడీ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండటం ఆశ్చర్యకరం.
Updated Date - 2023-11-07T19:46:08+05:30 IST