Google: కడుపుతో ఉన్న ఉద్యోగినికి భారీ షాకిచ్చిన గూగుల్.. పనితీరు బాగుందంటూ నివేదిక ఇచ్చాక..
ABN, First Publish Date - 2023-01-22T21:20:09+05:30
గర్భంతో ఉన్న ఓ మహిళ తాజాగా గూగుల్‌లో ఉద్యోగం కోల్పోయారు. తన పరిస్థితి గురించి వివరిస్తూ కేథరిన్ వాంగ్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్‌లో ఉద్యోగాలు కోల్పోయిన పలువురు(Google Layoffs) ఒక్కొక్కరుగా తమ అనుభవాల్ని ప్రపంచం ముందు పెడుతున్నారు. గర్భంతో ఉన్న ఓ మహిళ(Pregnant woman) తాజాగా గూగుల్‌లో ఉద్యోగం కోల్పోయారు. తన పరిస్థితి గురించి వివరిస్తూ కేథరిన్ వాంగ్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు. ఆమె గూగుల్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రసూతి సెలవులు మొదలవుతాయనంగా తన ఉద్యోగం పోయిన విషయం తెలిసిందని చెప్పారు.
తనకే ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక అయోమయంలో పడ్డానని కేథరిన్ వాంగ్ తెలిపారు. తన పనితీరు బాగుందని మేనేజ్‌మెంట్ నివేదిక ఇచ్చిన తరువాత ఇలా జాబ్ కోల్పోవాల్సి వచ్చినందుకు షాకయ్యానని చెప్పారు. ‘‘ఈ వార్తను తట్టుకోలేకపోయా. నా పనితీరు బాగున్నట్టు అంతర్గత సమీక్షలో తేలిన తరువాత కూడా జాబ్ పోవడం ఆశ్చర్యపరిచింది. నాకే ఎందుకు ఇలా జరిగిందన్న ఆలోచన మదిని తొలిచేసింది. ఇప్పుడు నాకు ఎనిమిదో నెల. మరుకొద్ది రోజుల్లో ప్రసూతి సెలవులు మొదలవుతాయనంగా జాబ్ పోయింది’’ అని ఆమె వాపోయారు. అయితే.. ప్రతికూల భావాలను దరి చేరనీయలేదని వాంగ్ చెప్పారు. తన దృష్టంతా బిడ్డపైనే కేంద్రీకరించానని తెలిపారు.
గూగుల్ వ్యవస్థాగతంగా కొన్ని చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగానే పలువురు ఉద్యోగాలు కోల్పోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనుభవం, ప్రతిభ వంటి కొలమానాలకు అతీతంగా తొలగింపుల పర్వం సాగుతున్నట్టు తెలుస్తోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతకు పూనుకున్నా గూగుల్ మాత్రం ఈ విషయంలో నెలల తరబడి ముందడుగు వేయలేదు. ఇటీవలే సిబ్బంది సంఖ్య తగ్గించుకునేందుకే మొగ్గు చూపింది. కృత్రిమ మేధపై(AI) మరింతగా దృష్టి పెట్టేందుకే ఈ తొలగింపులకు దిగాల్సి వచ్చిందని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) పేర్కొన్నారు. గూగుల్ ఉద్యోగుల్లో ఆరు శాతం మంది ఉద్యోగం పోగొట్టుకున్నారని సమాచారం.
Updated Date - 2023-01-22T21:20:10+05:30 IST