Israel-Hamas War: హమాస్‌తో యుద్ధం ముగిశాక గాజాని పాలించేదెవరు.. ఇజ్రాయెల్ ప్రధాని ఏం చెప్పారంటే?
ABN, First Publish Date - 2023-11-12T15:59:28+05:30
Benjamin Netanyahu: ఇన్నాళ్లూ గాజాను హమాస్ పాలించేది. కానీ.. ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్విన తర్వాత హమాస్ కథ కంచికి చేరింది. హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేసేదాకా తగ్గేదే లేదని ఇజ్రాయెల్ భీష్మించుకొని కూర్చుంది కాబట్టి.. హమాస్ స్థానంలో గాజాని ఎవరు పాలిస్తారు?
ఇన్నాళ్లూ గాజాను హమాస్ పాలించేది. కానీ.. ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్విన తర్వాత హమాస్ కథ కంచికి చేరింది. హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేసేదాకా తగ్గేదే లేదని ఇజ్రాయెల్ భీష్మించుకొని కూర్చుంది కాబట్టి.. హమాస్ స్థానంలో గాజాని ఎవరు పాలిస్తారు? అనే ప్రశ్న తలెత్తింది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులు, చేపడుతున్న కఠిన చర్యల దృష్ట్యా.. బహుశా దాన్ని ఇజ్రాయెల్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందేమో? అనే అనుమానాలు రేకెత్తాయి. నిజానికి.. 2007 వరకు గాజా ప్రాంతం ఇజ్రాయెల్ అధీనంలోనే ఉండేది. ఆ తర్వాత అది వెనక్కు తగ్గడంతో.. అక్కడ హమాస్ పాలన మొదలైంది. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో.. హమాస్‌ని అంతం చేసి, గాజాని ఇజ్రాయెల్ మళ్లీ తన అధీనంలోకి తీసుకోవచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే.. తమకు అలాంటి ఆలోచన లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాను పరిపాలించాలన్న ఉద్దేశం తమకు లేదని, అయితే దానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇన్నాళ్లూ పేదరికంలో మగ్గిపోతూ.. దిగ్బంధంలో ఉన్న గాజాను రాడికలిజం నుంచి విముక్తి చేయాలని, ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాల నిలబడే ఒక ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. కాల్పుల విరమణకు ఆయన తిరస్కరించారు. కాల్పుల విరమణ అంటే.. హమాస్‌కి లొంగిపోవడమేనని చెప్పారు. ముందుగా చెప్పినట్టుగా హమాస్‌ని అంతం చేయడమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేసిన ఆయన.. హమాస్‌ని నాశనం చేసేందుకు ఎంత సమయం పట్టినా పర్వాలేదని, దాడుల్ని కొనసాగిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. అయితే.. మిలిటరీ దాడికి సంబంధించి తన వద్ద టైమ్ టేబుల్ లేదని, సైన్యం బాగా పని చేస్తోందని తాను భావిస్తున్నానని అన్నారు.
మరోవైపు.. గత నెల చివర్లో, అంటే యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత అమెరికా సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ‘గాజా నియంత్రణ’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బ్యాంక్‌లో నియంత్రణ కలిగి ఉన్న పాలస్తీనా అథారిటీ.. హమాస్ నుండి గాజా స్ట్రిప్‌పై నియంత్రణను తిరిగి పొందాలని, ఇందుకు అంతర్జాతీయ దేశాల సహకారం తీసుకోవాలని సూచించారు. అయితే.. ఇందుకు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ నెల ప్రారంభంలో బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్‌ను చుట్టుముట్టిన దశాబ్దాల నాటి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ‘సమగ్ర రాజకీయ పరిష్కారం’ దొరికితేనే గాజాలో పాలస్తీనా అథారిటీ అధికారాన్ని చేపట్టగలదని అన్నారు. అంటే.. పాలస్తీనా అథారిటీ కూడా చేతులేత్తేసినట్టే(నా)?
Updated Date - 2023-11-12T15:59:29+05:30 IST