Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఊహించని కోణం.. అందుకు ఇజ్రాయెల్ ప్రధాని సిద్ధమేనా?
ABN, First Publish Date - 2023-11-13T20:04:58+05:30
Benjamin Netanyahu: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో.. అక్కడి సామాన్య ప్రజల జీవితం ఛిద్రమవుతోంది. ఇప్పటికే అక్కడి మరణాల సంఖ్య 11 వేలు దాటింది. అందులో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులే ఎక్కువగా ఉన్నారు.
హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో.. అక్కడి సామాన్య ప్రజల జీవితం ఛిద్రమవుతోంది. ఇప్పటికే అక్కడి మరణాల సంఖ్య 11 వేలు దాటింది. అందులో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. దీంతో.. కొన్ని అంతర్జాతీయ దేశాలు కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బందీల విషయంలో హమాస్‌తో ఒప్పందం కుదిరితే.. ఈ యుద్ధానికి ముగింపు పలకొచ్చన్న కోణంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ బెంజిమన్ నెతన్యాహు ఏం చెప్పారు?
యూఎస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. హమాస్ మిలిటెంట్ల చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయిలీలను విడిపించుకోవడానికి ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన బదులిస్తూ.. బహుశా ఏదైనా ఒప్పందం ఉండొచ్చు అని పేర్కొన్నారు. కానీ.. అందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? అసలు ప్లాన్ ఏంటి? అనే వివరాల్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే, అది కార్యరూపం దాల్చడానికి అన్నే అవకాశాలు ఉంటాయని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు తాము ఆ ఒప్పందం చేసుకుంటాం, ఈ ఒప్పందం చేసుకుంటామంటూ ఎన్నో ఊహాగానాలు వినిపించాయని.. కానీ గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహించాక అంతా మారిపోయిందని చెప్పారు.
ఇదే సమయంలో.. బందీలను విడుదల చేసేవరకూ గాజాలో కాల్పుల విరమణ ఉండదని నెతన్యాహు తేల్చి చెప్పారు. బందీలను విడిపించుకోవడం కోసం ఇజ్రాయెల్ వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. బందీలను సురక్షితంగా విడుదల చేయడానికి గాజాలో పోరాటానికి ‘విరామం’ అవసరమని US వైఖరితో మీరు అంగీకరిస్తారా? అని అడగ్గా.. దాంతో తాము విభేదించడం లేదని, తమ బందీలను సురక్షితంగా బయటకు తీసుకురావాలని చెప్పారు. ఈ లెక్కన.. బందీల కోసం ఒప్పందం జరిగితే మాత్రం, ఈ యుద్ధానికి స్వస్తి పలకొచ్చని ఆయన చెప్పకనే చెప్పేశారు. మరి, ఇది సాధ్యం అవుతుందా? ఒకవేళ ఆస్కారం ఉంటే ఎప్పుడు అవుతుంది? ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి.
మరోవైపు.. గాజాలోని ఒక పాలస్తీనా అధికారి నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖైదీల విడుదలపై ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకోవడంలో జాప్యం అవ్వడానికి, అడ్డంకులు రావడానికి నెతన్యాహునే బాధ్యత వహిస్తాడని మండిపడ్డారు. వాళ్లు బతికే ఉన్నారా? లేక చచ్చారా? అనేది నెతన్యాహుకి అవసరం లేదని.. అతడు కేవలం తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడంపై మాత్రమే శ్రద్ధ వహిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే.. తమ ప్రణాళికల గురించి వివరించడానికి మాత్రం ఆయన నిరాకరించారు. నెతన్యాహులాగే మౌనం పాటించారు.
Updated Date - 2023-11-13T20:04:59+05:30 IST