Israel Hamas Row: మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.. గాజాతో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని సవాల్
ABN, Publish Date - Dec 14 , 2023 | 07:14 PM
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా.. గాజాలోని సామాన్య పౌరులు అన్యాయంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో.. గాజాలో కాల్పుల విరమణకు డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. అటు..
Benjamin Netanyahu: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా.. గాజాలోని సామాన్య పౌరులు అన్యాయంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో.. గాజాలో కాల్పుల విరమణకు డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. అటు.. ఇజ్రాయెల్‌కి మొదటి నుంచి మద్దతు ఇస్తున్న అమెరికా స్వరం కూడా మారింది. అంతేకాదు.. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తక్షణ కాల్పుల విరమణ, బేషరుతుగా బందీల విడుదలను డిమాండ్ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమని ఎవ్వరూ ఆపలేరని, విజయం సాధించేదాకా యుద్ధం కొనసాగించి తీరుతామని పేర్కొన్నారు.
‘‘మాకు అంతర్జాతీయ మద్దతు ఉన్నా, లేకున్నా.. చివరివరకూ పోరాడుతాం. ఈ విషయాన్ని బాధతో చెప్తున్నాను. మమ్మల్ని ఏదీ ఆపలేదు. తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ.. మా సైన్యం గాజాలో పోరు కొనసాగిస్తూనే ఉంది. విజయం సాధించేదాకా ఈ యుద్ధం కొనసాగిస్తాం’’ అని బెంజిమన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఐరాస జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణకు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా అతిపెద్ద పట్టణ కేంద్రమైన గాజా సిటీ, దక్షిణాన ఖాన్ యునిస్, రఫా ప్రాంతాల్లో వైమానిక దాడుల్ని మరింత ఉధృతం చేసింది. అటు.. హమాస్ నుంచి కూడా ప్రతిఘటన తీవ్రస్థాయిలోనే ఉంది. ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో.. 9 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. దీంతో.. ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 115 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలావుండగా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరం మారింది. ఆయన కూడా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా బాంబింగ్ చేస్తోందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కుండబద్దలు కొట్టారు. ఈ వైఖరి వల్లే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతు కోల్పోతోందని హెచ్చరించారు. మిత్రపక్షమైన అమెరికా నుంచి ఈ విమర్శలు వచ్చినప్పటికీ.. ఇజ్రాయెల్ తగ్గేదే లేదంటూ దూసుకుపోతోంది. అటు.. అంతర్జాతీయ మద్దతు ఉన్నా లేకున్నా హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల్పుల విరమణ అనేది హమాస్‌కి బహుమతిగా మారుతుందని, ఈ గ్యాప్‌లో అది మరింత బలపడే అవకాశం ఉందని, అప్పుడు ఇజ్రాయెల్ పౌరులకు అది ప్రమాదంగా మారొచ్చని పేర్కొన్నారు.
Updated Date - Dec 14 , 2023 | 07:14 PM