Israel Hamas War: విజయం సాధించేవరకూ యుద్ధాన్ని ఆపేది లేదు.. ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ABN, First Publish Date - 2023-11-01T17:14:18+05:30
అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు ‘హమాస్’ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో..
అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు ‘హమాస్’ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో.. గాజాలో వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. అటు.. హమాస్ కూడా వీరితో ధీటుగానే తలపడుతోంది. హమాస్‌కి మద్దతుగా దిగిన హిజ్బుల్లా, యెమెన్ హౌతీ రెబెల్స్ రంగంలోకి దిగగా.. వారితోనూ ఇజ్రాయెల్ తలపడుతోంది. అయితే.. ఈ యుద్ధం కారణంగా గాజాలోని సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా.. చిన్న పిల్లలు, మహిళలే ఎక్కువగా చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. గాజా పౌరుల్ని రక్షించేందుకు ఈ యుద్ధానికి తాత్కాలికంగా ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. అటు.. అరబ్ దేశాల నుంచి కూడా ఒత్తిడి వస్తోంది. కానీ.. ఇజ్రాయెల్ మాత్రం ఎవరి మాట వినకుండా తన దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది.
ఈ తరుణంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. విజయం సాధించేదాకా తాము ఈ యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. తాము సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయని, ఈ క్రమంలో బాధాకరమైన నష్టాలు కూడా ఉన్నాయని అన్నారు. ప్రతీ సైనికుడు తమకు ‘ప్రపంచం’తో సమానమని పేర్కొన్న ఆయన.. తాము గెలుపొందే దాకా తలపడుతూనే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్‌లో భాగంగా 11 ఇజ్రాయెల్ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వెల్లడించిన తర్వాత బెంజిమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే.. హమాస్‌ని సర్వనాశనం చేయాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యుద్ధం మొదలైన ప్రారంభంలోనూ బెంజిమన్ ఇలాంటి ప్రతిజ్ఞే చేశారు. హమాస్‌ని అంతమొందించేదాకా తాము విశ్రాంతి తీసుకోబోమని, తమతో పెట్టుకొని హమాస్ క్షమించరాని తప్పు చేసిందని అప్పట్లో వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన హమాస్ 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించి ఇజ్రాయెల్‌లో విధ్వంసం సృష్టించింది. భూమి, వాయు, జల మార్గాల ద్వారా ఆ దేశంలోకి ప్రవేశించి.. సైనికులు, సామాన్య పౌరుల్ని చంపింది. ఈ దాడుల్లో 1400 మంది మృతి చెందారు. అంతేకాదు.. వందలాది మందిని అపహరించుకుపోయారు. దీంతో.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. హమాస్‌ని అంతం చేయాలన్న ఉద్దేశంతో.. లక్షల మంది సైనికుల్ని రంగంలోకి దింపింది. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో.. సుమారు 10 వేల మంది గాజా పౌరులు మరణించినట్టు తెలిసింది. గాజాలోని కొన్ని ప్రాంతాలు శవాలదిబ్బగా మారాయి.
Updated Date - 2023-11-01T17:14:18+05:30 IST