Donald Trump: భారత్‌కు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్.. తాను అధ్యక్షుడినైతే ‘వాతలు’ పెడ్తానని వార్నింగ్
ABN, First Publish Date - 2023-08-21T16:06:04+05:30
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. భారత్ ఉత్పత్తులపై భారీ పన్ను విధిస్తానని కుండబద్దలు కొట్టారు. ఫాక్స్ బిజినెస్‌కు చెందిన లారీ కుడ్లోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ట్రంప్ ఆ సంచలన ప్రకటన చేశాడు. కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై, ప్రత్యేకించి హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై భారత్ అధిక పన్ను విధిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా భారతదేశాన్ని ‘టారిఫ్ కింగ్’గా ట్రంప్ అభివర్ణించారు. అంతేకాదు.. 2019 మే నెలలో తమ మార్కెట్లకు న్యాయమైన మార్గంలో సహేతుకమైన యాక్సెస్ ఇవ్వలేదని ఆరోపిస్తూ.. అమెరికాలో భారతదేశానికి ప్రాధాన్యతనిచ్చే ‘జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్’ (GSP)ను రద్దు చేశాడు కూడా!
ఇప్పుడు మరోసారి భారత్ విధిస్తున్న అధికపన్ను విధానాన్ని లేవనెత్తుతూ.. ఆ దేశంలో పన్ను రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డాడు. ఏకరూప పన్ను ఉండాలని తాను కోరుకుంటున్నానని.. కానీ హార్లే డేవిడ్సన్ వంటి వాటిపై భారత్ 100 నుంచి 200 శాతం వరకు పన్ను విధిస్తోందని పేర్కొన్నాడు. భారతదేశం కూడా మోటార్ బైక్‌లని తయారు చేస్తోందని.. కానీ వాటిపై ఎలాంటి సుంకాలు విధించకుండానే అమెరికాలో విక్రయిస్తోందని తెలిపాడు. కానీ.. అమెరికాలో తయారుచేసే హార్లేపై మాత్రం భారత్ భారీ స్థాయిలో ట్యాక్స్ విధిస్తోందన్నాడు. భారత్ తమతో సరిగ్గా బిజినెస్ చేయడం లేదని, వారి దేశంలో హార్లే ప్లాంట్ నిర్మించాలని ఆ దేశం కోరుకుంటోందని, అప్పుడు అక్కడ ఏ సుంకాలు ఉండవని చెప్పుకొచ్చాడు. తమ ఉత్పత్తులపై భారత్ 200 శాతం దాకా పన్నులు విధిస్తున్నప్పుడు.. తాము కూడా అదే స్థాయిలో భారత్ ఉత్పత్తులపై పన్నులు విధించాలని అభిప్రాయపడ్డాడు.
ఇదే సమయంలో బ్రెజిల్ దేశం కూడా అమెరికా ఉత్పత్తులపై భారీ పన్నులు విధిస్తోందని ట్రంప్ పేర్కొన్నాడు. పెన్సిల్వేనియాలో ఒక సెనేటర్ ఉన్నాడని.. భారత్ ఉత్పత్తులపై పన్ను విషయం మీద అతనితో చర్చించినప్పుడు కనీసం 10 శాతం టాక్స్ విధించడం కూడా ‘ఫ్రీ ట్రేడ్’ కాదని జవాబిచ్చాడన్నారు. దీన్ని ఆ దేశంతో జరుగుతున్న బిజినెస్‌లో ఏదో తప్పు ఉందన్న విషయాన్ని గ్రహించవచ్చని ట్రంప్ అన్నారు. దీన్ని ప్రతీకారమని పిలవండి లేక మరే ఇతర పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి గానీ.. భారత్ మనకు చార్జ్ చేస్తున్నప్పుడు, మనం కూడా వారి ఉత్పత్తులపై పన్ను విధించాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.
Updated Date - 2023-08-21T16:06:04+05:30 IST