Israel-Hamas War: గాజాపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు పిలుపు.. ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన ఇజ్రాయెల్
ABN, First Publish Date - 2023-11-11T18:50:24+05:30
Emmanuel Macron: హమాస్‌ని అంతమొందించాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల కారణంగా.. గాజాలోని సామాన్య ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. అరబ్ దేశాలతో పాటు కొన్ని ప్రపంచ దేశాలు సైతం సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ)కు పిలుపునిస్తున్నాయి.
హమాస్‌ని అంతమొందించాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల కారణంగా.. గాజాలోని సామాన్య ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. అరబ్ దేశాలతో పాటు కొన్ని ప్రపంచ దేశాలు సైతం సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ)కు పిలుపునిస్తున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ఆపాలని కోరుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ కూడా ఈ జాబితాలో చేరింది. గాజాలో సామాన్య ప్రజల బతుకు ఛిద్రమవుతున్న తరుణంలో.. ఇజ్రాయెల్ దాడుల్ని ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ పిలుపునిచ్చారు. అయితే.. ఇందుకు ఇజ్రాయెల్ ఊహించని రెస్పాన్స్ ఇచ్చింది.
ఇంతకీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఏం చెప్పారు?
ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేక్రాన్ మాట్లాడుతూ.. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఈ దాడుల కారణంగా గాజాలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి జీవితాలు ముఖ్యమైనవన్న విషయాన్ని ఇజ్రాయెల్ గుర్తించాలన్నారు. కాల్పుల విరమణ ఇజ్రాయెల్‌కు ప్రయోజనం చేకూరుస్తుందన్న ఆయన.. ఉగ్రవాద చర్యలను ఫ్రాన్స్ ఏమాత్రం సహించదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు తనని తాను రక్షించుకునే హక్కు ఉందని, అయితే అదే సమయంలో గాజాలో జరుపుతున్న బాంబు దాడుల్ని ఇజ్రాయెల్ ఆపాలని తాము కోరుతున్నామని వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ కోసంతో యూఎస్, బ్రిటన్ కూడా తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందన
అయితే.. ప్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ‘సీజ్‌ఫైర్’ పిలుపుపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. కాల్పుల విరమణ అంటే, హమాస్‌కి లొంగిపోవడమేనని అన్నారు. పౌరుల మరణాలకు హమాస్‌దే బాధ్యత అని, ఇజ్రాయెల్‌ది కాదని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌ని కాదు, హమాస్ చర్యల్ని ఖండించాలని డిమాండ్ చేశారు. తమపై హమాస్ పాల్పడుతున్న నేరాలు.. రేపు పారిస్, న్యూయార్క్‌లలో కూడా జరగొచ్చని హెచ్చరించారు. అంతకుముందు కూడా.. పాలస్తీనా భూభాగాన్ని తిరిగి ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేయలేదని, అయితే దానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. దిగ్బంధంలో ఉన్న భూభాగం తప్పనిసరిగా పునర్నిర్మించబడాలని చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి హమాస్ బీజం వేయగా.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్ చేసిన దాడుల్లో 1400 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ఇప్పటివరకూ 11 వేల మంది మృతి చెందారు. ఇంకా వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. అటు.. ఇజ్రాయెల్ తన దాడుల్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది కాబట్టి, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో.. అక్కడి ప్రజలు తమ ప్రాణాల్ని అరచేతిలో పట్టుకొని బతుకుతున్నారు.
Updated Date - 2023-11-11T18:50:26+05:30 IST