Israel-Hamas War: ఇజ్రాయెల్‌కి హమాస్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేయకపోతే బందీలు ప్రాణాలతో మిగలరు
ABN, First Publish Date - 2023-12-11T19:53:06+05:30
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఇటీవల వారం రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఇరువర్గాలు.. ఇప్పుడు మళ్లీ ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా..
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఇటీవల వారం రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఇరువర్గాలు.. ఇప్పుడు మళ్లీ ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా.. ఇజ్రాయెల్ అయితే హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో భీకర దాడులకు దిగుతోంది. సామాన్య ప్రజలు అన్యాయంగా చనిపోతున్నా.. లెక్క చేయకుండా తన దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఉత్తర గాజాలో భూతల పోరాటం ఉద్ధృతం చేయగా.. దక్షిణ గాజాలో బాంబుల మోత మోగించేస్తోంది. ఈ నేపథ్యంలోనే హమాస్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ డిమాండ్లని నెరవేర్చకపోతే.. ఇజ్రాయెల్ బందీల్ని సజీవంగా ఉంచమంటూ బెదిరింపులకు పాల్పడింది.
‘‘పరస్పర ఖైదీల విడుదల, నిర్దిష్ట చర్చల విషయంలో మా డిమాండ్లు నెరవేరకపోతే.. ఫాసిస్ట్ శత్రువు (ఇజ్రాయెల్), దాని దురహంకార నాయకత్వం లేదా మద్దతుదారులు ఇజ్రాయెల్ బందీలను సజీవంగా తమ స్వదేశానికి తీసుకువెళ్లలేరు’’ అని ఆదివారం హమాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే.. ఇజ్రాయెల్ ఈ బెదిరింపుల్ని పెద్దగా పట్టించుకోలేదు. సోమవారం కూడా గాజాపై ఆ దేశం బాంబుల వర్షం కురిపించింది. తన దాడుల్ని మరింత పెంచుతూ గాజాపై విరుచుకుపడుతోంది. ఇదే సమయంలో.. హమాస్ ముగింపు దగ్గరపడిందని, హమాస్ మిలిటెంట్లు వెంటనే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. లేకపోతే నామరూపాల్లేకుండా హమాస్‌ని అంతం చేస్తామని మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
గాజాలో హమాస్ చెరలో 137 మంది బందీలు ఉండగా.. 7 వేల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. అక్టోబర్ 7న హమాస్ జరిపిన ఉగ్రదాడుల కారణంగా ఇజ్రాయెల్ పౌరులు 1200 మంది చనిపోగా.. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా గాజాలోని పాలస్తీనియన్లు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకూ 17,900 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని సమాచారం. మరోవైపు.. కాల్పుల విరమణను చేపట్టాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కు తగ్గడం లేదు. అటు.. కాల్పుల విరమణ కోసం యునైటెడ్ నేషన్స్‌లో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంతో, ఇజ్రాయెల్ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఈ దాడుల దెబ్బకు గాజాలోని 1.9 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి పారిపోయారు.
Updated Date - 2023-12-11T19:53:07+05:30 IST