Israeli music festival: మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ బుల్లెట్ల వర్షం... 260 మంది మృతి
ABN, First Publish Date - 2023-10-09T14:51:29+05:30
ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం భీకరరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత శనివారం రాత్రి హమాస్ ఉగ్రవాదుల గాజా సరిహద్దు సమీపంలోని రూరల్ ఏరియాలో మ్యూజిక్ ఫెస్టివల్ పై విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులతో బీభత్స సృష్టించారు. ఈ కాల్పుల్లో 260కి పైగా మృతిచెందారు.
జెరూసెలాం: ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం భీకరరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. గత శనివారం రాత్రి హమాస్ ఉగ్రవాదుల గాజా సరిహద్దు సమీపంలోని రూరల్ ఏరియాలో మ్యూజిక్ ఫెస్టివల్ (Music festival) పై విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులతో బీభత్స సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫెస్టివల్ ప్రాంతాన్ని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టిన హమాస్ ఉగ్రవాదులు కనిపించిన వారిని పిట్టల్లా కాల్చిచంపేశారు. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. ఘటనా ప్రాంతంలో అనేక మృతదేహాలు రక్తం మడుగుల్లో చెల్లాచెదురుగుగా పడి ఉన్నారు. 260 మృతదేహాలను ఇంతవరకూ పారామెడికల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది.
సోషల్ మీడియాలో భయానక వీడియోలు
హమాస్ ఉగ్రవాదులు మ్యూజిక్ ఫెస్టివల్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వందలాది మందిని పొట్టనపెట్టుకున్న ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా పోస్ట్ కావడం సంచలనమవుతోంది. అరుపులు, కేకలు, భయంతో పరుగులు తీస్తున్న జనంతో పండుగ వాతావరణం కాస్తా భయానకంగా మారినట్టు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. ఒక యువతిని మోటారుబైక్‌పై యువకుడు ఒకరు అపహరించుకుపోవడం, భయంతో పరుగులు తీస్తున్న వారు సొంత కారుల్లో కాకుండా కనిపించిన కారల్లో చేరి బుల్లెట్ల బారి నుంచి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేయడం వంటి దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు తమకు ఎదురైన అనుభవం చెబుతూ నిలువెల్లా వణికిపోతున్నారు. తాము 20 మంది సభ్యులతో సుమారు 6 గంటల సేపు పొదల్లో దాక్కున్నామని, అందరూ సైలెంట్‌గా ఉండాలని ఒకరికి ఒకరికి అప్రమత్తం చేసుకుంటూ భయంగుప్పిట్లో గడిపాడమని ఉత్సవానికి హాజరైన ఒక మహిళ ఎన్‌బీసీ వార్తా సంస్థకు తెలిపింది. ఉగ్రవాదులు జనాల ప్రాణాలు తీస్తూ, కార్లు తగులబెడుతూ బీభత్సం సృష్టించారని, ఎక్కడ చూసినా అవే ఘటనలు కనిపించాయని, నోటి నుంచి శబ్దం వస్తే ఇక ప్రాణాలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపించిందని ఆమె వాపోయింది.
Updated Date - 2023-10-09T15:05:45+05:30 IST