Iceland Earthquakes: 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఐస్‌ల్యాండ్
ABN, First Publish Date - 2023-11-11T16:18:59+05:30
Iceland: మన ప్రపంచ చరిత్రలో ఎన్నో విపత్తులు సంభవించాయి. భారీ భూకంపాలు, ప్రళయాలు వంటివి చాలా చోటు చేసుకున్నాయి. కానీ.. కేవలం 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవించడాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ విపత్కర పరిణామం ఐరోపాకు చెందిన ద్వీప దేశం ఐస్‌లాండ్‌లో వెలుగు చూసింది.
మన ప్రపంచ చరిత్రలో ఎన్నో విపత్తులు సంభవించాయి. భారీ భూకంపాలు, ప్రళయాలు వంటివి చాలా చోటు చేసుకున్నాయి. కానీ.. కేవలం 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవించడాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ విపత్కర పరిణామం ఐరోపాకు చెందిన ద్వీప దేశం ఐస్‌లాండ్‌లో వెలుగు చూసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస భూ ప్రకంపనాల కారణంగా ఆ ప్రాంతం వణికిపోయింది. ఈ దెబ్బకు ఎంతో ఆస్తినష్టం జరిగింది. దీంతో.. మరో దారి లేక ఆ దేశం ‘అత్యవసర పరిస్థితి’ (ఎమర్జెన్సీ)ని ప్రకటించింది.
తొలుత శుక్రవారం తెల్లవారుజామున ఐస్‌లాండ్‌లో భూ కంపించింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రకంపనాల పర్వం కొనసాగింది. శుక్రవారం సాయంత్రం రాజధాని నగరం రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు బలమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపాల తీవ్రత 5.2గా నమోదైంది. ఈ దెబ్బకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో.. అధికారులు ఆ ప్రాంతంలో రాకపోకల్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే.. ‘‘జాతీయ పోలీసు చీఫ్ పౌర రక్షణ కోసం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు’’ అని సివిల్ ప్రొటెక్షన్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. మరింత పెద్ద భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని, ఫలితంగా భారీ విస్ఫోటనానికి దారి తీయొచ్చని కూడా హెచ్చరించింది.
రానున్న రోజుల్లో అగ్నిపర్వత విస్ఫోటం సంభవించే ప్రమాదం ఉందని ఐస్‌లాండ్ వాతావరణ విభాగం కూడా అంచనా వేసింది. దాదాపు ఐదు కిలోమీటర్ల లోతులో శిలాద్రవం భూగర్భంలో పేరుకుపోయిందని.. అది ఉపరితలం వైపు కదలడం ప్రారంభిస్తే, అగ్నిపర్వత విస్ఫోటనానికి దారితీయవచ్చని పేర్కొంది. అయితే.. శిలాద్రవం పైకి చేరడానికి రోజుల సమయం పడుతుందని, కాబట్టి ఆలోపే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచించింది. మరోవైపు.. గ్రిండావిక్ ప్రాంతంలోనూ భూకంపం రావడంతో.. అక్కడ నివసిస్తున్న 4 వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పరస్థితులు గంభీరంగా ఉన్నప్పటికీ.. ప్రజల ప్రాణాల్ని రక్షించాలన్న ఉద్దేశంతో అధికారులు తరలింపు కార్యక్రమం చేపట్టారు.
ఇదిలావుండగా.. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ఐస్‌లాండ్‌లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు చోటు చేసుకోవడం సాధారణమే. అక్కడ 33 క్రియాశీలక అగ్నిపర్వత వ్యవస్థలున్నాయి. 2010లో ఈ ద్వీపానికి దక్షిణాన ఉన్న ఐజాఫ్జల్లాజోకుల్‌లో అగ్నిపర్వతం వద్ద భారీ విస్ఫోటనం సంభవించడంతో.. 1,00,000 విమినాల్ని రద్దు చేశారు. దాంతో 10 మిలియన్ మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. అక్టోబర్ నెల ఇప్పటిదాకా (40 రోజుల్లో) ఈ ద్వీప దేశంలో 24 వేల భూకంపాలు నమోదయ్యాయంటే.. అక్కడి పరిస్థితులేంటో మీరే అర్థం చేసుకోండి. అయితే.. 14 గంటల వ్యవధిలో ఇలా 800 సార్లు భూప్రకంపనలు సంభవించడం మాత్రం ఇదే తొలిసారి.
Updated Date - 2023-11-11T16:19:00+05:30 IST