Israel-Hamas War: గాజాకు ఇజ్రాయెల్ బిగ్ వార్నింగ్.. అప్పటివరకూ నీళ్లు, విద్యుత్ రావు
ABN, First Publish Date - 2023-10-12T16:51:49+05:30
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్విందా? ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఆ ప్రశ్నలకు అవుననే సమాధానమే...
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్విందా? ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఆ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మెరుపుదాడులు చేసి ఇజ్రాయెల్‌కి షాక్ ఇవ్వాలని అనుకున్న హమాస్ ఇప్పుడు తనే పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది. ఇజ్రాయెల్‌ని కెలికి తన చావును తానే కొని తెచ్చుకుంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే తమపై దాడి చేయడంతో తీవ్రంగా మండిపడ్డ ఇజ్రాయెల్.. హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న దిశగా దూసుకుపోతోంది.
ఇప్పటికే ఇజ్రాయెల్ వైమానిక దళాలు హమాస్ రహస్య స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. బిల్డింగులు, యూనివర్సిటీలు, మసీదులు.. ఇలా హమాస్ మిలిటెంట్లు ఎక్కడున్నా సరే, ఆ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. దీంతో.. గాజా మొత్తం చెత్త దిబ్బలాగా మారిపోయింది. యుద్ధానికి ముందు వరకూ అందమైన నగరంగా విరాజిల్లిన గాజా.. ఇప్పుడు శవాలదిబ్బ, చెత్తకుప్పగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్‌ని విడిచిపెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ఈ తరహా దాడులకు దిగింది. దీనికితోడు గాజాపై ఎన్నో ఆంక్షలు విధించింది. విద్యుత్, ఆహారం, ఇంధన సరఫరాలను నిషేధించింది. ఇప్పుడు తాజాగా గాజాకు ఇజ్రాయెల్ మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది.
కిడ్నాప్ చేసిన తమ ఇజ్రాయెల్ పౌరుల్ని విడిచిపెట్టేంతవరకూ గాజాలోకి ప్రాథమిక వనరులు లేదా మానవతా సహాయాన్ని తమ దేశం అనుమతించబోదని ఇజ్రాయిలీ ఇంధన మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ గురువారం తేల్చి చెప్పారు. ‘‘గాజాకు మానవతా సహాయం అందించడమా? ఛాన్సే లేదు. ఇజ్రాయెల్ నుంచి అపహరించుకుపోయిన ఇజ్రాయిలీ పౌరుల్ని తిరిగి స్వదేశానికి పంపే వరకు గాజాలో విద్యుత్ ఉండదు. నీళ్లు కూడా అందించబడవు. ఇంధన ట్రక్కు కూడా గాజాలోకి ప్రవేశించదు’’ అంటూ ఒక ప్రకటనలో తెలిపారు. హమాస్ తమతో యుద్ధానికి దిగి చాలా పెద్ద తప్పు చేసిందన్న ఆయన.. ఈ గ్రూపుకు ఇదే ఆఖరి యుద్ధం కాబోతుందని కూడా హెచ్చరించారు.
కాగా.. గాజా ఇప్పటికే అంధకారంలో ఉంది. బుధవారం గాజాలో ఏకైక విద్యుత్ కేంద్రం పనిచేయడం ఆగిపోవడంతో.. అక్కడి ప్రజలందరూ విలవిల్లాడుతున్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి తమ మీదకు రాకెట్ వచ్చిపడుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ఎన్నో ఆంక్షలు విధించినా, బాంబుల వర్షం కురిపిస్తున్నా హమాస్ వెనక్కు తగ్గడం లేదు. ఆ సంస్థ సైతం ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడి చేస్తూనే ఉంది. దీంతో.. ఈ యుద్ధంలో ఇరువైపులా 3 వేల మందికి పైగా ప్రజలు మృది చెందారు.
Updated Date - 2023-10-12T16:51:49+05:30 IST