ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనకు వైద్య నోబెల్
ABN, First Publish Date - 2023-10-03T02:12:30+05:30
ప్రపంచాన్ని కొవిడ్ మహమ్మారి వణికిస్తున్న వేళ.. పాశ్చాత్య దేశాల ప్రజల ప్రాణాలు కాపాడిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల తయారీలో కీలకపాత్ర పోషించే పరిశోధనలు....
శాస్త్రవేత్తలు కాటలిన్ కారికో, డ్రూ వైస్‌మాన్‌కు
సంయుక్తంగా ప్రకటించిన నోబెల్ కమిటీ
వారి పరిశోధన ఆధారంగానే కరోనాకు టీకా
వైద్యనోబెల్ అందుకున్న 13వ మహిళ కాటలిన్
స్టాక్‌హోమ్, అక్టోబరు 2: ప్రపంచాన్ని కొవిడ్ మహమ్మారి వణికిస్తున్న వేళ.. పాశ్చాత్య దేశాల ప్రజల ప్రాణాలు కాపాడిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల తయారీలో కీలకపాత్ర పోషించే పరిశోధనలు చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలను ఈ ఏటి వైద్య నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ డ్రూ వైస్‌మాన్(64), హంగరీకి చెందిన శాస్త్రవేత్త కాటలిన్ కారికో (68)ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ సెక్రటరీ థామస్ పెర్ల్‌మాన్ ప్రకటించారు. టీకా రూపంలో మన శరీరంలోకి ప్రవేశించిన మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ(ఎంఆర్‌ఎన్‌ఏ)పై రోగనిరోధక వ్యవస్థ దాడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో కనుగొన్నందుకు..మరీ ముఖ్యంగా కొవిడ్ ప్యాండమిక్ గతినే మార్చేయడంలో కీలకపాత్ర పోషించినందుకు వీరికి ఈ గౌరవం దక్కింది. వీరిద్దరూ 1990ల్లో.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పనిచేస్తున్నప్పుడు కలిశారు. ఒక సమావేశం కోసం తమ పరిశోధన పత్రాలను ఫొటోకాపీ తీయించుకోవడం కోసం ఒకేసారి వెళ్లారు. మాటల మధ్యలో ఇద్దరూ ఒకే అంశం మీద పరిశోధన చేస్తున్నట్టు తెలిసింది. అప్పటికే ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై కొంతవరకూ పరిశోధన చేసిన కాటలిన్.. ఒక సమస్య వల్ల ఆ రిసెర్చ్‌ను ముందుకు కొనసాగించలేకపోయారు. ఇమ్యూనాలజిస్ట్ అయిన డ్రూ వైస్‌మాన్ ఆ సమస్యను పరిష్కరించారు. ఆ పరిశోధనలే.. కొవిడ్‌కు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను తయారు చేయడంలో ఉపకరించాయి. అందుకే నోబెల్ కమిటీ వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ‘‘మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏలు మన రోగనిరోధక వ్యవస్థతో ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి వారిద్దరూ కలిసి చేసిన రిసెర్చ్ ఉపయోగపడింది. అంతేకాదు.. ఆధునిక యుగంలో మానవాళి ఎదుర్కొన్న ప్రమాదకరమైన అపాయాన్ని ఎదుర్కొనే క్రమంలో మునుపెన్నడూ ఎరుగని వేగంతో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించింది’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా చికిత్స చేయవచ్చని పేర్కొంది. డిసెంబరు 10న స్టాక్‌హోంలో జరిగే వేడుకలో వీరిద్దరూ ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.
పనికిమాలిన పరిశోధన అన్నారు..
కరోనాపై పోరుకు అమెరికా తదితర అగ్రరాజ్యాలు ఎంచుకున్న అస్త్రం ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ. కానీ, కరోనాపై పోరులో అంతగా ఉపయోగపడుతున్న ఈ టెక్నాలజీని ఒకప్పుడు తిరస్కరించారని తెలుసా? దానిపై పరిశోధనలు చేసిన కాటలిన్ కారికోకు ప్రమోషన్‌కు బదులు డిమోషన్ ఇచ్చారు తెలుసా? ఇలా ఎన్ని అడ్డంకులెదురైనా ఆమె పట్టు వీడకుండా ప్రయోగాలను పూర్తిచేశారు. సరిగ్గా పాతికేళ్ల తర్వాత వాటి ఫలాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగపడ్డాయి. ఆ కథేంటంటే.. హంగరీకి చెందిన కాటలిన్.. 1985లో తన కారును, ఇతర వస్తువులను అమ్మేయగా వచ్చిన 1200 అమెరికా డాలర్లతో భర్త, రెండేళ్ల కూతురితో కలిసి అమెరికా చేరుకున్నారు. పెన్సిల్వేనియా వర్సిటీలో అధ్యాపకురాలిగా చేరి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. 1995లో 40వ పడిలో ఉన్న కాటలిన్.. భవిష్యత్‌లో రానున్న కొత్త వైర్‌సలను ఎదుర్కొనేలా ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనలు సాగించారు. ఎంతో ముందు చూపుతో ఆమె ప్రారంభించిన ప్రయోగాలు, పరిశోధనలకు సాయం అందకపోగా.. ఛీత్కారాలు, విమర్శలు ఎదురయ్యాయి.
ఏంటీ టెక్నాలజీ?
మన శరీరం సజీవంగా, ఆరోగ్యంగా ఉండడానికి కోట్లాది సూక్ష్మ ప్రొటీన్లపై ఆధారపడి ఉంటుంది. కణాలు ఏ ప్రొటీన్లను తయారుచేయాలో చెప్పడానికి ఎంఆర్‌ఎన్‌ఏ(అంటే మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ)ను ఉపయోగించుకుంటుంది. ఆ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యవస్థను హైజాక్ చేస్తే.. అంటే శరీరానికి బదులు మనమే కృత్రిమ మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏలను ఉపయోగించి శరీరంలో మనకు కావాల్సిన ప్రొటీన్లను, యాంటీబాడీలను, ఎంజైములను ఉత్పత్తి చేసుకోగలిగితే? అరుదైన వ్యాధులను రివర్స్ చేయగలిగే ఎంజైమ్స్‌ని, దెబ్బ తిన్న గుండె కణాలను బాగు చేసే గ్రోత్ ఏజెంట్స్‌ను, ఇన్ఫెక్షన్లపై పోరాడే యాంటీబాడీలను.. దేన్ని కావాలంటే దాన్ని తయారు చేసుకోవచ్చు. అదే ఊహ డాక్టర్ కాటలిన్ కారికోకు వచ్చింది. దీంతో, తన బృందంతో కలిసి ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనలు చేశారామె. కానీ, సమస్య ఏమిటంటే శరీరంలోకి ప్రవేశించే సింథటిక్ ఎంఆర్‌ఎన్‌ఏపై రోగనిరోధక వ్యవస్థ తీవ్ర దాడి చేస్తుంది. అది మనం నిర్దేశించిన కణాల వద్దకు చేరుకునేలోపే ధ్వంసం చేసేస్తుంది. దీన్ని కారణంగా చూపి ఆమె పరిశోధనకు వర్సిటీ అధికారులు నిధులు ఆపేశారు. ఆమె పరిశోధనల కోసం అవసరమైన గ్రాంట్లను విడుదల చేయలేదు. అలా దాదాపు ఆరేళ్లు గడిచిపోయాయి. పెన్సిల్వేనియా వర్సిటీ అధికారులు ఆమెను ప్రొఫెసర్ స్థాయి నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ ర్యాంకుకు డిమోట్ చేశారు. అలాంటి సందర్భాల్లో బలహీన మనస్కులైతే తమ పరిశోధనలకు అక్కడితో చుక్క పెట్టేసేవారు. కానీ, కారికో వెనుకంజ వేయకుండా.. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో పదేళ్లపాటు తన అధ్యయనాన్ని కొనసాగించారు. ఆమె పట్టుదలకు డాక్టర్ డ్రూ వెస్‌మాన్ రూపంలో ఒక అండ దొరికింది. రోగనిరోధక వ్యవస్థ ఎంఆర్‌ఎన్‌ఏపై ఎందుకు దాడి చేస్తోందనే అంశంపై ఆయన దృష్టి సారించారు. సాధారణంగా ఎంఆర్‌ఎన్‌ఏలో నాలుగు మాలిక్యులార్ బిల్డింగ్ బ్లాకులు ఉంటాయి. కృత్రిమంగా దాన్ని మార్చినప్పుడు ఆ నాలుగు బ్లాకుల్లో ఒకటి రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నట్టు గుర్తించారు. ఆ మాలిక్యూల్ పనిచేయకుండా చేయడం ద్వారా సమస్యను అధిగమించారు. వారు రూపొందించిన కృత్రిమ ఎంఆర్‌ఎన్‌ఏ.. రోగనిరోధక వ్యవస్థకు తెలియకుండా తన పని తాను చేయగలిగింది. అలా 2005 నాటికి వారి పరిశోధనలు విజయవంతమయ్యాయి. అంటే.. 1995లో కాటలినా కారికో మొదలుపెట్టిన పరిశోధన ఫలవంతం కావడానికి పదేళ్లు పట్టిందన్నమాట. ఆ తర్వాత కూడా దాని ఉపయోగం ఏమిటో చాలా మందికి తెలియలేదు. కరోనా కల్లోలం సమయంలో.. ఫైజర్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించాక.. సత్వరమే టీకా తయారుచేయడం కోసం గత అధ్యయనాలపై దృష్టిసారించారు. అప్పుడు కాటలిన్ పరిశోధన వారిని ఆకర్షించింది. అలా అది వెలుగులోకి వచ్చింది. దరిమిలా, కాటలిన్ కూడా.. బయోఎన్‌టెక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ హోదాలో.. ఫైజర్‌తో కలిసి టీకా తయారీలో పాలుపంచుకున్నారు. 2022 దాకా ఆమె బయోఎన్‌టెక్‌లో ఉన్నారు. ఇప్పటిదాకా వైద్య నోబెల్ అందుకున్న మహిళల సంఖ్య 12. కారికో 13వ మహిళగా చరిత్ర సృష్టించారు.
మా అమ్మ కోరిక నెరవేరింది
తనకు నోబెల్ పురస్కారం రావడం పట్ల కాటలిన్ కారికో హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ పురస్కారం వస్తుందన్న నమ్మకం తన తల్లికి ఉండేదని.. నోబెల్ ప్రకటనలు వచ్చినప్పుడల్లా తన పేరు వస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూసేదని ఆమె పేర్కొన్నారు. ‘‘ఇలా ప్రతి ఏటా నోబెల్ ప్రైజ్ అనౌన్స్‌మెంట్లను మా అమ్మ ఆశగా వినేది. కానీ దురదృష్టవశాత్తూ ఐదేళ్ల క్రితం.. 89 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది. ఇప్పుడు పై నుంచి వింటూ ఉండొచ్చు’’ అని భావోద్వేగంతో తెలిపారు. ‘‘నోబెల్ కమిటీ నుంచి ఫోన్ వచ్చినప్పుడు అస్సలు నమ్మలేకపోయాను. కానీ, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది’’ అని కారికో తెలిపారు.
జీవితకాల స్వప్నం నెరవేరింది
నోబెల్ బహుమతి తన జీవితకాల స్వప్నమని.. ఇప్పుడది నెరవేరడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని డ్రూవై్‌సమాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఆర్‌ఎన్‌ఏ గురించి చాలామందికి ఏమీ తెలియని సమయంలోనే మేం దానిపై పరిశోధనలు చేశాం. ఇరవై సంవత్సరాలుగా.. దానిపైనే మాట్లాడుకున్నాం. చర్చించుకున్నాం’’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.
Updated Date - 2023-10-03T02:12:30+05:30 IST