Mexico Aliens: మెక్సికో ఏలియన్స్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. స్కానింగ్‌లో ఏం తేలిందంటే?
ABN, First Publish Date - 2023-09-20T15:57:17+05:30
ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు మెక్సికన్ పార్లమెంట్‌లో మానవేతర అవశేషాలను పేర్కొంటూ రెండు వింత ఆకారాలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్...
ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు మెక్సికన్ పార్లమెంట్‌లో మానవేతర అవశేషాలను పేర్కొంటూ రెండు వింత ఆకారాలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. ఇవి నిజంగానే ఏలియన్సా? కాదా? అనే అంశంపై లోతుగా పరిశీలించడానికి.. మెక్సికో సిటీలోని వైద్యులు హై టెక్నాలజీని ఉపయోగించారు. ఎక్స్-రే, సీటీ స్కాన్‌లు నిర్వహించగా.. సంచలన రహస్యాలు బయటపడ్డాయి. కొందరు ఆరోపించినట్లు ఇది తయారుచేయబడిన లేదా తారుమార చేయబడిన శరీరాలు కావని రిపోర్ట్‌లో వెల్లడైంది. ఈ అవశేషాలను పరిశీలించిన నావల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జోస్ డి జీసస్ జూల్స్ బెనిటెజ్ మాట్లాడుతూ.. ఈ మృతదేహాలు తయారు చేయబడలేదని అన్నారు. అవి ఒకే అస్థిపంజరంలోని భాగాలని, ఇతర ముక్కలతో అనుసంధానించబడలేదని స్పష్టం చేశాడు.
కాగా.. మెక్సికన్ పార్లమెంట్‌లో ఏలియన్ శరీరాలంటూ ఈ అవశేషాల్ని ప్రదర్శించడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగాయి. అవి నిజమైన ఏలియన్ బాడీస్ కావని.. జంతువులు లేదా మానవ ఎముకలను ఉపయోగించి, కృత్రిమంగా తయారు చేశారని అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విద్యావేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు సైతం.. ఆ రెండు అవశేషాలు, మమ్మీ చేయబడిన మానవుల పురాతన అవశేషాలు అయ్యుండొచ్చని పేర్కొన్నారు. తనని తాను గ్రహాంతర నిపుణుడిగా చెప్పుకునే జైమీ మాసన్ వాటిని దొంగలించి ఉంటాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ దొంగతనం వ్యవహారంలోనూ ఆయన పెరూలో దొరికిపోయాడని, ఆ తర్వాత స్థానిక అధికారులు అతనిపై క్రిమినల్ దర్యాప్తు సైతం ప్రారంభించారని వార్తలొచ్చాయి. ఇలా విచారణ కొనసాగుతుండగా.. మాసన్ గత వారం రెండు మమ్మీఫైడ్ నమూనాలను సమర్పించారు.
ఇవి 1000 సంవత్సరాల క్రితం నాటివని.. ఈ రెండూ నాన్-హ్యూమన్ డీఎన్ఏ కలిగి ఉన్నాయని మాసన్ తెలిపారు. ఆకారంలో చాలా చిన్నగా ఉండే ఈ అవశేషాలు ఏలియన్స్ అని అన్నారు. మూడు వేళ్లు మాత్రమే కలిగి ఉండే ఈ అవశేషాల పుర్రెలు మాత్రం పెద్దవిగా ఉన్నాయి. మావవులతో వీటికి సంబంధం లేదని, ఇవి ఏలియన్స్ అని చెప్పుకొచ్చారు. అయితే.. ఆయన వాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. UFO నిపుణులు సైతం దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే.. ఇవి తమకు UFOలో దొరకలేదని, ఒక గనిలో లభించాయని చెప్పారు. మరోవైపు.. మెక్సికోలోని అటానమస్ నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అవశేషాల్ని రేడియోకార్బన్ డేటింగ్ ఉపయోగించి అధ్యయనం చేశారు. 30 శాతం డీఎన్ఏ అజ్ఞాతంగా తేలిందని, స్కాన్‌లో ఒకదాని కడుపులో గుడ్లు కూడా ఉన్నట్టు వెల్లడైందని సమాచారం.
Updated Date - 2023-09-20T15:57:17+05:30 IST