Corona Virus: మళ్లీ కోరలు చాచిన కరోనా.. హడలెత్తిస్తున్న కొత్త వేరియంట్.. ప్రతి ఏడింటిలో ఒకటి
ABN, First Publish Date - 2023-08-06T19:39:29+05:30
ఆమధ్య కరోనావైరస్ యావత్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరూ ప్రత్యక్షంగా చూశారు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. అక్కడి నుంచి మెల్లగా సరిహద్దులను దాటుకుంటూ, మారణహోమం సృష్టించింది. దీని దెబ్బకు కొంతకాలం పాటు ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది.
కరోనావైరస్.. 2020-21 కాలంలో యావత్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరూ ప్రత్యక్షంగా చూశారు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. అక్కడి నుంచి మెల్లగా సరిహద్దులను దాటుకుంటూ, మారణహోమం సృష్టించింది. దీని దెబ్బకు కొంతకాలం పాటు ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. అయితే.. క్రమంగా దీని ప్రభావం తగ్గుతూ రావడంతో, జనాలు ఈ కరోనాతో సహజీవనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఈ వైరస్ మెల్లమెల్లగా తన కోరలు చాచుతోంది. కొత్త వేరియెంట్లతో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పలు రకాల వేరియెంట్లు మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేయగా.. తాజాగా యూకేలో మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.
ఈ కొత్త వేరియంట్‌ను ‘ఎరిస్’గా గుర్తించిన శాస్త్రవేత్తలు.. దీనికి ఈజీ.5.1 గా నామకరణం చేశారు. ఒమిక్రాన్ నుంచి ఈ వేరియంట్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. గత నెలలోనే యూకేలో బయటపడ్డ ఈ ఎరిస్ వేరియెంట్, ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యాపిస్తోంది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ రిపోర్ట్ (UKHSA) ప్రకారం.. ప్రస్తుతం నమోదు అవుతున్న ప్రతీ ఏడు కేసుల్లో ఒకరి ఎరిస్‌దేనని, యూకేలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న రెండో వేరియంట్ అని తేలింది. జులై 13వ తేదీన ఈ ‘ఎరిస్’ వేరియెంట్‌ని గుర్తించామని, ఆసియా దేశాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల వల్ల ఈ వేరియంట్ వ్యాప్తి చెందడం ప్రారంభమైందని UKHSA వెల్లడించింది. గత వారంతో పోలిస్తే, ఈ వారంలో కేసులు మరింత పెరిగాయని పేర్కొంది. ఆసుపత్రుల్లో అడ్మిషన్ రేట్స్ కూడా క్రమంగా పెరుగుతున్నాయని చెప్పింది.
ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా తరచుగా చేతులు కడుక్కోవాలని, అప్పుడే వైరస్‌ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని UKHSA సూచించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధి లక్షణాలుంటే.. సాధ్యమైనంతవరకు ఇతరులకు దూరంగా ఉండాలని, వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఇదే సమయంలో WHO స్పందిస్తూ.. వాక్సిన్స్, ముందస్తు ఇన్ఫెక్షన్‌ల ద్వారా ప్రజలు మెరుగైన రక్షణ పొందుతున్నప్పటికీ.. నిర్లక్ష్య ధోరణి వహించరాదని తెలిపింది. యూకేలో ఈ కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. నిపుణులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పింది. దాని వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా సూచిస్తోంది.
Updated Date - 2023-08-06T19:44:07+05:30 IST