Pirola Variant: వార్నింగ్ బెల్స్ మోగిస్తున్న కరోనా కొత్త వేరియెంట్.. ఇతర వాటికంటే ఇది చాలా డేంజర్
ABN, First Publish Date - 2023-09-03T21:43:02+05:30
కొన్నాళ్ల క్రితం కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని ఎలా హడలెత్తించిందో అందరికీ తెలుసు. 2020-21 మధ్యకాలంలో ఇది ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. యావత్ ప్రజానీకానికి...
కొన్నాళ్ల క్రితం కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని ఎలా హడలెత్తించిందో అందరికీ తెలుసు. 2020-21 మధ్యకాలంలో ఇది ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. యావత్ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. కంటికి కనిపించని ఈ చిన్న వైరస్.. లక్షలాది మందిని తన పొట్టన పెట్టుకుంది. అయితే.. క్రమంగా ఈ వైరస్ ప్రభావం తగ్గడంతో, దీన్నుంచి విముక్తి కలిగిందని అంతా అనుకున్నారు. ఇది పూర్తిగా కనుమరుగు కాకపోయినా.. జనాలు ఈ వైరస్‌తోనే కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడే ఆ వైరస్.. తన రూపాల్ని మార్చుకుంటూ, ప్రపంచంపై తిరిగి దాడి చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ వైరస్ నుంచి బీటా, డెల్టా, ఓమిక్రాన్ వంటి కొత్త వేరియెంట్లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఓమిక్రాన్ వేరియెంట్ అయితే 2021లో మారణకాండ సృష్టించింది.
ఇప్పుడు తాజాగా దీనికంటే భయంకరమైన కొత్త వేరియెంట్ పుట్టుకొచ్చి, డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాని పేరే BA.2.86 లేదా పిరోలా! ఇది ఓమిక్రాన్ వేరియంట్‌కి సబ్ వేరియంట్. ఇజ్రాయెల్, కెనడా, డెన్మార్క్, యూకే, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో ఈ పిరోలా వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఈ వేరియెంట్ కేసులు చాలా దేశాల్లో నమోదు అయ్యాయని.. పైగా ఇది గత వేరియెంట్ల కంటే చాలా డేంజరస్ అని పేర్కొంటున్నారు. పిరోలా వేరియంట్‌లో ఉత్పరివర్తనాలు చాలా భిన్నంగా ఉన్నాయని, 36 మ్యుటేషన్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి రోగ నిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకోగలవని, తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే.. ఇది ఎంత తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందో ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ఈ కొత్త వేరియెంట్ గురించి అమెరికాకు చెందిన కార్డియాలజీ నిపుణుడు, స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌స్లేషనల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ.. దీని స్పైక్ ప్రోటీన్‌లో 35 కంటే ఎక్కువగా ఉత్పరివర్తనాలు ఉన్నాయన్నారు. ఇవి.. మానవకణాల్లోకి సులువుగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు. గతంలో వచ్చిన వేరియెంట్లతో పోలిస్తే.. ఈ పిరోలా మ్యుటేషన్లు భిన్నంగా ఉన్నాయన్నారు. మరోవైపు.. ఈ పిరోలా వేరియంట్‌ను ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది.
Updated Date - 2023-09-03T21:43:02+05:30 IST