Newzealand Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. 6.1 తీవ్రత
ABN, First Publish Date - 2023-02-15T14:37:47+05:30
గాబ్రియేల్ తుఫానుతో ఇప్పటికే గజగజలాడుతున్న న్యూజిలాండ్ లో బుధవారం ఉదయం భారీ భూకంపం..
వెల్లింగ్టన్: గాబ్రియేల్ తుఫానుతో ఇప్పటికే గజగజలాడుతున్న న్యూజిలాండ్ (New Zealand)లో బుధవారం ఉదయం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. వాయవ్య పరపరము (Paraparaumu) పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర గుర్తించారు. భూకం ధాటికి పలు చోట్ల కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు. లెవిన్,పొరిరువ, ఫ్రెంచ్ పాస్, అప్పర్ హట్, లోయర్ హట్, వెల్టింగ్టన్, వాంగనుయి, వావెర్లీ, పల్మెర్‌స్టర్ నార్త్, ఫీల్డింగ్, పిక్టార్, ఎకెతహున, మాస్టర్‌టన్, మార్టిన్‌బొరో, హుంటర్‌వెల్లి తదితర ప్రాంతాల్లో ప్రపంకనలు సంభవించాయి.
కాగా, న్యూజిలాండ్‌ను గత కొద్ది రోజులుగా గాబ్రియెల్ తుఫాను (Cyclone Gabriel) వణికిస్తోంది. బలమైన గాలుపు, భారీ వర్షాలతో నార్త్, సౌత్ ఐలాండ్స్ అతలాకుతలమవుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతూ పలు ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. అనేక మంది ఇప్పటికీ రూఫ్‌టాప్‌లపై చిక్కుకున్నారు. రోడ్లు కుంగిపోవడం, విద్యుత్ స్తంభాలు, చెట్టు పెద్దఎత్తున విరిగిపడటంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విమానాల రాకపోకలను నిలిపివేశారు. న్యూజిలాండ్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) ప్రకటించింది. 2019లో క్రిస్ట్‌చర్చిపై దాడి, ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించడం ఇది మూడోసారి.
వరదలు, తుపాను, ఇప్పుడు భూకంపం...
తీవ్రమైన వరదలు, సైక్లోన్ గాబ్లియెన్‌తో చిగురుటాకులా వణుకుతున్న న్యూజిలాండ్‌ను శక్తివంతమైన భూకంపం తాకడంతో న్యూజిలాండ్ ఎంపీ ఆంగెలో వాన్ మొల్లెర్ బుధవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సైక్లోన్ ధాటికి కొండచరియలు విరిగిపడి లెక్కకు మించి ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వరద నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సంక్లిష్టంగా మారిందన్నారు. లెక్కకు మించి ప్రజలు ఇప్పటికీ ఇళ్ల పైకప్పులపైనే నిలిచిపోయారు. నార్త్‌లాండ్, ఆక్లాండ్, బే ఆఫ్ ఫ్లెంటీ సహా తొమ్మిది ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. పెద్ద శబ్దంతో, బయోత్పాతం సృష్టించే విధంగా భూమి కంపించిందని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని, తాము సురక్షితంగా ఉన్నామని పలువురు న్యూ జిలాండ్ వాసులు సోషల్ మీడియాలో తమకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.
Updated Date - 2023-02-15T14:37:49+05:30 IST