Rishi Sunak: రిషి సునాక్‌కి ఊహించని దెబ్బ.. సొంత పార్టీ నుంచే అవిశ్వాస తీర్మానం.. కారణం అదే!
ABN, First Publish Date - 2023-11-14T19:45:36+05:30
యూకే ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచే రిషి సునాక్‌కి ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ఆయన ముందున్న సవాళ్లలో అతిపెద్దది. ఇలాంటి తరుణంలో ఆయనకు మరో ఊహించని దెబ్బ తగిలింది.
United Kingdom: యూకే ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచే రిషి సునాక్‌కి ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ఆయన ముందున్న సవాళ్లలో అతిపెద్దది. ఇలాంటి తరుణంలో ఆయనకు మరో ఊహించని దెబ్బ తగిలింది. సొంత పార్టీ నుంచే ఆయనకు తొలి అవిశ్వాసం ఎదురైంది. భారత సంతతికి చెందిన (హోంమంత్రి) సుయెల్లా బ్రేవర్‌మన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడమే అందుకు కారణం. రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ ఈ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆమె ‘అవిశ్వాస’ లేఖను హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహరాలను చూసే ‘1922’ కమిటీ ఛైర్మన్‌కి సమర్పించారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘‘ఇక జరిగింది చాలు. 1992 కమిటీ ఛైర్మన్‌కు నేను నా అవిశ్వాస లేఖను సమర్పించా. ప్రధాని పదవి నుంచి రిషి సునాక్‌ను తొలగించి.. ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది’’ అని ఆండ్రియా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. తాను సమర్పించిన ఆ అవిశ్వాస లేఖలో.. కేబినెట్ నుంచి సుయెల్లా బ్రేవర్మన్‌ను తొలగించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. తన కేబినెట్‌లో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి సువెల్లాపై రిషి సునాక్ వేటు వేశారని, ఈ వేటుని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇంతకుముందు తమ కన్జర్వేటివ్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించిన బోరిస్ జాన్సన్‌ను తప్పించడమే పెద్ద తప్పు అని, ఇప్పుడు సుయెల్లాను కేబినెట్ నుంచి తొలగించడం మరింత దారుణమని ఆమె మండిపడ్డారు. ప్రధాని పదవి నుంచి రిషి సునాక్ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస లేఖలు సమర్పించాలని తోటి ఎంపీలను ఆమె అభ్యర్థించారు.
అయితే.. రిషి సునాక్‌కి వ్యతిరేకంగా ఇది తొలి అశిశ్వాస లేఖ మాత్రమే కావడంతో, ఆయనకు అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరమైతే లేదు. ఒకవేళ పార్టీకి చెందిన ఎంపీలలో 15 శాతం మంది రిషికి వ్యతిరేకంగా గళమెత్తితే మాత్రం.. అప్పుడు పార్టీలో ఆయన నాయకత్వంపై విశ్వాస పరీక్ష ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులైతే కనిపించడం లేదు. మరోవైపు.. కొంతకాలం నుంచి సుయెల్లా తరచూ వివాదాల్లో చిక్కుకుంటోందని, అందుకే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించామని రిసి సునాక్ ప్రభుత్వం పేర్కొంది. ఆమె స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీకి హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు.
Updated Date - 2023-11-14T19:45:37+05:30 IST