Turkey Earthquake: టర్కీలో మూడో భూకంపం.. 1400 దాటిన మృతుల సంఖ్య
ABN, First Publish Date - 2023-02-06T19:06:42+05:30
వరుస భూకంపాలతో టర్కీ(Turkey) చిగురుటాకులా వణుకుతోంది
అంకారా: వరుస భూకంపాలతో టర్కీ(Turkey) చిగురుటాకులా వణుకుతోంది. ఈ తెల్లవారుజామున 7.8 తీవ్రతతో ఆగ్నేయ టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. భవనాలు నేలమట్టం కావడంతో అందులో నివసిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 1400 మందికిపైగానే మృతి చెందారు. వేలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతుండగానే మధ్యాహ్నం 1.24 గంటలకు రెండోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది.
ఆ తర్వాత కాసేపటికే 6.0 తీవ్రతతో మూడో భూకంపం విరుచుకుపడింది. వరుస భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిలువ నీడ కోల్పోయిన ప్రజలు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజా భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్టు గుర్తించారు. 12 గంటల స్వల్ప వ్యవధిలో మూడో భూకంపం సంభవించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 1400 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా శిథిలాల కింద వందలాదిమంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సహాయక కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య 5 వేలకు పైనే ఉండొచ్చని భావిస్తున్నారు.
టర్కీతోపాటు సిరియాలోనూ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సోమవారం నాటి భూకంపం గత శతాబ్దకాలంలోనే అతిపెద్దదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అన్నారు. భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాలు, హృదయవిదారకంగా ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకంపనలతో భయపడిన ప్రజలు భవనాల్లోంచి రోడ్లపైకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
టర్కీ, సిరియాల్లో భూకంపాలు సృష్టించిన విలయంపై భారత్ సహా అనేక దేశాలు స్పందించాయి. రెండు దేశాలకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ఔషధాలు, రెస్క్యూ సిబ్బందిని పంపిస్తామని భారత్ హామీ ఇవ్వగా, యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. తమ బృందాలను టర్కీకి పంపిస్తున్నట్టు తెలిపింది. అలాగే, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. సాధ్యమైనంత వరకు సాయం అందిస్తామని బ్రిటిన్ ప్రధాని రిషి సునాక్ ట్వీట్ చేశారు.
Updated Date - 2023-02-06T19:30:08+05:30 IST