UK: పన్ను చెల్లింపుల్లో పార్టీ చైర్మన్ అవకతవకలు.. బ్రిటన్ ప్రధాని కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2023-01-29T21:25:48+05:30
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన పార్టీ సభ్యుడిని కీలక పదవి నుంచి తొలగించారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) తన పార్టీ సభ్యుడిని కీలక పదవి నుంచి తొలగించారు. పన్ను చెల్లింపులకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినందుకు టోరీ పార్టీ చైర్మన్(Tory Chairman) నదీమ్ జహావీని(Nadhim Zahawi) పదవి నుంచి తప్పించారు. మంత్రిపదవిలో ఉన్న వాళ్లు పాటించాల్సిన నియమావళిని జహావీ ఉల్లంఘించినట్టు దర్యాప్తులో వెల్లడవడంతో రిషి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సభ్యుల నియమావళి విషయంలో ఆయన తీవ్ర స్థాయి ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా రిషి సునాక్ పేర్కొన్నారు. ఆయన పార్టీ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
పన్ను వివరాలు వెల్లడించడంలో జహావీ నిర్లక్ష్యంగా వ్యవహరించి తక్కువగా పన్ను చెల్లించారని గతంలో అక్కడి ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. దీంతో..జహావీ పన్నుల శాఖతో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 4.8 మిలియన్ పౌండ్లను పెనాల్టీగా చెల్లించారు. ఈ వివరాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో రిషి ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. రిషి స్వతంత్ర ద్యాప్తునకు ఆదేశించారు. ఇందులో జహావీ నైతిక నియమావళిని ఉల్లంఘించినట్టు తేలడంతో రిషి ఆయనను పార్టీ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. 55 ఏళ్ల జహావీ 11 ఏళ్ల వయసులో ఇరాక్ నుంచి శరణార్థిగా బ్రిటన్‌కు వలసొచ్చారు.
Updated Date - 2023-01-30T00:02:30+05:30 IST